Begin typing your search above and press return to search.

ఎ-1 సోనియా.. ఎ- 5 బొత్స

By:  Tupaki Desk   |   27 Aug 2015 8:52 AM GMT
ఎ-1 సోనియా.. ఎ- 5 బొత్స
X
తెలుగుదేశం నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులపై కేసు పెడతామని కాంగ్రెస్ అద్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించడంపై మండిపడ్డ సోమిరెడ్డి.. కేసులు ఎదుర్కోవాల్సిన వ్యక్తులు కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల్లో చాలామంది ఉన్నారని అన్నారు. కేసు పెట్టవలసి వస్తే లోక్ సభలో తలుపులు మూసివేసి విభజన బిల్లు ఆమోదించడానికి కారణమైన ఏఐసీసీ అద్యక్షురాలు సోనియాగాంధీ ప్రథమ నిందితురాలిగా ఉంటుందని సోమిరెడ్డి అన్నారు. సోనియాపై తక్షణం క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తన దృష్టిలో రాష్ట్ర విభజనకు సంబంధించి ఏ-1 సోనియా, ఏ-2 మన్మోహన్‌, ఏ-3 జైరాం, ఏ-రఘువీరా, ఏ-5 బొత్స అని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.

విభజనకు కాంగ్రెస్ కారణమని, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఈ దుస్థితిలో ఉండడానికి కారణం ముమ్మాటికీ కాంగ్రెస్ అని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ పైనా సోమిరెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. ఉండవల్లి మేధావి అనుకున్నామని, కానీ ఆయన కూడా చిత్రంగా మారుతున్నారని.. ఆయన వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరే ఉద్దేశంతో మాట్లాడుతున్నట్లుందని.. ఆయన ఆ పార్టీలో ఎప్పుడు చేరతారో చెప్పాలని అన్నారు. ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌ ను చెప్పుతో కొట్టారని సోమిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం అవుతానంటూ జగన్‌ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మానసిక సమస్య ఉన్నట్లుందని ఎద్దేవా చేశారు. తాము ప్రజల్ని నమ్ముకుంటే.. జగన్‌ జ్యోతిష్యులను నమ్ముకున్నారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కంటే ఎక్కువ ఇచ్చేట్లయితే అది బిల్లు రూపంలో ఉండాలన్న సోమిరెడ్డి.. ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుంటే మోడీ విశ్వసనీయత పోతుందన్నారు.