Begin typing your search above and press return to search.

తెలంగాణ నుండి వచ్చినవారందరు అన్నవరంలోనే ..?

By:  Tupaki Desk   |   28 March 2020 12:30 AM GMT
తెలంగాణ నుండి వచ్చినవారందరు అన్నవరంలోనే ..?
X
తెలంగాణలో పనిచేసే ఆంధ్రా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఇపుడు అన్నవరంలో ఇరుక్కుపోయారు. లాక్ డౌన్ కారణంగా సొంత ఊర్లకి వెళ్దాం అని హైదరాబాద్ నుంచి బయలు దేరిన సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్ ఇపుడు ఇటు హైదరాబాద్‌ కు , అటు సొంతిళ్ళకు చేరలేక మధ్యలో ఇరుక్కుపోయారు. ఏకంగా 14 రోజుల క్వారెంటైన్ సెంటర్‌ కు వారిపుడు పరిమితమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

లాక్ డౌన్ ప్రకటించడం.. హైదరాబాద్‌ లో వున్న వర్కింగ్ హాస్టళ్ళను మూసి వేస్తున్నారన్న వార్తలు గందరగోళ పరచడం తో వందలాది మంది సాఫ్ట్ ‌వేర్ ఉద్యోగులు, స్టూడెంట్స్ హైదరాబాద్ వదిలి సొంతూళ్ళకు బయలుదేరారు. అయితే వారిని రానిస్తే.. కరోనా ఎఫెక్టు రెండో దశను దాటి మూడో దశకు చేరుతుందన్న భయం తో వారి రాకను అడ్డుకున్నారు ఏపీ పోలీసులు. అయితే, ఆ తరువాత ప్రభుత్వాల జోక్యంతో కొంతమంది ఏపీలోకి ఎంటరైపోయారు.అయితే వీరిని నేరుగా వారి ఇళ్ళకు పంపితే ప్రమాదమని భావించిన ఏపీ అధికారులు వారిని ప్రత్యేక క్వారెంటైన్ సెంటర్లకు పంపాలని నిర్ణయించారు.

అందులో భాగంగా హైదరాబాద్ నుంచి విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాలకు బయలు దేరిన వారిని తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం కాటేజ్ లకు తరలించారు. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం కాటేజ కరోనా క్వారంటైన్ సెంటర్‌ గా మారిపోయింది. అందులో తెలంగాణా నుంచి వచ్చిన 93 మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులను హరిహర సదన్ కాటేజ్ క్వారంటైన్ సెంటర్‌కు అధికారులు తరలించారు. వీరంతా గురువారం సాయంత్రానికి తెలంగాణ నుంచి వచ్చిన ఏపిలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళేందుకు వచ్చిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా గుర్తించారు.