Begin typing your search above and press return to search.

సోమిరెడ్డీ... ఇదేనా మీ పొలం బాట‌?

By:  Tupaki Desk   |   3 Nov 2017 5:23 AM GMT
సోమిరెడ్డీ... ఇదేనా మీ పొలం బాట‌?
X
సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి... టీడీపీలో సీనియ‌ర్ మోస్ట్ నేత‌గానే కాకుండా.. ఆ పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు వ‌ద్ద మంచి ప‌ర‌ప‌తి క‌లిగిన నేత కిందే లెక్క‌. ఈ ప‌ర‌ప‌తి ఎంతగానంటే... గ‌డ‌చిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడిన చంద్ర‌మోహ‌న్ రెడ్డిని చంద్ర‌బాబు పిలిచి మ‌రీ మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టేంత‌గా. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైన నేత‌లు... ప్ర‌జ‌ల విశ్వాసం చూర‌గొన‌లేక‌నే ప‌రాజ‌యం పాల‌య్యార‌ని, పద్ధ‌తి మార్చుకోక‌పోతే... వ‌చ్చే ఎన్నిక‌ల్లో అస‌లు టికెట్లే ఇచ్చేది లేద‌ని తొలుత చంద్ర‌బాబు ఘీంక‌రించారు. మ‌రి ఏమైందో తెలియ‌దు గానీ... తాను న‌వ్యాంధ్ర సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన రెండున్న‌రేళ్ల‌కే బాబు మాట మార్చేశారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైన సోమిరెడ్డి స‌హా ప‌య్యావుల కేశ‌వ్ వంటి నేత‌ల‌కు ఎమ్మెల్సీలుగా అవ‌కాశం క‌ల్పించారు. బాబు పిలిచి మ‌రీ ఎమ్మెల్సీ ప‌ద‌వులు ఇవ్వడంతో సోమిరెడ్ది - ప‌య్యావుల అప్ప‌టిదాకా బ‌య‌ట‌కు వ‌చ్చేందుకే స‌సేమిరా అన్నా.... ఆ త‌ర్వాత మళ్లీ క‌నిపించ‌డం మొద‌లెట్టారు.

ఈ క్ర‌మంలో ఇటీవ‌ల జ‌రిగిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో సోమిరెడ్డిని త‌న కేబినెట్‌ లోకి తీసుకున్న చంద్ర‌బాబు... ఆయ‌న‌కు ఏకంగా కీల‌క శాఖ‌గా ప‌రిగ‌ణిస్తున్న వ్య‌వ‌సాయ శాఖ‌ను అప్ప‌గించారు. దీంతో సోమిరెడ్డి మ‌రింత‌గా క్రియాశీల భూమిక పోషించేందుకు సిద్ధ‌మ‌య్యారు. నిత్యం వ్య‌వ‌సాయ అధికారుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్న సోమిరెడ్డి రైతుల‌కు టీడీపీ స‌ర్కారు ఏం చేస్తుందో, ఏం చేయ‌నుందో.. త‌మ పార్టీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల ద్వారా రైతుల‌కు ఎంత మేర ల‌బ్ధి చూకూరుతుందోన‌న్న విష‌యాల‌ను ఏక‌రువు పెడుతున్నారు. అంతేకాదండోయ్‌... న‌కిలీ ఎరువులు - పురుగు మందులు - విత్త‌నాలు త‌యారు చేస్తున్న కంపెనీల‌ను కూడా కొంత‌కాలం పాటు హ‌డ‌లెత్తించారు. ఆ త‌ర్వాత సైలెంట్ అయిపోయారు. స‌రే ఇదంతా బాగానే ఉన్నా... అయినా ఇప్పుడు సోమిరెడ్డి ప్ర‌స్తావ‌న ఎందుకు తీసుకురావాల్సి వ‌చ్చిందంటే... నిన్న గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు మండ‌లంలో ప‌ర్య‌టించిన సోమిరెడ్డి ఓ రైతుకు చెందిన ప‌త్తి చేనులోకి అడుగు పెట్టారు.

సాధార‌ణంగా పొలం బాట ప‌ట్టే రాజ‌కీయ నేత‌లు పెద్ద‌గా ఆర్భాటం లేకుండానే వెళ‌తారు. మీడియాను వెంట‌బెట్టుకుని మ‌రీ వెళ్లే నేత‌లు.. పొలంలోకి దిగ‌గానే స‌ద‌రు పొలంలో సాగ‌వుతున్న పంట‌ల‌ను ప‌రిశీలించ‌డం, అక్క‌డి కూలీల‌తో క‌లిసి ప‌నిచేస్తూ ఫొటోలు తీసుకుంటారు. ఇక పొలాల్లో బుర‌ద గానీ - నీళ్లు గానీ ఉంటే... నేత‌ల‌కు ఇక పండుగే. కూలీల‌తో పాటు నీళ్ల‌లోకి దిగే నేత‌లు తామూ రైతు బిడ్డ‌ల‌మేన‌నే ఫోజు కొడ‌తారు. మరి నిన్న‌టి ప‌ర్య‌ట‌న‌లో మాత్రం సోమిరెడ్డి చాలా భిన్నంగా వ్య‌వ‌హ‌రించార‌నే చెప్పాలి. ఎంత భిన్నంగా అంటే... రోడ్డు ద‌గ్గ‌ర నుంచి పొలం దాకా ఆయ‌న క‌నీసం నేల మీద కూడా కాలుపెట్ట‌నంత‌గా. మంత్రి వ‌స్తున్నార‌ని అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించిన అధికార యంత్రాంగం.. మంత్రి సాగే దారి వెంట రోడ్డు ద‌గ్గ‌రి నుంచి ప‌త్తి చేనులోకి ఏకంగా గ్రీన్ కార్పెట్ ప‌రిచేశారు. దీనిని ఏమాత్రం కూడా ప‌ట్టించుకోని సోమిరెడ్డి కూడా అధికారులు ప‌లికిన స్వామి భ‌క్తి స్వాగ‌తానికి ఫిదా అయిపోయి ఆ కార్పెట్‌పైనే పొలం వ‌ద్ద‌కు వెళ్లి ఓ చిన్న ప‌రిశీల‌న చేసి మ‌ళ్లీ అదే కార్పెట్‌ పై వెన‌క్కు వ‌చ్చేసి కారెక్కేశారు.