Begin typing your search above and press return to search.

వాటే జోక్ సోమూ : అభివృద్ధి ఎక్కడ జరిగింది...?

By:  Tupaki Desk   |   23 May 2022 3:14 PM GMT
వాటే జోక్ సోమూ : అభివృద్ధి ఎక్కడ జరిగింది...?
X
ఆయన పేరు సోము వీర్రాజు. ఏపీ బీజేపీ పెద్ద. ఆయన మీడియా ముందుకు వస్తే చాలా వీరావేశంలో చాలా చెబుతారు. ఆయన దృష్టిలో కేంద్రం నిజం. రాష్ట్రం వట్టి మిధ్య. అభివృద్ధి అంతా కేంద్రం దయతోనే సాగుతుంది అని తాను గాఢంగా నమ్ముతారు. అంతే గట్టిగా మీడియా ముందుకొచ్చి చెబుతారు. సోము బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాక పదే పదే చెబుతున్న మాట ఒక్కటే.

ఏపీ అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగిపోతోందని, కేంద్రం ఏపీ వైపు ఫుల్ ఫోకస్ పెట్టి మరీ ఇటు వైపే ధాటీగా చూస్తోందని, ప్రగతి వరద అలా ఏపీలో ఎక్కడ చూసినా పారుతోందని సోము మాస్టారు చెబుతారు. ఇక ఈ విషయంలో సోము లేటెస్ట్ చాలెంజ్ ఏంటి అంటే ఎనీ టైమ్ , ఎనీ ప్లేస్ చర్చకు రెడీ అని. కేంద్రం అభివృద్ధికి ఏపీ సర్కార్ తనదిగా చెప్పుకుంటోందని సోము చాలానే చెప్పేశారు.

ఏపీలో అభివృద్ధి కళ్ళ ముందు అలా కనిపిస్తూంటే వేరేగా చెప్పాలా అన్నది కూడా సోమూ సార్ ధీమాగా ఉంది మరి. కేంద్రం ఏపీలో రోడ్లను వేస్తే దాని మీద వైసీపీ నాయకులు దిల్ ఖుషీగా ప్రయాణిస్తున్నారు అని సోము అంటున్నారు. ఉత్తరాంధ్రా ప్రజల నాలుగు దశాబ్దాల కల అయిన రైల్వే జోన్ ని సాకారం చేసింది బీజేపీ మాత్రమే అని ఆయన అంటున్నారు.

ఇంకో మాట కూడా సోము చెప్పారు. అదేంటి అంటే చౌక దుకాణాల ద్వారా సరఫరా చేసే బియ్యంలో కేంద్రం వాటా కిలోకు ముప్పయి రూపాయలు ఉంటే రాష్ట్రం వాటా కేవలం రెండు రూపాయలే అని. ఇలా ఏపీని అన్ని విధాలుగా తాము అభివృద్ధి చేస్తూంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దోపిడీ చేస్తోందని ఆయన మండుతున్నారు.

ఇక రేషన్ సరకులను అందించే వాహనాల మీద జగన్ బొమ్మ పెట్టడమేంటని కూడా కస్సుమన్నారు. ఇలా చాలానే మాట్లాడుతున్న సోము సార్ దృష్టిలో ఏపీ అభివృద్ధిలో ఎక్కడికో వెళ్ళిపోయింది అనే భావించాలి. ఏపీకి సరిసాటి మరో రాష్ట్రం లేదు అన్నది కూడా ఆయన గట్టి నమ్మకం. అందుకే బస్తీ మే సవాల్ అని వైసీపీ నేతలకు సవాల్ విసురుతున్నారు.

సరే కానీ సోమన్నా వాస్తవాలు మాట్లాడుకుంటే మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా వచ్చిందా. పోలవరం పూర్తి అయిందా. రాజధాని ఢిల్లీని తలదన్నేలా నిర్మాణం జరిగిందా. ఉత్తరాంధ్రా జిల్లాలతో పాటు వెనకబడిన ప్రాతాలకు ప్రత్యేక ప్యాకేజి ఏమైంది, ఎక్కడ ఉంది ఇలాంటి వాటిని జవాబు చెప్పమంటే మాత్రం కస్సుమంటారుగా.

ఇక మరో వైపు విశాఖలోని స్టీల్ ప్లాంట్ లాంటి బ్రహ్మాండమైన ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతున్నారు. ఇదేమంటే వాటి మీద అన్ని హక్కులూ మావేనని చెబుతారు. మరి ప్లాంట్ కి ప్రైవేట్ కాకుండా అపామంటే మాత్రం సోమూ సార్ సైలెంట్ అవుతారు కదా అంటున్నారు.

ఏది ఏమైనా సోము వీర్రాజు మాత్రం కరడు కట్టిన కమలం పార్టీ నాయకుడు. ఆయన అలాగే చెప్పాలి. జనాలు అవే వినాలి. అయితే ఇక్కడ సోము చెప్పినట్లుగా అభివృద్ధి జరిగితే ఆయన చెప్పుకోనవసరం లేదు, జనాలు చెబుతారు. లేని దాని గురించి పదే పదే చెప్పినా కూడా ఎవరూ నమ్మరంటే నమ్మరు.

సరే చివరాఖరున కొసమెరుపు అన్నట్లుగా ఒక్క మాట. విశాఖ రైల్వే జోన్ కల సాకారం అయిందా. అవును కానీ సోము సార్. ఇంతకీ అది ఎక్కడ ఉందండి. దాన్ని ఒక్కసారి చూపించండి సార్ అని అంతా అడుగుతున్నారు. మరి దీనికైనా ఆయన కరెక్ట్ గా జవాబు చెబుతారా లేక మూడేళ్ళ క్రితం నాటి కాగితాలనే తెచ్చి ఇదే మన రైల్వే జోన్ అని చెబుతారా. ఏమో డౌట్లు చాలానే వచ్చేస్తున్నాయిగా మరి.