Begin typing your search above and press return to search.

డీజీపీ బదిలీ... శంకరగిరిమాన్యాలే అంటూ బీజేపీ...?

By:  Tupaki Desk   |   16 Feb 2022 12:30 PM GMT
డీజీపీ బదిలీ... శంకరగిరిమాన్యాలే అంటూ బీజేపీ...?
X
ఏపీలో డీజీపీ గౌతం సవాంగ్ బదిలీ వ్యవహారం ఇపుడు రాజకీయాల్లో హాట్ హాట్ గా ఉంది. మధ్యాహ్నం వరకూ ఆయన డీజీపీ. సడెన్ గా జగన్ తీసుకున్న నిర్ణయంతో ఏ పోస్టింగూ లేకుండా మాజీ అయిపోయారు. దీంతో ఇపుడు విపక్షాలు అన్నీ కూడా ఏపీలో ఈ బదిలీలల మీద తమదైన శైలిలో పంచులు విసురుతున్నాయి.

మంచి మాటకారి అయిన బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు అయితే పాత డీజీపీ ప్రభుత్వానికి ఎంతో చేశారు, కానీ చివరికి ఆయన్ని శంకర గిరి మాన్యాలు పట్టించారు. చివరికి ఎవరికైనా ఇదే తీరు అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు అని మండిపడ్డారు. అప్పట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం విషయంలో వైసీపీ పెద్దలు ఇలాగే చేశారు అని సోము గుర్తు చేశారు.

ఇదంతా పాలనా పరమైన అస్థిరతకు దారితీస్తోంది అని కూడా వ్యాఖ్యానించారు. ఎవరు ఎపుడు ఉంటారో ఎపుడు వెళ్ళిపోతున్నారో ఎవరికీ తెలియడంలేదని సోము హాట్ కామెంట్స్ చేశారు. ఇలాగైతే ప్రభుత్వ పాలన సాఫీగా ఎలా సాగుతుంది అని నిలదీశారు. ఇది మంచి విధానమేనా అని కూడా ప్రశ్నించారు.

ఇక ప్రభుత్వం చెప్పినట్లుగా నడచుకుని బీజేపీ మీద లేని పోని కేసులను పోలీసులు బనాయిస్తున్నారని, ఆ విధంగా కర్నూల్ లో కేసులు పెట్టిన వారందరి మీద వాటిని రద్దు చేయాలని సోము డిమాండ్ చేశారు. అదే విధంగా ఏపీలో ప్రభుత్వం అభివృద్ధి ఏం చేసిందో బహిరంగ చర్చలు రావాలని ఆయన కోరారు.

గత టీడీపీ సర్కార్ ఏలుబడిలో రాజధాని నిర్మాణానికి ఏకంగా 7,200 కోట్ల రూపాయలను ఇచ్చామని వాటిని ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ మొత్తం ఎలా ఖర్చు చేశారో ప్రస్తుత ప్రభుత్వం అయినా వివరాలు చెప్పాలని ఆయన కోరారు. ఏపీలో అప్పులను చేయడంలోనే చంద్రబాబు, జగన్ పోటీ పడుతున్నారని, తాము మాత్రం వేల కోట్లను ఏపీ కోసం ఖర్చు చేస్తున్నామని ఆయన చెప్పారు.

ప్రత్యేక హోదా కంటే కూడా ఎన్నో రెట్లు అభివృద్ధిని తాము చేస్తూంటే తమ మీద బురద జల్లడానికే రాజకీయంగా హోదా అంశాన్ని టీడీపీ, వైసీపీ తరచూ లేవనెత్తుతున్నాయని సోము విమర్శించారు. ఇక దేశం నుంచి మోడీని వెళ్లగొడతామని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ అనడం పట్ల సోము ఫైర్ అయ్యారు. భారత్ ని అన్ని విధాలుగా అగ్రగామిగా నిలబెడుతున్నందుకా మోడీని దేశం నుంచి వెళ్లగొడతారు అని ఆయన ప్రశ్నించారు.

గతంలో ఇలాగే మోడీ మీద రంకెలేసిన చంద్రబాబుకు ఏపీలో 23 సీట్లు వచ్చాయని, వచ్చే ఎన్నికల్లో కేసీయార్ కి కూడా తెలంగాణాలో 15 సీట్లు మించి రావని సోము జోస్యం చెప్పారు. బీజేపీతో పెట్టుకుంటే జాగ్రత్తగా ఉండాలని ఏపీలోని కుటుంబ పార్టీలను హెచ్చరిస్తున్నామని కూడా ఆయన అన్నారు.