Begin typing your search above and press return to search.

వ్యవసాయ మంత్రి ఎలక్షన్ కోడ్ మర్చిపోయారే...

By:  Tupaki Desk   |   18 Aug 2017 5:10 AM GMT
వ్యవసాయ మంత్రి ఎలక్షన్ కోడ్ మర్చిపోయారే...
X
నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా నోరున్న టీడీపీ నేతలకు బాగా గిరాకీ పెరిగింది. దీంతో వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డికి మరింత డిమాండు పెరిగింది. ఉప ఎన్నికల కోసం ఆయన ఏకంగా నంద్యాలలోనే తిష్ఠ వేశారు. వ్యవసాయ సెకండరీ... నంద్యాలే ప్రైమరీ అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారని విపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. అయితే... ఆయన ప్రచారం చేసుకుంటే చేసుకోవచ్చు కానీ నంద్యాలలోనే ప్రెస్ మీట్లు పెట్టి వ్యవసాయ శాఖకు సంబంధించి హామీలు కూడా గుప్పిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆయన హామీలు గుప్పించడం వివాదాస్పదమైంది.

నిజానికి ఎన్నికల కోడ్‌ ఉన్నందున నంద్యాలలో మంత్రులు కూడా సాధారణ వ్యక్తులతో సమానం. అక్కడ వారు ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయకూడదు. కొత్తగా పథకాలను ప్రకటించకూడదు. కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాత్రం నంద్యాలలో ప్రెస్‌ మీట్‌ పెట్టి దర్జాగా తన శాఖకు సంబంధించిన విషయాలను వివరించడంతో పాటు కొత్తగా హామీలు ప్రకటించారు.

ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసే రైతులకు 100 శాతం రాయితీతో విత్తనాలు పంపిణి చేస్తామన్నారు. ఇందుకు 105 కోట్లు ఖర్చు పెట్టి లక్షా ఐదు వేల క్వింటాళ్ల విత్తనాలు సరఫరాచేస్తామన్నారు. ప్రత్యామ్నాయ పంట సాగుకు వంద శాతం సబ్సిడీతో సూక్ష్మపోషక ఎరువులు అందిస్తామని చెప్పారు. రాయలసీమలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈనిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు సోమిరెడ్డి. మరి ఎన్నికల సంఘం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.