Begin typing your search above and press return to search.

అవినాశ్ రెడ్డి అవసరం లేదని తేల్చేసిన సోము

By:  Tupaki Desk   |   10 March 2022 6:30 AM GMT
అవినాశ్ రెడ్డి అవసరం లేదని తేల్చేసిన సోము
X
వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి బీజేపీలో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. సంచలనంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసులో వేళ్లన్నీ అవినాశ్ వైపు చూపిస్తున్న వేళ.. ఆయన ఈ కేసులో ఇరుకున పడనున్నారా? అన్న అంశం మీద జోరుగా చర్చ సాగుతోంది.

ఇలాంటివేళలో వివేకా కుమార్తె డాక్టర్ సునీత సీబీఐకు ఇచ్చిన వాంగ్మూలం బయటకు రావటం.. అందులో అవినాశ్ రెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనతో చేసినట్లుగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకోవటంతో పాటు.. ఆసక్తికరంగా మారాయి.

తన తండ్రిని చంపిందెవరన్నది పులివెందులలో అందరికి తెలుసన్న డాక్టర్ సునీత.. హంతకులెవరో తేల్చాలని అన్నను కోరినట్లుగా ఆమె తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.ఇక్కడ అన్న అంటే సీఎం జగన్ గా పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా తాను అనుమానితుల పేర్లు జగన్ కు చెప్పానని.. దీనికి స్పందించిన జగన్.. ‘వాళ్లను ఎందుకు అనుమానిస్తావ్? నీ భర్తే హత్య చేయించాడేమో’ అని అన్యాయంగా మాట్లాడినట్లుగా పేర్కొనటం తెలిసిందే.

సీబీఐతో విచారణ చేయించాలని తాను కోరినప్పుడు.. కేసు విచారణ సీబీఐకి ఇస్తే ఏమవుతుంది? అవినాశ్ రెడ్డి బీజేపీలో చేరతాడు.. అతడికేమీ కాదు.. పదకొండు కేసులకు పన్నెండు కేసులు అవుతాయి అని జగన్ మాట్లాడటం తనను బాధించినట్లుగా డాక్టర్ సునీత సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్న వైనం తెలిసిందే.

ఈ వ్యాఖ్యలు పెను సంచలనంగా మారటంతో పాటు.. సీఎం జగన్ అలా మాట్లాడారా? అన్నది హాట్ టాపిక్ గా మారారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో వైఎస్ అవినాశ్ మీద చర్యకు ముందే అతడు బీజేపీలో చేరతాడని స్వయంగా జగనే తనకు చెప్పినట్లుగా వివేకా కుమార్తె వెల్లడించటంతో రాజకీయ చర్చ ఊపందుకుంది. ఇలాంటివేళ.. అవినాశ్ రెడ్డి బీజేపీలోకి వెళ్లటం ఖాయమన్న వేళ.. స్పందించిన సోము వీర్రాజు.. అవినాశ్ తో తమ పార్టీకి అవసరం లేదన్నారు.

అవినాశ్ బీజేపీలో చేరతానని అని ఉంటే.. ఎవరితో అన్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అవినాశ్ లాంటోళ్లను తమ పార్టీలోకి ఆహ్వానించాల్సిన అవసరం రాదని తేల్చిన సోము.. ‘‘గనులు అమ్మే వారిలో బీజేపీకి పని లేదు. అవినాశ్ రెడ్డి మా పార్టీకి అక్కర్లేదు’’ అని వ్యాఖ్యానించారు. సోము వ్యాఖ్యలు ఎవరికి కౌంటర్ అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. అయితే అవినాశ్ పై చర్యలు షురూ కానున్నాయా? అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.