Begin typing your search above and press return to search.

యూజ్‌ లెస్ ఫెలోస్‌..యూత్‌ పై మంత్రి విసుర్లు

By:  Tupaki Desk   |   10 Dec 2017 9:29 AM GMT
యూజ్‌ లెస్ ఫెలోస్‌..యూత్‌ పై మంత్రి విసుర్లు
X
బాధ్యతాయుత‌మైన స్థానాల్లో ఉన్న‌వాళ్లు ఎలా వ్య‌వ‌హ‌రించాలి? ఎంత హుందాగా ఉండాలి? ప‌రిస్థితులు ఎంత అస్త‌వ్య‌స్థంగా అవుతున్నా వాళ్లు సంయ‌మ‌నంతో ఉండాలి. స్థిత‌ప్ర‌జ్ఞ‌త‌తో ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దాలి కానీ ఇవేం ప‌ట్ట‌న‌ట్లు స‌ద‌రు పెద్ద‌వాళ్లే చిరాకు ప‌డితే...బూతులు తిడితే...విన‌డానికే మ‌న‌కు చాలా ఇబ్బందిగా..ఎబ్బెట్టుగా ఉంటుంది క‌దా? స‌రిగ్గా అలాంటి ప‌రిస్థితే..ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహన్ రెడ్డి వ‌ల్ల ఏపీకి చెందిన యువ‌త ఎదుర్కున్నారు. నెల్లూరు నగరంలో మూడు రోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి యువజనోత్సవాలు శనివారం సాయంత్రం ముగిసిన సంద‌ర్భంగా మంత్రి గారిలోని ఈ ఆగ్ర‌హాన్ని స‌ద‌రు యూత్ అనుభ‌వాల్సి వ‌చ్చింది.

ఉత్స‌వాల‌ ముగిసిన సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మాట్లాడుతుండగా...అక్క‌డికి విచ్చేసిన యువ‌త ఆందోళ‌న తెలిపారు. కర్నూలు - పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన కళాకారులు మంత్రి ప్రసంగాన్ని అడ్డుకుంటూ వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని అంతేకాకుండా...విజేతల ఎంపికలో అన్యాయం జరిగిందని నినాదాలు చేశారు. వీరి వాద‌న‌ల‌కు వ్య‌తిరేకంగా మ‌రికొంద‌రు గ‌ళం విప్ప‌డంతో స‌భ‌లో ఒక్క‌సారిగా గంద‌ర‌గోళం నెల‌కొంది.

ఈ స‌మ‌యంలో ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దాల్సిన మంత్రి సోమిరెడ్డి అదుపు త‌ప్పారు. `యూజ్‌లెస్‌ ఫెలోస్‌. సర్దుకోమని చెబుతుంటే వినరా’ అంటూ దూషించ‌డంతో...ఒక్క‌సారిగా అప్ప‌టివ‌ర‌కు అణుచుకున్న ఓపిక న‌శించింది. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ త‌మ‌కు ఇదేం అవ‌మానం అంటూ విరుచుకుప‌డుతుండ‌టంతో ప‌రిస్థితి అదుపుత‌ప్పింది. మంత్రి వేదిక దిగివచ్చి యువతకు వివరణ ఇచ్చుకున్నా ఫలితం లేకపోయింది. ఈ నేప‌థ్యంలో పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళ‌న‌కు దిగిన వారికి అక్క‌డి నుంచి ప‌క్క‌కు పంపారు. అయిన‌ప్ప‌టికీ ప‌లువురు రోడ్డుపై బైఠాయించి త‌మ నిర‌స‌న తెల‌ప‌డంతో....పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ విన‌క‌పోవ‌డంతో ముగ్గురిని పోలీస్ స్టేష‌న్‌కు త‌రలించారు.

మ‌రోవైపు ఈ ఉత్స‌వాల‌కు హాజ‌రైన‌ వారు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. నెల్లూరు ఆతిథ్యం గురించి సానుకూల అభిప్రాయంతో వ‌చ్చామ‌ని ఇలాంటి ప‌రాభ‌వం ఎదుర‌వుతోంద‌ని అనుకోలేద‌ని వాపోయారు. ఇదిలాఉండ‌గా...ఈ రసాభాస‌లోనే మంత్రి సోమిరెడ్డి విజేత‌ల‌కు అవార్డులు ప్ర‌దానం చేశారు.