Begin typing your search above and press return to search.

వీర్రాజు దెబ్బ‌... బాబు అండ్ కోకు గ‌ట్టిగానే త‌గిలిందే!

By:  Tupaki Desk   |   13 Feb 2018 7:11 AM GMT
వీర్రాజు దెబ్బ‌... బాబు అండ్ కోకు గ‌ట్టిగానే త‌గిలిందే!
X
ఏపీకి కేంద్రం న్యాయం చేసిందా? అన్యాయం చేసిందా? అన్న అంశాల‌పై ఇప్పుడు పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. గ‌డ‌చిన మూడేళ్లుగా సైలెంట్‌గానే ఉన్న టీడీపీ స‌ర్కారు... మొన్న‌టి కేంద్ర బ‌డ్జెట్‌ లో ఏపీకి పెద్ద‌గా కేటాయింపులేమీ లేక‌పోయే స‌రికి నిర‌స‌న బాట ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తున్నా... చూసీచూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తే మొద‌టికే మోసం వ‌స్తుంద‌న్న భావ‌న‌తో టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు త‌న ప‌రివారాన్ని అప్ర‌మ‌త్తం చేసిన‌ట్లుగానే తెలుస్తోంది. చంద్రబాబు సూచ‌న‌ల‌తోనే పార్ల‌మెంటు సాక్షిగా గ‌ళం విప్పిన గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌... మిస్ట‌ర్ ప్రైమ్ మినిస్ట‌ర్‌ - మిస్ట‌ర్ ఫైనాన్స్ మినిస్ట‌ర్ అంటూ కాస్తంత ఘాటు వ్యాఖ్య‌లే చేశారు. అస‌లు రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఏపీకి కేంద్రం ఏ మేర‌కు న్యాయం చేసింద‌న్న విష‌యం కూడా ఈ సంద‌ర్భంగానే తెర మీద‌కు వ‌చ్చింది. దీనిపై కేంద్రంలో అదికారంలో ఉన్న బీజేపీ స‌ర్కారు - ఆ పార్టీకి చెందిన ఏపీ నేత‌లు ఒక మాట చెబుతుంటే... దానికి విరుద్ధంగా మాట్లాడుతున్న టీడీపీ నేత‌లు మ‌రో వాద‌న‌ను వినిపిస్తున్నారు. దీంతో మొత్తంగా ఎవ‌రి వాద‌న క‌రెక్టో - ఎవ‌రి వాద‌న త‌ప్పో తెలియ‌క జ‌నం అయోమ‌యంలో ప‌డిపోయార‌ని చెప్పాలి.

ఈ నేప‌థ్యంలో అస‌లు కేంద్రం ఇప్ప‌టిదాకా రాష్ట్రానికి ఏమేం ఇచ్చింద‌న్న విష‌యంపై ప‌క్కా లెక్క‌లు తీయండని చంద్ర‌బాబు త‌న అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేప‌థ్యంలో కేంద్రం ఇప్ప‌టిదాకా ఇచ్చింది చాలా స్వ‌ల్ప‌మేన‌ని బాబు అండ్ కో చాలా గ‌ట్టిగానే స్వ‌రం పెంచారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ స‌ర్కారు కూడా ఢిల్లీ కేంద్రంగా ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ... ఇప్ప‌టిదాకా ఏపీకి తాము ఇంతింత నిధులు ఇచ్చామ‌ని ఏకంగా 27 పేజీల లేఖను బ‌య‌ట‌పెట్టారు. దీంతో ఈ వివాదం మ‌రింత‌గా ముదిరింద‌నే చెప్పాలి. ఏమీ ఇవ్వ‌కుండా ఇచ్చామ‌ని ఎలా చెబుతారంటూ మ‌రోవైపు బాబు అండ్ కో కూడా గట్టిగానే త‌గులుకుంటున్న నేప‌థ్యంలో నేటి ఉద‌యం విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన బీజేపీ సీనియ‌ర్ నేత‌ - ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు... ఏకంగా బాబు బండారాన్ని ప‌క్కా లెక్క‌ల‌తో - ప‌క్కా ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టేశారు. చంద్ర‌బాబుతో పాటు కేంద్రం - రాష్ట్రాల మ‌ధ్య సంధాన‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించిన కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి చేసిన ప్ర‌క‌ట‌న‌ల‌ను పేప‌ర్ కటింగుల‌తో స‌హా తీసుకొచ్చిన వీర్రాజు... బాబు బ్యాచ్‌కు బాగానే షాకిచ్చార‌ని చెప్పాలి. అయినా ఈ ప్రెస్ మీట్‌ లో వీర్రాజు ఏ రేంజిలో బాబు అండ్ కోను క‌డిగిపారేశారో ఆయ‌న మాట‌ల్లోనే చూద్దాం.

*మ‌నం ఎక్కువే సాధించాం. 2017లో మ‌న ముఖ్య‌మంత్రి గారి స్టేట్ మెంట్. ఏ రాష్ట్రానికైనా ఇంత‌క‌న్నా ఎక్కువ నిధులు వ‌చ్చాయా? ఆధారాలుంటే రండి. చెప్పండి. ప్ర‌తిప‌క్షాల‌కు ముఖ్య‌మంత్రి స‌వాల్‌. ప్ర‌త్యేక హోదాతో స‌మాన‌మైన అన్నీ వ‌చ్చాయి. ప్యాకేజీకి ప్ర‌య‌త్నిస్తున్నాం. ఇది ఈనాడులో వ‌చ్చిన సీఎం ప్ర‌క‌ట‌న‌. సుజ‌నా చౌద‌రి చెప్పిన విష‌యానికొస్తే... ఇది ఆంధ్ర‌జ్యోతి. అన్నీ ఇచ్చింది. ఇంత‌కుమించి అడ‌గ‌లేం. అలానే వివిధ సంద‌ర్భాల్లో వారు ఏమేం చెప్పారో అన్న విష‌యాలు కూడా డిటైల్డ్‌గానే ఉన్నాయి. ఎక్కువ స‌మ‌యాన్ని వృథా చేయ‌ద‌ల‌చుకోలేదు. ఇలాంటివి అనేక‌మైన సంద‌ర్భాల్లో వారు ఏమేం చెప్పారో తెలిసిందే. సుజ‌నా చౌద‌రి... కేంద్ర మంత్రిగా... కేంద్రానికి, రాష్ట్రానికి మ‌ధ్య సంధాన‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించారు. రాష్ట్రానికి నిధులు తీసుకురావ‌డంలో కీల‌క భూమిక పోషించారు. దానిని రెగ్యుల‌ర్‌గా మానిట‌రింగ్ చేస్తున్న‌టువంటి డైన‌మిక్ ముఖ్య‌మంత్రిగారు మ‌న‌ సీఎం గారు. ఇలా ఉన్న సంద‌ర్భంలో ఎందుకీ ప‌రిణామాలు వ‌చ్చిన‌యి. ఈ వార్త‌లు వాస్త‌వ‌మే క‌దా. దీనిని ఖండించ‌డానికి అవ‌కాశం లేదు క‌దా. వాస్త‌వంగా ఈ రాజ‌కీయ దుమారానికి ఇవి స‌మాధానాలు. ఈ రాజ‌కీయ దుమారం వాస్త‌వ‌మా? కాదా? అందుకే మా అధ్య‌క్షుల వారు ఢిల్లీలో ఓ ప్రెస్ మీట్ పెట్టి... దీనికి తెర‌దించే ప్ర‌య‌త్నం చేశారు. బిల్లులోని అంశాల‌ను 2020 వ‌ర‌కు చేయొచ్చు. అలా కాదంటే కాంగ్రెస్ పార్టీని నిల‌దీయాలి. బిల్లులో ఉన్న అంశాన్ని ఐదేళ్లే అని ఎందుకు పెట్ట‌లేదు. ఎవ‌రైనా అడ‌గ‌వ‌ల‌సిన విష‌య‌మే.

సంస్థ‌ల విష‌యానికి వ‌స్తే.. వంద శాతం ఇచ్చారు. అదనంగా మ‌రో ఎనిమిది ఇచ్చారు. రెండు సంస్థ‌ల‌తో పాటు మ‌రో ఎనిమిదిని ఇచ్చార‌ని, 16 వ‌ర్సిటీల‌ను ఇచ్చార‌ని ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు చెప్పారు. మా స‌మ‌క్షంలో తెలియజేశారు. నిట్‌కు స్టార్టింగ్లో వంద సీట్లే ఇస్తారు. కానీ కేంద్రాన్ని క‌న్విన్స్ చేసి... వంద సీట్ల‌కు బ‌దులుగా 400 సీట్లు సాధించారు. త‌క్కువ నిధులు అలోకేట్ చేశార‌ని చెప్పారు. నిట్ లాంటి సంస్థ‌లు కేంద్రం మేనేజ్ మెంట్ తో న‌డుస్తాయి. వారే త‌ర‌గ‌తులు క‌ట్టుకుంటారు. స‌గం మంది ఇత‌ర రాష్ట్రాల నుంచి సగం మంది వ‌స్తారు. ఇక రాజ‌ధాని విష‌యానికి వస్తే... రాజ్ భ‌వ‌న్‌ క‌ట్టాలి. సెక్ర‌ట‌రేయ‌ట్ క‌ట్టాలి. అసెంబ్లీ క‌ట్టాలి. హైకోర్టు క‌ట్టాలి. ఈ నాలుగింటికి 4 వేల కోట్ల పై చిలుకు నిధులు అవ‌స‌రం కాగా... ఇప్ప‌టికే 1500 కేంద్రం, 1000 కోట్లు వెంక‌య్య ఇచ్చారు. కేపిట‌ల్ జోన్‌కూ ఇచ్చారు. హైదరాబాదులో కేసీఆర్ క‌ట్టే స‌చివాల‌యానికి ఖ‌ర్చు 200 కోట్లే క‌దా. లోటు బ‌డ్జెట్ కింద‌ 16 వేల కోట్లు ఇవ్వాల‌ని ప్రొజెక్ట్ ఇచ్చారు. ఇది అంచ‌నానే. ఇప్ప‌టిదాకా 3980 కోట్లు విడుద‌ల చేశారు. కేంద్రం లెక్క‌లు చూస్తే... వ‌చ్చింది 4600 కోట్లు. కానీ... రాష్ట్రం 16 వేల కోట్లుగా చెబుతోంది. రుణ‌మాఫీని పెట్టారు. కొన్ని సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అందులో యాడ్ చేశారు. యూపీ బడ్జెట్ లో 4.5 ల‌క్షల కోట్లు వేత‌నాల‌కే. వారికే రుణ‌మాఫీ చేయ‌లేదు.

ప్ర‌త్యేక హోదా 16 వేల‌కు బ‌దులుగా 12 వేలే కోట్లే ఇచ్చార‌ని సీఎం చెబుతున్నారు. ప్ర‌త్యేక హోదా రాష్ట్రానికి అభివృద్ది కోసం నిధులు వినియోగించుకోవ‌డ‌మే త‌ప్పించి మ‌రొక‌టి కాద‌న్న విష‌యం గ‌మ‌నించాలి. రైల్వే జోన్ విష‌యానికి వ‌స్తే.. దేశంలో ఉన్న‌వే 8 జోన్లు. ఇప్ప‌టిదాకా విభ‌జ‌న జ‌రిగిన ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ప్ర‌త్యేక రైల్వే జోన్ ఇవ్వ‌లేదు. రైల్వే బోర్డులు ప‌వ‌ర్ ఫుల్ బోర్డులు. రెండు సార్లు వేసిన క‌మిటీల్లో ర‌క‌ర‌కాల సాకులు చెప్పారు. జోన్ ఏర్పాటు చేసే బాధ్య‌త తీసుకున్నాం. దుగ‌రాజ‌ప‌ట్నాన్ని ప‌రిశీల‌న చేయాల‌ని కోరారు. విశాఖ‌లో ఒక్క‌టే ఉన్నా... రెండోది పెట్టాల‌న్న దానిపై అప్పుడే వివాదం రేగ‌గా... రాష్ట్ర ప్ర‌భుత్వానికి కేంద్రం లేఖ రాసింది. స్థ‌లమిస్తే క‌డ‌తామ‌ని చెప్పారు. క‌డ‌ప స్టీల్ విష‌యానికి వ‌స్తే...క‌మిటీ రెండు సార్లు వ‌చ్చి ప‌రిశీలించి... ఫీజిబిలిటీ రిపోర్టు పంపించారు. త్వర‌లోనే నిర్ణ‌యం వ‌స్తుంది. 24 గంట‌ల క‌రెంటిచ్చాం. ఉపాధి హామీలో 4 కోట్ల అద‌న‌పు ప‌ని దినాలు అడిగితే ఇచ్చాం. ప్ర‌త్యేక ప‌రిస్థితులున్న రాష్ట్రం దృష్ట్యా ఏపీకి అన్నింటినీ ప‌రిశీలిస్తున్నాం. వెనుకబ‌డిన జిల్లాల‌కు 2100 కోట్ల‌కు గానూ 1500 కోట్లు ఇస్తే... ఎక్క‌డ ఖ‌ర్చు పెట్టారు?* అంటూ వీర్రాజు త‌న‌దైన స్టైల్లో పూర్తి వివ‌రాల‌ను విప్పేశారు. దీనికి టీడీపీ నుంచి ఏం స‌మాధానం వ‌స్తుందో చూడాలి.