Begin typing your search above and press return to search.

రెచ్చ‌గొట్టే సోమిరెడ్డి లాంటోళ్ల‌ను ఏమ‌నాలి?

By:  Tupaki Desk   |   5 Aug 2017 6:38 AM GMT
రెచ్చ‌గొట్టే సోమిరెడ్డి లాంటోళ్ల‌ను ఏమ‌నాలి?
X
నేరం చేసిన వారితో పాటు.. నేరాన్ని చేసేలా ప్రోత్స‌హించే వారు కూడా నేర‌స్తులే. ప్ర‌జ‌ల మ‌నోభావాల్ని ప్ర‌తిఫ‌లించే రీతిలో.. వారి మ‌న‌సుల్లో గూడుక‌ట్టుకున్న ఆవేద‌న‌ను..ఆవేశాన్ని చెప్పే క్ర‌మంలో ఒక‌ట్రెండు ఎక్కువ‌.. త‌క్కువ మాట‌లు రావ‌టం స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో మామూలుగా మారింది. ఎవ‌రిదాకానో ఎందుకు.. రాజ‌కీయాల్లో త‌ల పండిన‌ట్లుగా చెప్పే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముచ్చ‌టే తీసుకుందాం. విప‌క్షాల‌పై విరుచుకుప‌డే క్ర‌మంలో నా కొడుకులు అన్న మాట‌ను చాలా సింఫుల్ గా ప‌దే ప‌దే అన‌టం తెలిసిందే.

నిజ‌మే.. సీఎం స్థానంలో ఉన్న వారి నోటి నుంచి ఈ త‌ర‌హా మాట‌లు రావ‌టం స‌రైంది కాదు. కానీ.. ఆయ‌న ఆ మాట‌లు అనేశారు. అంత‌మాత్రాన తెలంగాణ ప్ర‌తిప‌క్ష నేత‌లు కేసీఆర్ మాదిరే రెచ్చిపోయారా? అంటే లేద‌ని చెప్పాలి. సీఎం నోటి నుంచి అంత తీవ్ర వ్యాఖ్య‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. తెలంగాణ విప‌క్షాలు చెల‌రేగిపోలేదు. మాట‌కు మాట అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌లేదు.

కానీ.. ఏపీలో అలాంటి ప‌రిస్థితి అస్స‌లు క‌నిపించ‌టం లేద‌ని చెప్పాలి. నంద్యాల‌లో నిర్వ‌హించిన బహిరంగ స‌భ‌లో ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతూ.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును న‌డిరోడ్డు మీద కాల్చినా త‌ప్పు లేద‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్న‌ట్లుగా త‌న‌దైన ఆగ్ర‌హంతో చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్య‌పై పెను దుమారం ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో న‌డుస్తోంది.

ఏపీ తెలుగు త‌మ్ముళ్ల మాట‌ల ప్ర‌కారం.. ఒక ముఖ్య‌మంత్రి మీద ఒక విప‌క్ష నేత అన్నేసి మాట‌లు అన‌టం ఏమిటి? అన్న ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. ఒక‌వేళ వీరి మాట‌లే నిజ‌మ‌ని అనుకుందాం. .జ‌గ‌న్ త‌ప్పుగానే మాట్లాడార‌ని కూడా అనుకుందాం. మ‌రి.. జ‌గ‌న్ త‌ప్పు మాట్లాడిన‌ప్పుడు.. వీరి మాట‌లు ఎలా ఉన్నాయి? అన్న ప్ర‌శ్న‌ను కూడా వేసుకోవాలి.

బాధ్య‌త క‌లిగిన స్థానాల్లో ఉన్న ఏపీ మంత్రుల మాట‌ల్నే తీసుకుంటే.. వారి నోటి నుంచి వ‌స్తున్న వ్యాఖ్య‌లు ఆశ్చ‌ర్యాన్ని రేకెత్తిస్తున్నాయి.

ఎవ‌రిదాకానో ఎందుకు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి మాట‌ల్నే తీసుకుంటే.. ఈ విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఎటాక్ మొద‌లెట్టిన ఆయ‌న‌.. జ‌గ‌న్ కంటే ఆరు ఆకులు ఎక్కువ చ‌దివిన‌ట్లుగా ఆయ‌న తీరు ఉంది. జ‌గ‌న్‌.. ముఖ్య‌మంత్రిని ఎప్పుడు కాల్చేస్తావ్‌? ఏ తుపాకీతో.. నాటు తుపాకీతోనా? ఏకే 47 తోనా? డేట్ ఫిక్స్ చేస్తావా? న‌ంద్యాల ఎన్నిక‌ల్లోనా? ఆ త‌ర్వాత‌నా? సీఎంను ఎక్క‌డికి ర‌మ్మంటావ్‌? అంటూ అదే ప‌నిగా చేసిన వ్యాఖ్య‌ల‌కు అర్థం ఏమ‌ని చెప్పుకోవాలి. ఒక‌రు త‌ప్పుగా మాట్లాడార‌ని అనుకున్న‌ప్పుడు.. అలాంటి మాట‌ల్ని ప‌దే ప‌దే మాట్లాడం స‌రైన ప‌ద్ధ‌తా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఒక‌రిని వేలెత్తి చూపించే ముందు.. మ‌నం కూడా జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్న ఆలోచ‌న లేని సోమిరెడ్డి లాంటి వారికి నీతులు చెప్పే అర్హ‌త ఉందంటారా?