Begin typing your search above and press return to search.

ఎన్నుకున్న‌ది మోడీని...అధికారుల‌ను కాద‌ట‌

By:  Tupaki Desk   |   30 July 2016 3:32 PM GMT
ఎన్నుకున్న‌ది మోడీని...అధికారుల‌ను కాద‌ట‌
X
ఏపీకి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన వివరణ‌పై తెలుగుదేశం శ్రేణుల నుంచి నిర‌స‌న గ‌ళం ఘాటుగా వినిపిస్తోంది. టీడీపీ అధికార ప్రతినిధి - ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ టార్గెట్‌ గా ఘాటు ప్ర‌శ్న వేశారు. చ‌ట్ట‌స‌భ‌ల సాక్షిగా అరుణ్ జైట్లీ స‌మాధానం ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రతి ఒక్కరినీ ఎంతో బాధించిందని తెలిపారు. ప్రత్యేకహోదా అన్నది మోడీ విశ్వసనీయతతో ముడిపడి ఉందని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.

ఏపీకి ప్రత్యేకహోదా పై తెలుగుదేశం ప్రభుత్వం మొదటి నుంచీ పోరాటం చేస్తోందని సోమిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 22 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులకు విజ్ఞప్తి చేశారని వివ‌రించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ - మోడీ ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చిన తర్వాత 14వ ఆర్థిక సంఘం సాకు చెప్పడం సరికాదని అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి ఆధ్వర్యంలోనే దేశంలో అత్యున్నత చట్టాలు తయారవుతాయని గుర్తుచేశారు. ఈ దేశానికి నాయకుడిగా మోడీని ఎన్నుకున్నారే త‌ప్ప 14వ ఆర్థిక సంఘాన్ని కాదని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంద‌ని సోమిరెడ్డి స్ప‌ష్టం చేశారు. అవసరమైన చట్టాన్ని చేసే శక్తి బీజేపీకి - కాంగ్రెస్‌ కు ఉన్నాయని ఆయ‌న‌ పేర్కొన్నారు.

ఏపీకి కాంగ్రెస్ తీరని అన్యాయం చేసి ఇప్పడు ప్రైవేటు బిల్లు పేరుతో ఉనికి కోసం పోరాడుతోందని సోమిరెడ్డి ఫైర‌య్యారు. రాజకీయ కారణాలతో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు హోదాపై ప్రైవేటు బిల్లు పెట్టినప్పటికీ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ మద్దతు పలికిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు బిల్లు పెట్టినా మద్దతిస్తామని చంద్ర‌బాబు పలుమార్లు చెప్పారని గుర్తుచేశారు. హోదా పై కాంగ్రెస్‌ కు చిత్తశుద్ధిలేదని మొదటిసారి చర్చకు వచ్చినప్పుడు కోరం లేకుండా ఆగిపోయిందని ప్ర‌స్తావించారు. ప్రధాన ప్రతిపక్షంగా విఫలమైన జగన్ హోదా పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిప‌డ్డారు.