Begin typing your search above and press return to search.

మ‌హారాష్ట్ర‌లో తొలి తెలుగు మేయ‌ర్‌కు పాజిటివ్‌, ఆమె భర్త‌కు కూడా

By:  Tupaki Desk   |   6 Jun 2020 7:10 AM GMT
మ‌హారాష్ట్ర‌లో తొలి తెలుగు మేయ‌ర్‌కు పాజిటివ్‌, ఆమె భర్త‌కు కూడా
X
మ‌హ‌మ్మారి వైర‌స్ మ‌హారాష్ట్ర‌లో అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. ఆ రాష్ట్రంలో మొత్తం కేసులు 80 వేలు దాట‌గా, మ‌ర‌ణాలు రెండున్న‌ర వేల‌కు చేరాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజ‌ధాని, దేశ ఆర్థిక రాజ‌ధానిగా ఉన్న ఒక్క‌ ముంబైలోనే 50 వేల కేసులు ఉన్నాయి. ఈ విధంగా వైర‌స్ ఆ రాష్ట్రంలో విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే మ‌హారాష్ట్రలోనే తొలి తెలుగు మేయ‌ర్ కూడా ఆ వైర‌స్ బారిన ప‌డ్డారు. ఆమెనే షోలాపూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎంసీ) మేయర్ యెన్నం కాంచ‌న‌. మేయ‌ర్‌గా ఎన్నికైన తొలి తెలుగు మహిళ ఆమె. ఆమెతోపాటు ఆమె భర్త రమేశ్‌కు కూడా వైర‌స్ సోకింద‌ని శుక్రవారం వైద్యాధికారులు ప్ర‌క‌టించారు. దీంతో మేయర్‌ దంపతులను ఆస్పత్రికి తరలించారు.

తెలంగాణ‌లోని ఉమ్మడి మెదక్‌ జిల్లా సదాశివ పేటకు చెందిన కాంచన 2019 డిసెంబర్‌ లో జరిగిన మున్సిప‌ల్ ఎన్నికల్లో షోలాపూర్‌ మేయర్‌గా ఎన్నికై సంచ‌ల‌నం సృష్టించారు. షోలాపూర్ ప్రాంతంలో అత్య‌ధికంగా తెలుగు వారు నివ‌సిస్తుంటారు. చాలామంది స్థిర‌ప‌డ్డారు. వారిలో కాంచ‌న కుటుంబం కూడా ఒక‌టి. అయితే మేయర్‌ దంపతులిద్దరికీ వైర‌స్ సోకడంతో షోలాపూర్ మున్సిపాలిటీ యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. వారు నివసిస్తున్న ప్రాంతాన్ని అధికారులు శానిటైజ్‌ చేశారు.

అయితే ఏకంగా మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్‌కు వైర‌స్ సోక‌డంతో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మై క‌ట్ట‌డి చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందులో భాగంగా లాక్‌డౌన్‌ సమయంలో ఆమె ఎక్కడెక్కడ పర్యటించారు.. ఎవరెవరిని కలిశారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. లాక్‌డౌన్‌ అమల్లోకి వ‌చ్చిన స‌మ‌యంలో పారిశుద్ధ్య ప‌నుల‌తో పాటు క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు వంటి వాటిపై చ‌ర్య‌లు తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె పలు చోట్ల పర్యటించారు. ఈ క్రమంలోనే ఆమె వైర‌స్ బారిన ప‌డ్డ‌ట్టు గుర్తించారు. ఆమె వారం రోజులుగా అస్వస్థతకు గురవ‌డంతో వైద్యాధికారులు ప‌రీక్షించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె భర్త, వెంట తిరిగిన పలువురు ఉద్యోగులు, అధికారులకు కూడా వ్యాధి నిర్ధార‌ణ పరీక్షలు చేయ‌గా వారిలో ఆమె భర్తకు మాత్ర‌మే సోకింది. మిగతా వారికి నెగెటివ్‌ వచ్చింది. అయితే వారి కుటుంబాన్ని, మేయ‌ర్ కార్యాల‌యంలోని సిబ్బంది, ఆమె భ‌ద్ర‌తా సిబ్బంది కూడా ప‌రీక్ష‌లు చేస్తున్నారు.