Begin typing your search above and press return to search.

బీజేపీ రెచ్చ‌గొట్ట‌డం వ‌ల్లే అమిత్ షాపై దాడి

By:  Tupaki Desk   |   11 May 2018 3:20 PM GMT
బీజేపీ రెచ్చ‌గొట్ట‌డం వ‌ల్లే అమిత్ షాపై దాడి
X
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో విభేదాలు వచ్చి టీడీపీ, బీజేపీల‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో విభేదాలు తారాస్థాయికి చేరిన సంగ‌తి తెలిసిందే. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరుమల పర్యటన మరింత వేడిని రాజేసింది. షా పర్యటనను నిరసిస్తు...టీడీపీ కార్యకర్తలు నల్లజెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. అలిపిరి గుండా వెళుతున్న షా కాన్వాయ్ ను టిడిపి నేతలు అడ్డుకోవడానికి ప్రయత్నించడం..పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ క్రమంలో కాన్వాయ్ లోని ఓ వాహనం అద్దం ధ్వంసం చేయడంతో పోలీసులు టీడీపీ నేతలను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. డీసీపీతో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. తోపులాట..ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసి తరలించారు.

ఇదిలాఉండ‌గా....తిరుపతిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కాన్వాయ్‌పై రాళ్లు రువ్విన ఘటన బీజేపీ నేతలు రెచ్చగొట్టడం వ‌లే జ‌రిగింద‌ని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అన్నారు. నల్లబ్యాడ్జీలు ధరించిన నిరసన తెలుపుతున్న వారిని రెచ్చగొట్టేలా బీజేపీ నేతలు కార్యకర్తలు వ్యవహరించారని సోమిరెడ్డి అన్నారు. ఈ ఘటనలు టీడీపీ కార్యకర్తలకు మాత్రమే దెబ్బలు తగిలాయని.. దాడి ఎవరు చేశారో ప్రజలు అర్థం చేసుకుంటారని సోమిరెడ్డి అన్నారు. మ‌రోవైపు తిరుపతిలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాపై జరిగిన దాడిని బట్టి.. రాష్ట్రంలో ప్రత్యేక హోదాపై ఎంతటి ఆవేదన ఉందో అర్థం అవుతోందని సీపీఐ సీనియర్‌ నేత నారాయణ అన్నారు. దీన్ని వ్యక్తిగతంగా తీసుకోరాదని, రాజకీయ అంశంగానే బీజేపీ నాయకత్వం పరిగణించాలనీ అన్నారు.

ఇదిలాఉండ‌గా...అమిత్‌షాపై దాడిని ఖండించిన బీజేపీ నేతలు.. చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు కావాలనే అమిత్‌షాపై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. హోదా విషయంలో ఇప్పటికే టీడీపీ, బీజేపీ మధ్య మొదలైన యుద్ధం.. అమిత్‌షాపై దాడికి చేయడంతో అది మరింత ముదిరింది. టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే అమిత్‌షాపై దాడికి పాల్పడ్డారంటున్న బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు.