Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీల‌ రాజీనామా..సోమిరెడ్డితోనే ఆగిపోద‌ట‌

By:  Tupaki Desk   |   16 Feb 2019 4:17 AM GMT
ఎమ్మెల్సీల‌ రాజీనామా..సోమిరెడ్డితోనే ఆగిపోద‌ట‌
X
ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం తాజాగా చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత‌ - ఆంధ్రప్రదేశ్‌ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామాను చేశారు. సోమిరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి రాజీనామా లేఖను సమర్పించగా... ఆయనకు ఫోన్‌ చేసిన మండలి ఛైర్మన్ షరీఫ్.. రాజీనామా వ్యవహారంపై ఆరా తీశారు. తాను ఇష్టపూర్వకంగానే రాజీనామా చేశానని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పటంతో.. ఆయన రాజీనామాను ఛైర్మన్ షరీఫ్‌ ఆమోదించారు. అయితే, ఈ రాజీనామా ఎత్తుగ‌డ వెనుక తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు వ్యూహాలు ఉన్నాయ‌ని స‌మాచారం.

టీడీపీ సీనియ‌ర్ నేత‌లైన సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి - రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అన్న‌ట్లుగా సాగిన ఈ రాజీనామాల లెక్క వేరేని అంటున్నారు. గెలుపుపై ధీమాతో పదవులకు రాజీనామా చేస్తున్నామనే విషయాన్ని ప్రజల్లోకి పంపొచ్చనే యోచనలో పార్టీ అధినాయకత్వం ఉంది. ఇందులో భాగంగా - ప్ర‌ముఖుల‌ను ప‌ద‌వుల‌కు రాజీనామా చేయిస్తున్నార‌ని స‌మాచారం. ఎమ్మెల్సీలుగా ఉండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు మంత్రులు నారా లోకేష్ - నారాయణ స‌హా సీనియ‌ర్ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్ - పయ్యావుల కేశవ్ - అన్నం సతీష్ - మాగుంట రేస్‌ లో ఉన్నారు. సోమిరెడ్డి నిర్ణయాన్నే పార్టీ పాలసీగా తీసుకుంటే మరిన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. అయితే, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా నిర్ణయం గవర్నర్ - ఎమ్మెల్యే కోటాలకే పరిమితం చేస్తారా? లేక స్థానిక సంస్ధల కోటాకూ వర్తింప చేస్తారా? అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.

మార్చి నెలాఖరుకు ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీకానుండగా.. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాల నిర్ణయం తీసుకుంటే ఎమ్మెల్యే కోటాలో మరో మూడు స్థానాలు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. స్థానిక సంస్ధల కోటాలో మూడు స్థానాలు ఖాళీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక గవర్నర్ కోటాలో మరో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 13 ఎమ్మెల్సీ స్థానాల్లో కొత్త వారికి ఛాన్స్ కల్పించే అవకాశం ఉంటుంది. కాగా, శ‌నివారం అమరావతిలో జరగనున్న టీడీపీ పొలిట్ బ్యూరో భేటీలో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలపై పాలసీ డెసిషన్ తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా నిర్ణయం తీసుకుంటే కరణం బలరాంకు వెసులుబాటు కల్పించే ఛాన్స్ ఉందనే చర్చ సాగుతోంది.