Begin typing your search above and press return to search.

టీడీపీ కోపం వెనుక కారణాన్ని చెప్పేసిన వీర్రాజు

By:  Tupaki Desk   |   11 Feb 2018 4:42 AM GMT
టీడీపీ కోపం వెనుక కారణాన్ని చెప్పేసిన వీర్రాజు
X
కేంద్ర బడ్జెట్ తర్వాత టీడీపీ-బీజేపీ కాపురంలో కలహాలు వీధికెక్కాయి. బడ్జెట్‌ లో ఏపీకి అన్యాయం జరిగిందని - ఏపీకి ఏమీ ఇవ్వకుండా కేంద్రం మాయ చేస్తోందంటూ టీడీపీ ఎంపీలు లోక్‌సభలో నిరసన తెలిపారు. అంతేకాదు... చంద్రబాబు కూడా స్వయంగా ఎంపీలకు దిశానిర్దేశం చేస్తూ... కూటమి నుంచి బయటకొచ్చేస్తామంటూ హడావుడి చేశారు. దీంతో టీడీపీ-బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. తాము ఎంతో చేశామని రాష్ట్ర బీజేపీ నేతలు.. ఏమీ ఇవ్వలేదంటూ టీడీపీ నేతలు ఒకరినొకరు విమర్శించుకున్నారు. అయితే... ఇంతకీ టీడీపీ కోపమంతా రాష్ర్టానికి న్యాయం చేయలేదనేనా...? లేదంటే ఇంకేదైనా కారణం ఉందా..? ఇదంతా ఏపీపై ప్రేమేనా? అన్న అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. వారి అనుమానాలు తీర్చేలా ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు. టీడీపీ కోపానికి అసలు కారణమేంటో ఆయన విశ్లేషించారు.

తాజాగా ఆయన ఓ న్యూస్‌ చానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టీడీపీ-బీజేపీ మధ్య గొడవలకు కారణాన్ని వివరించారు. అసలు కారణం బడ్జెట్ కాదని.. అసెంబ్లీ సీట్లను పెంచకపోవడంతో చంద్రబాబుకు కోపమొచ్చిందని ఆయన అంటున్నారు.

ప్రస్తుతం ఏపీలో 175 శాసనసభ సీట్లు ఉండగా వాటిని 225కు పెంచాలని టీడీపీ చాలాకాలంగా డిమాండ్ చేస్తోంది. అయితే ఈ విషయంలో కేంద్రం నుంచి ఎటువంటి హామీ రాలేదని - అవి పెంచనందుకే టీడీపీ నానా గొడవ చేస్తోందని వీర్రాజు ఆరోపించారు. సీట్లు కనుక పెంచి ఉంటే టీడీపీ నోరు మెదిపి ఉండేదే కాదన్నారు. మనసులో ఇది పెట్టుకుని బయటకు మాత్రం రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల మాటలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. టీడీపీకి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని - రాజకీయ లబ్ధి కోసమే ఆందోళన చేస్తోందని వీర్రాజు దుయ్యబట్టారు.