Begin typing your search above and press return to search.

కేసీఆర్‌కు షాక్‌... టీఆర్ఎస్‌లో కీల‌క వికెట్ ప‌డింది

By:  Tupaki Desk   |   9 July 2019 6:46 AM GMT
కేసీఆర్‌కు షాక్‌... టీఆర్ఎస్‌లో కీల‌క వికెట్ ప‌డింది
X
టీఆర్ ఎస్ అసంతృప్తులు బీజేపీ బాట పడుతున్నారు. పోయిన సారి రామగుండం ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా కేసీఆర్ ఆశీర్వాదంతో ఆర్టీసీ చైర్మన్ పదవిని కొట్టేశారు సోమారపు సత్యనారాయణ. టీఆర్ ఎస్ లో సీనియర్ నేతగా ఉన్న ఈయనకు కేసీఆర్ అత్యున్నత పదవిని ఇచ్చారు.

అయితే 2018 అసెంబ్లీ ఎన్నికలు ఆయనకు పీడకలను మిగిల్చాయి. రామగుండం నుంచి పోటీచేసిన సోమారపు ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయనకు పార్టీలో ట్రైన్ రివర్స్ అయ్యింది. ఈయనపై గెలిచింది టీఆర్ఎస్ రెబల్ కోరుకంటి చందర్. చందర్ టీఆర్ ఎస్ లో చేరి ఇప్పుడు ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీని లీడ్ చేస్తూ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.

పంచాయతీ, పరిషత్, ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల బాధ్యతలను కూడా టీఆర్ ఎస్ అధిష్టానం ఎమ్మెల్యే చందర్ కే అప్పగించిందట.. దీంతో అలిగిన సోమారపు తాజాగా మంగళవారం టీఆర్ఎస్ కు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. కేసీఆర్ కు సన్నిహితుడైన సోమారపు పార్టీని వీడడం టీఆర్ఎస్ కు షాక్ లా మారింది.

పార్టీలో తనకు గౌరవం లేదని.. పార్టీలో కలిసి పనిచేయడం సాధ్యం కాదనే టీఆర్ ఎస్ కు రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్టు తెలిపారు.

ఇలా అధికార గులాబీ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లే తొలి సీనియర్ నేత సోమారపు కావడం విశేషం. మరీ ఈ పదవుల పందేరంలో ఇంకా ఎంతమంది బీజేపీలోకి వెళుతారో తెలియని పరిస్థితి నెలకొంది. కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్లు దక్కని వారంతా అటువైపే వెళ్లే చాన్స్ ఉంది.