Begin typing your search above and press return to search.

దేవుడికే పంగనామాలు.. బెజవాడలో 10 కోట్ల దేవుడి భూమి స్వాహా!

By:  Tupaki Desk   |   11 July 2020 10:10 AM GMT
దేవుడికే పంగనామాలు.. బెజవాడలో 10 కోట్ల దేవుడి భూమి స్వాహా!
X
బెజవాడలోని ఖరీదైన స్థలమిదీ.. దేవస్థానం భూమిపై కొందరు పెద్దల కన్ను పడింది. నేరుగా పాగా వేస్తే విమర్శలు వస్తాయని భావించిన వారు ‘పీఠం’ ఏర్పాటు చేసి ఆ స్థలాన్ని అప్పగించేలా స్కెచ్ గీశారు. తమ చేతికి మట్టి అంటకుండా కాగల కార్యం ‘పీఠం’ ద్వారా కానిచ్చేలా చేస్తున్నారని బెజవాడలో కోడై కూస్తున్నారు.

అది విజయవాడలోని అత్యంత ఖరీదైన సత్యనారాయణపురం ప్రాంతం. ఇక్కడ శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి దేవస్థానం ప్రఖ్యాతి చెందింది. సత్యనారాయణ పురానికి చెందిన తాడేపల్లి సీతమ్మ 60 ఏళ్ల కిందట సూమారు 600 గజాల డాబా ఇల్లును దానం చేసింది. 1957లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆస్తిని దేవస్థానం పేరు మీద రిజిస్టర్ చేయించింది. దీనికి అదనంగా దాతలు ఇచ్చిన మరో 300 గజాలతో మొత్తం 900 గజాల విలువైన స్థలం దేవస్థానంకు ఉంది. మొత్తం రూ.10 కోట్ల విలువైన ఈ భూమిని స్వాహా చేసేందుకు కొందరు నేతలు పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఈ ఏరియా కమర్షియల్ ప్రాంతం కావడంతో దీన్ని కాజేయాలనుకుంటున్న స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రభుత్వంలో ఓ పెద్దాయన అండ లభించిందట. దీంతో దేవుడి భూమిని పీఠానికి అప్పగిస్తే మన చేతికి మట్టి అంటదని స్కెచ్ గీశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

స్థానిక ప్రజాప్రతినిధి అనుచరుల్లో ఒకరికి గన్నవరంలో ఓ పీఠం ఉంది. దేవస్థానానికి చెందిన ఈ 900 గజాల స్థలాన్ని పీఠానికి అప్పగించాలని ఓ ప్రభుత్వ పెద్ద, స్థానిక ప్రజాప్రతినిధి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు టాక్.

దీంతో ఆ ప్రభుత్వ పెద్ద అండతో పీఠానికి 900 గజాల విలువైన 10 కోట్ల స్థలం అప్పగిస్తూ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. రేపో మాపో ఆ స్థలం అప్పగించేస్తారు.

ఈ స్థలంపై కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం ఈవో సత్యనారాయణ స్పందించారు. ఉన్నతాధికారుల నుంచి 900 గజాల్లో ఉన్న స్థలాన్ని.. అందులోని కళ్యాణ్ మండపాన్ని కూడా పీఠానికి అప్పగించాలని ఉత్తర్వులు వచ్చాయని.. తాను దీనిపై ఏమీ మాట్లాడలేనని చెప్పారు.

2015లో ఇది దేవాదాయ భూమి అని.. ఈ స్థలం ఎవరికీ పరాధీనం కాదని ఉత్తర్వులు ఇచ్చిన ఆ శాఖ ఇప్పుడు పీఠానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.