Begin typing your search above and press return to search.

మ‌రో దిగ్గ‌జ నేత క‌న్నుమూత‌!

By:  Tupaki Desk   |   13 Aug 2018 5:59 AM GMT
మ‌రో దిగ్గ‌జ నేత క‌న్నుమూత‌!
X
కొంద‌రికి ప‌ద‌వులు ప్ర‌త్యేక గుర్తింపును ఇస్తుంటాయి. మ‌రికొన్ని సంద‌ర్భాల్లో మాత్రం కొంద‌రి కార‌ణంగా స‌ద‌రు ప‌ద‌వులకే కొత్త క‌ళ వ‌స్తుంది. రెండో కోవ‌కు చెందుతారు రాజ‌కీయ దిగ్గ‌జం.. మాజీ లోక్ స‌భ స్పీక‌ర్ సోమ‌నాథ్ చ‌ట‌ర్జీ. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ ప‌డుతున్న ఆయ‌న సోమ‌వారం ఉద‌యం కోల్ క‌తాలోని ప్రైవేటు ఆసుప‌త్రిలో తుదిశ్వాస విడిచారు.

ఆయ‌న మ‌ర‌ణం పట్ల ప‌లువురు రాజ‌కీయ నేత‌లు సంతాపం వ్య‌క్తం చేశారు. భార‌త రాజ‌కీయాల్లో మేరున‌గ‌ధీరుడైన సోమ‌నాథ్ చ‌ట‌ర్జీ మృతి ప‌ట్ల ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేశారు. పార్ల‌మెంట‌రీ ప్ర‌జాస్వామ్యం బ‌ల‌మైన గ‌ళం వినిపించిన ఘ‌న‌త ఆయ‌న సొంతం.

తొలినుంచి వామ‌ప‌క్ష వాది అయిన ఆయ‌న కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధుల‌తో బాధ ప‌డుతున్నారు. ఆదివారం ఆయ‌న గుండెపోటుకు గుర‌య్యారు. దీంతో.. ఆయ‌న ఆరోగ్యం మ‌రింత విష‌మించింది. వెంటిలేట‌ర్ పై ఉంచి వైద్యం చేసిన వైద్యులు.. ఆయ‌న్ను కాపాడ‌లేక‌పోయారు. 1929 జులై 25న అసోంలోని తేజ్ పూర్ లో సోమ‌నాథ్ జ‌న్మించారు. మిత్రా ఇన్ స్టిట్యూట్ లో పాఠ‌శాల విద్య‌ను పూర్తి చేసిన ఆయ‌న‌.. ప్రెసిడెన్సీ కాలేజీ.. క‌ల‌క‌త్తా వ‌ర్సిటీల్లో ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించారు.

రాజ‌కీయాల్లోకి అడుగు పెట్ట‌క ముందు లాయ‌ర్ గా ప‌ని చేసిన ఆయ‌న‌.. 1968లో సీపీఎంలో చేరారు. ఆ త‌ర్వాత ప‌దిసార్లు లోక్ స‌భ‌కు ఎన్నికైన ఆయ‌న‌.. 2004 నుంచి 2009 వ‌ర‌కు లోక్ స‌భ స్పీక‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు. యూపీఏ 1 నుంచి త‌న మాతృసంస్థ సీపీఎం వైదొలిగినా.. ఆయ‌న మాత్రం స్పీక‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌లేదు.

దీంతో ఇరుకున ప‌డ్డ సీపీఎం.. ఆయ‌న్ను పార్టీ నుంచి బ‌హిష్క‌రిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.అంతేకాదు.. అణు ఒప్పందం అంశంలో పార్టీకి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించార‌ని సోమ‌నాథ్ ను సీపీఎం బ‌హిష్క‌రించింది. పార్టీల‌కు అతీతంగా పార్ల‌మెంటేరియ‌న్ల అంద‌రి గౌర‌వాన్ని పొందిన కొద్దిమంది రాజకీయ నేత‌ల్లో సోమ‌నాథ్ చ‌ట‌ర్జీ ఒక‌రుగా చెప్పాలి. త‌న విల‌క్ష‌ణ తీరుతో స్పీక‌ర్ గా ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన వైనం ఎప్ప‌టికి గుర్తుండిపోతుంది.