Begin typing your search above and press return to search.

రాత్రి ఆఫీస్ పార్టీకి వెళ్లి.. పొద్దున్నే సూసైడ్‌

By:  Tupaki Desk   |   7 May 2018 7:41 AM GMT
రాత్రి ఆఫీస్ పార్టీకి వెళ్లి.. పొద్దున్నే సూసైడ్‌
X
ప్రేమించి మ‌రీ పెళ్లి చేసుకున్న భ‌ర్త‌.. ముచ్చ‌ట‌గా ముగ్గురు పిల్ల‌లు.. దీంతో పాటు.. ఆర్థికంగా ఎలాంటి లోటు లేని జీవితం. ఇదంతా విన్నాక ఇంకేం కావాలి? అన్న ప్ర‌శ్న వ‌స్తుంది. కానీ.. అంద‌రికి ఆ మాటే క‌నిపిస్తుంది కానీ.. క‌నిపించ‌ని కోణాలు జీవితాల్లో ఉంటాయ‌న‌టానికి తాజా ఉదంతం ఒక నిద‌ర్శ‌నంగా చెప్పాలి. హైద‌రాబాద్‌ లోని చందాన‌గ‌ర్లో తాజాగా ఒక ఐటీ ఉద్యోగిని ఆత్మ‌హ‌త్య చేసుకున్న వైనం క‌ల‌కలం రేప‌ట‌మే కాదు.. దాంప‌త్య జీవితంలో భార్య‌..భ‌ర్త‌లు ఇద్ద‌రి మ‌ధ్య పెర‌గాల్సిన అవ‌గాహ‌న విష‌యాన్ని ఈ విషాదం మ‌రోసారి నిరూపించింద‌ని చెప్పాలి.

వ‌న‌స్థ‌లిపురానికి చెందిన రేఖ‌.. లంగ‌ర్ హౌస్ కు చెందిన ఉజ్వ‌ల్ ను ప్రేమించింది. అనంత‌రం పెద్ద‌ల్ని ఒప్పించి మ‌రీ పెళ్లి చేసుకున్నారు. భార్య‌భ‌ర్త‌లు ఇద్ద‌రూ ఐటీ ఉద్యోగులే. జీతం విష‌యంలో వారికి ఎలాంటి లోటు లేదు. వారి అన్యోన్య దాంప‌త్యానికి గురుతుగా ముగ్గురు పిల్ల‌లు. అంతా బాగుంది అనుకున్న వేళ అసంతృప్తి.. అనుమానం ఆ ప‌చ్చ‌ని సంసారంలో నిప్పులు పోశాయి. భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య క‌ల‌హాలు మొద‌లై.. చివ‌ర‌కు రేఖ ఆత్మ‌హ‌త్య చేసుకునే వ‌ర‌కూ వెళ్లింది.

ఆఫీసుకు ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌ని చందాన‌గ‌ర్లోని అప‌ర్ణ గార్డినియాలో వారు ఫ్లాట్ కొన్నారు. ఇటీవ‌ల పెరిగిన ఖ‌ర్చులు.. ఎంత సంపాదించినా స‌రిపోని బ‌డ్జెట్ లెక్క‌లకు తోడుగా.. భ‌ర్త‌కు అనుమానం జ‌బ్బు ప‌ట్టుకుంది. ఆఫీసు నుంచి ఆల‌స్యంగా వ‌స్తున్నావ్‌? ఇంట్లో వంట చేసి నాలుగు రోజులైంది.. ఇంటిని ప‌ట్టించుకోవ‌టం లేదు.. ఎప్పుడూ పార్టీలేనా? ఇలా మొద‌లైన సూటిపోటి మాట‌లు రేఖ‌కు జీవితం మీద విర‌క్తి పెంచేలా చేశాయి.

ప్రేమించి పెళ్లి చేసుకున్న భ‌ర్త ఆంక్ష‌ల న‌డుమ‌.. కాలు తీసి కాలు బ‌య‌ట‌పెట్ట‌ట‌మే క‌ష్టంగా మారిన‌ట్లుగా రేఖ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. చివ‌ర‌కు త‌మ‌తో ఫోన్ చేసి మాట్లాడాల‌న్న భ‌ర్త ముందే మాట్లాడాల‌న్న ఆంక్ష‌లే రేఖ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి కార‌ణంగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌టానికి ముందు రోజు ఆమె ప‌ని చేస్తున్న ఐబీఎం సంస్థ ఒక ప‌బ్ లో పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి భ‌ర్తే వెళ్లి దింపి వ‌చ్చారు. తిరిగి రావ‌టం ఆల‌స్యంగా రావ‌టం.. ఇంత ఆల‌స్యంగా రావ‌టమా? అంటూ సూటిపోటిమాట‌లు ఇద్ద‌రి మ‌ధ్య చోటు చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ఎవ‌రి గ‌దిలో వారు ప‌డుకుండిపోయారు. తెల్లారి లేచి రేఖ గ‌దిలోకి వెళ్లిన భ‌ర్త‌కు.. ఆమె చున్నీతో ఫ్యాన్‌ కు ఉరి వేసుకున్న‌ది చూసి.. వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. భ‌ర్త‌పైన కేసు న‌మోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

ఈ ఉదంతాన్ని చూసిన‌ప్పుడు అనిపించేది ఒక్క‌టే. జీవితంలో అన్నికావాలంటే సాధ్యం కాదు. మ‌గాడితో పాటు ఉద్యోగం చేస్తున్న‌ప్పుడు కొన్ని హెచ్చుత‌గ్గులు ఉంటాయి. వాటిని సామ‌ర‌స్యంగా మాట్లాడుకోవ‌టం ద్వారా అభిప్రాయ బేధాలు త‌గ్గించుకోవాలే కానీ పోట్లాట‌తో ప్రాణాలు తీసుకోవ‌టం ఏమాత్రం స‌రికాదు. వారి ఆనందానికి ముగ్గురు పిల్ల‌ల్ని క‌ని.. ఇప్పుడు వారి భ‌విష్య‌త్ ఏమిటి? వారేం త‌ప్పు చేశార‌ని.. త‌ల్లి లేని జీవితాన్ని వారు అనుభ‌వించాలి? ఆవేశంతో ఆత్మ‌హ‌త్య చేసుకునే ముందు కాస్త‌.. ఆలోచిస్తే బాగుంటుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు.