Begin typing your search above and press return to search.

వైసీపీ మంత్రులను అలా అనేశారేంటి.. ?

By:  Tupaki Desk   |   9 Nov 2021 5:30 PM GMT
వైసీపీ మంత్రులను అలా అనేశారేంటి..  ?
X
సోము వీర్రాజు ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు. అయితేనేమి ఆయన ఏపీలో కీలక నేతగానే ఉంటూ వచ్చారు. ఆరెస్సెస్ నేపధ్యంతో పాటు బీజేపీలో నిబద్ధతతో పనిచేసే లీడర్ కావడంతో కోరి మరీ ఆయనకు ఏపీ బీజేపీ పీఠం ఇచ్చేశారు. వీర్రాజు నాయకత్వంలో బీజేపీ ఏం సాధించింది అంటే పార్టీగా పెద్ద విజయాలు లేకపోయినా అందరినీ తమ చుట్టే తిప్పుకునే ఆర్ట్ లో మాత్రం ఆరితేరింది. ఇక వీర్రాజు అంటేనే ఫైర్ బ్రాండ్ అని ముద్ర. ఆయన నాడు చంద్రబాబు ఉన్నా నేడు జగన్ అధికారంలో ఉన్నా మాటలతో చెడుగుడు ఆడేస్తారు.

అయితే ఆయన తనదైన స్టైల్ నుంచి రూట్ మార్చి ఒక్కసారిగా హీట్ పెంచేశారు. ఏపీలో వైసెపీ మంత్రులను ఏకంగా ఎర్రి పుష్పాలను చేసేశారు. పిచ్చి పుష్పాలు అంటూ ఇరిటేట్ చేస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎర్రి పుష్పాలు అవార్డులు వైసీపీ మంత్రులకు ఇస్తామని కూడా ప్రకటించేశారు. ఈ గొడవ అంతా ఎందుకొచ్చింది అంటే బీజేపీ మీద వైసీపీ మంత్రులు నోరు చేసుకోవడం వల్లనే. ఆయన ఎంతదాకా వెళ్లారు అంటే బద్వేల్ లో వైసీపీని డేకించాం గుర్తుందా అంటూ కవ్విస్తున్నారు. నిజమే కదా 21 వేల ఓట్లు బీజేపీని అక్కడ రావడం అంటే తమాషా కాదు, ఏ విధంగా ఓట్లు వచ్చాయన్నది పక్కన పెడితే సులువుగా గెలవాల్సిన వైసీపీకి అన్నేసి ఓట్లు బీజేపీ సాధించడం మంటగానే ఉంది.

దాంతో వైసీపీ మంట మీద మరింత కారం జల్లేస్తూ రేపటి రోజున ఏపీలో సీన్ ఇలాగే ఉంటుంది అంటున్నారు. మొత్తానికి ఇపుడు అర్జంటుగా సీన్ లోకి బీజేపీ వచ్చేసింది. ఇప్పటిదాకా టీడీపీ జనసేనల మీదనే గట్టిగా విరుచుకుపడిన వైసీపీ ఇపుడు బీజేపీని కూడా కాసుకోవాల్సి వస్తోంది. ఏపీలో అభివృద్ధే లేదు, చెప్పుకునేందుకు కూడా ఏమీ లేదు అంటూ వీరావేశంతో వీర్రాజు చేస్తున్న కామెంట్స్ అధికార పార్టీని బాగానే హర్ట్ చేస్తున్నాయి. వీర్రాజు లో ఇంత ఫైర్ ఉందా అని కమలనాధులే ఆశ్చర్యపోయేలా దూకుడు చేస్తున్నారు. ఏపీలో వైసీపీని ఢీ కొట్టేదీ అధికారంలోకి వచ్చేదీ తామే అంటున్నారు. ఇక్కడ ఒక్కటి మాత్రం నిజం. ఏపీలో చూస్తే ఒకే ఒక ఎమ్మెల్సీ తప్ప మరేమీ లేని బీజేపీ ఇంతలా చాలెంజి చేస్తోంది అంటే కచ్చితంగా అది ఆ పార్టీ బలం అనే కంటే వైసీపీ బలహీనత అనుకుంటే సబబేమో. మాతో పెట్టుకుంటే మును ముందు ఇలాగే ఉంటుంది అని వీర్రాజు ఇస్తున్న సంకేతాలు ఫ్యాన్ పార్టీకి ఉక్క పెట్టేలాగానే ఉన్నాయి.