Begin typing your search above and press return to search.

సోము నోటికి తాళం పడలేదండోయ్!

By:  Tupaki Desk   |   15 Feb 2018 10:53 AM GMT
సోము నోటికి తాళం పడలేదండోయ్!
X
ఏపీ భాజపా ఫైర్ బ్రాండ్ నాయకుడు.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం మీద, పరిపాలన వైఫల్యాల ఎడతెగని విమర్శలతో విరుచుకుపడుతూ ఉండే నాయకుడు సోము వీర్రాజు వాగ్ధాటికి అధిష్టానం నుంచి తాళాలు పడినట్లుగా కొన్ని రోజుల కిందట వార్తలు వచ్చాయి. ఢిల్లీనుంచి పార్టీ చీఫ్ అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి.. రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడేప్పుడు హద్దులు దాటవద్దని హెచ్చరించినట్లుగా, అవసరమైతే తీవ్ర చర్యలు తీసుకుంటాం అని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ప్లాంటెడ్ గా ప్రచారంలోకి పెట్టారో ఏమో తెలియదు గానీ.. తాజాగా గురువారం నాడు సోము వీర్రాజు - రాష్ట్రప్రభుత్వ వైఖరి చెబుతున్న అబద్ధాలపై మళ్లీ ఒక రేంజిలో రెచ్చిపోయారు.

ఆయన చెబుతున్న ప్రకారం.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీల్లో 90 శాతం నిదులు ఆల్రెడీ విడుదల చేసేసిందిట. కానీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఇప్పటిదాకా 10 శాతం కూడా అమల్లోకి తీసుకురాలేదుట. ఎన్నికల్లో కీలకంగా చెప్పిన నిరుద్యోగ భృతిని కూడా ఇప్పటిదాకా అమలు చేయలేదని సోము వీర్రాజు ఫైర్ అయ్యారు.

అలాగే, చంద్రన్న బీమా - గ్రామాల అభివృద్ధి అచ్చంగా కేంద్రం నిధులతోనే చేపడుతున్నప్పటికీ... వాటి గురించి సొంత పేర్లు పెట్టుకుని తెదేపా రాజకీయ మైలేజీ కి యత్నిస్తున్నదని ఆరోపించారు. తెలుగుదేశం నాయకులకు దమ్ముంటే ఈ విషయంలో బహిరంగ చర్చకు సిద్ధం కావాలని కూడా సోము వీర్రాజు సవాలు విసురుతున్నారు.

అయితే కొత్త ట్విస్టు ఏంటంటే.. ప్రత్యేకహోదా గురించి ఒకరు డ్రామాలు ఆడుతోంటే.. ఇంకొకరు రాజీనామాలంటూ కొత్త డ్రామాలకు తెరతీశారని సోము ఆరోపించడం విశేషం. డ్రామాలు ఆడుతున్నది పవన్ కల్యాణ్ గురించే అని అన్యాపదేశంగా ఆయన చెప్పినట్లుగానే పలువురు భావిస్తున్నారు. అదేసమయంలో.. వైకాపాతో అంటకాగుతున్నట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారికి కూడా చురుక్కు మనిపించేలా.. రాజీనామాలు కొత్తడ్రామాగా సోము పేర్కొనడం విశేషం.

దీన్ని బట్టిచూస్తే తెలుగుదేశం పార్టీ తమను నిందించేలాగా.. వారి మీద వ్యక్తిగత నిందలకు, అవినీతి ఆరోపణలకు మాత్రమే పాల్పడవద్దని.. కేంద్ర నిధుల విషయంలో వారి అలసత్వాన్ని - కేంద్ర నిధులను సరిగ్గా ఖర్చుచేయలేకపోతున్నారనే విషయంలోనూ ఎడాపెడా విమర్శించినా పరవాలేదని కేంద్రంనుంచి రాష్ట్ర భాజపా నాయకులకు సంకేతాలు అందిఉండవచ్చుననే ప్రచారం జరుగుతోంది.