Begin typing your search above and press return to search.

పాక్ పై యుద్ధానికి మరో కుమారుడిని పంపిస్తా

By:  Tupaki Desk   |   15 Feb 2019 9:31 AM GMT
పాక్ పై యుద్ధానికి మరో కుమారుడిని పంపిస్తా
X
కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందడంపై భారతావని రగిలిపోతోంది. ప్రతీకారేచ్చతో అందరూ పాకిస్తాన్ పై నిప్పులు కురిపిస్తున్నారు. చనిపోయిన వీరజవాన్లకు అధికారికంగా ఈరోజు అంత్యక్రియలు జరుపుతున్నారు.

తాజాగా ఓ వీరజవాన్ తండ్రి భావోద్వేగంతో చేసిన ప్రకటన అందరిలోనూ దేశభక్తిని నింపింది. పాకిస్తాన్ కు తగిన సమాధానం చెప్పడం కోసం అవసరమైతే మరో కుమారుడిని కూడా సైన్యంలోకి పంపిస్తాను అంటూ ఓ వీరజవాన్ తండ్రి పేర్కొనడం మీడియాలో హైలెట్ గా మారింది. బీహార్ భాగల్ పూర్ కు చెందిన రతన్ ఠాకూర్ ఈ సందర్భంగా జాతీయ మీడియాతో భావోద్వేగంతో మాట్లాడారు. ‘నా కొడుకు దేశం కోసం ప్రాణాలర్పించాడు. భారతమాత కోసం ప్రాణాలర్పించి చరిత్రలో నిలిచిపోయాడు. ఓ తండ్రిగా ఇందుకు నేను గర్విస్తున్నాను. ప్రస్తుతం నేను బాధను, గర్వాన్ని అనుభవిస్తున్నాను. నా కొడుకు లాంటి వీర జవాన్లను చంపి.. వారి తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చిన పాకిస్తాన్ కు బుద్దిచెప్పాలి. పాక్ కు తగిన గుణపాఠం చెప్పడం కోసం మరో కుమారుడిని కూడా సైన్యంలోకి పంపిస్తాను. తనను కూడా భారత మాత సేవకే అర్పిస్తాను’ అంటూ ఉద్వేగంగా మాట్లాడడం వైరల్ గా మారింది.

ఇక భారత జవాన్ల మరణానికి కారణమైన ఉగ్రవాదులపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మండిపడ్డారు. ఇప్పటివరకు జరిగింది చాలని.. వెంటనే పాకిస్తాన్ తో యుద్ధం చేయాల్సిందేనని పేర్కొన్నారు. 43మంది జవాన్ల మరణంపై తీవ్రంగా కలత చెందిన గంభీర్.. ఆవేశంగా ఇక మాటల్లేవని.. యుద్ధమే ఈ సమస్యకు పరిష్కారమని ట్విట్టర్ వేదికగా తన ఆవేదన వెలిబుచ్చాడు. క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మన్, సురేష్ రైనాలు ఈ దాడిని ట్విట్టర్ లో ఖండించారు.

ఇక భారత్ పై ఉగ్రవాదుల దాడిని యావత్ ప్రపంచం ఖండిస్తోంది. అమర జవాన్లకు ప్రధాని నుంచి మంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా సినీ రాజకీయ, క్రీడా ప్రముఖులు అందరూ నివాళులర్పిస్తున్నారు.