Begin typing your search above and press return to search.

ఆయ‌నో...నేనో ఉండాలంటున్న సోమిరెడ్డి

By:  Tupaki Desk   |   26 Dec 2016 5:36 AM GMT
ఆయ‌నో...నేనో ఉండాలంటున్న సోమిరెడ్డి
X
బినామీ ఆస్తులున్నాయంటూ నెల్లూరు వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన ఆరోప‌ణ‌ల‌పై టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న విలేక‌రుల స‌మావేశం ఏర్పాటుచేసి ఏకంగా పాస్ పోర్ట్ తో స‌హా వివ‌రిస్తూ....త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ఫుల్లు క్లారిటీ ఇచ్చారు. సోమిరెడ్డి ఏమ‌న్నారంటే... "నాకు, నా భార్య బిడ్డలకు నాలుగు విదేశాలలో వెయ్యికోట్ల ఆస్తులున్నాయంటూ కాకాని ఏవో 20 డాక్యుమెంట్లను మీడియా ముందు పెట్టారు. వాస్తవానికి నాకు గాని, నా కుటుంబానికి గాని విదేశాల్లో ఎటువంటి ఆస్తులు లేవు. కాకాని కబ్జాలను - వైఎస్ అవినీతిని - సమైక్య రాష్ట్ర పోరాటాన్ని నడిపిన నాయకుడిగా నాపైన ఇలాంటి ఆరోపణలకు దిగడమే తప్ప మీ దగ్గర నిజాయితీ లేదు. ఒక్క డాక్యుమెంట్ నిజమని తేలినా బెంజ్ సర్కిల్ నుండి నెల్లూరు దాకా ఎక్కడైనా ప్రజలకు క్షమపణ చెప్పడానికి నేను సిద్దం" అంటూ స‌వాల్ విసిరారు.

20 డాక్యుమెంట్లను మీడియా ముందు పెట్టిన కాకానిని ఈడీకి ఎందుకు ఫిర్యాదు చేయలేద‌ని సోమిరెడ్డి ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించారు. నకిలీ డాక్యుమెంట్లను సృష్టించిన వైకాపా వెనక ఏ నకిలీ డాక్యుమెంట్ల ముఠాలు ఉన్నాయో బయట పడాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలలోని నిజాయితీతో ఎమ్మెల్సీగా తాను, ఎమ్మెల్యేగా కాకాని గోవర్ధన్ రెడ్డిల‌లో ఎవరో ఒకరే చట్టసభలో మిగలాలి అంటూ చాలెంజ్ చేశారు. "సింగపూర్ - మలేషియా - హాంకాంగ్ 4 దేశాల్లో నాకు ఆస్తులున్నట్లు ఏవో డాక్యుమెంట్లు విడుదల చేశారు. నా తండ్రి ఇచ్చిన ఆస్తుల‌నే నేను అమ్ముకున్నాను. అలాంటిది నా భార్య బిడ్డల పేర్లను పత్రికలకు ఎక్కించడం క్రూరం. ఇంట్లో మహిళలపైన తప్పుడు ఆరోపణలు చేయడం హేయమైన చర్య. జగన్మోహన్ రెడ్డికి ఒకటే సవాల్ చేస్తున్నా నీ ఎంపీలను ఢిల్లీలో ఈడీ వద్దకు, సీబీఐ వద్దకు పంపి నా పైన ఫిర్యాదు చేయించండి, అందుకు నేను సిద్దం. నకిలీ డాక్యుమెంట్లు ఎలా వచ్చాయో నేను కూడా రాష్ట్ర డీజీపీని కలిసి విచారణ కోరుతాను" అంటూ సోమిరెడ్డి స్ప‌ష్టం చేశారు.

వైసీపీ ఆరోపణలే నిజమైన‌వా.. త‌న‌ జీవితం నిజాయితీతో కూడిన‌దా తేలిపోవాలని సోమిరెడ్డి ఆగ్ర‌హంగా అన్నారు. "నా దగ్గర డబ్బుంటే కాకాని ఎమ్మెల్యే అయ్యే వాడేనా? నాలుగు దేశాలలో మీరు చెబుతున్న అవినీతి డాక్యుమెంట్లపై ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను ఫిర్యాదు చేయండి. పోలీసు స్టేషన్లోనో - సీఐడీ - ఈడీ లలో ఎవరికీ ఫిర్యాదు చేసినా ఆయా సంస్థలకు సమాధానం చెప్పడానికి నేను సిద్దం. కాకాని నావిగా చెబుతున్న డాక్యుమెంట్లు ఏ విధంగా సృష్టి చేశారో చెప్పాలి. ఒక్క డాక్యుమెంట్ నిజమైన నన్ను ఎమ్మెల్సీగా తొలగించాలి. ఈ డాక్యుమెంట్లు తప్పని రుజువైతే ఎమ్మెల్యేగా ఉన్న కాకానిని తొలగించాలి. ఆ విధమైన చట్టాలు రావాలి. అవినీతి పరులైన ప్రజా ప్రతినిధులపైన కేసులను సుప్రీం తీర్పు ప్రకారం ఏడాది లోపు విచారణ పూర్తిచేసి శిక్షించాలి" అని సోమిరెడ్డి చాలెంజ్ చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/