Begin typing your search above and press return to search.
సోము మాట!... హోదాకు బాబు అవినీతే అడ్డు!
By: Tupaki Desk | 24 March 2018 7:19 AM GMTటీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పాలనపై ఏపీకి చెందిన బీజేపీ నేత - ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోమారు విరుచుకుపడ్డారు. నేటి ఉదయం విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన సోము... బాబు సర్కారుపై సంచలన ఆరోపణలే చేశారు. అసలు ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు అవినీతి పాలనే కారణమని కూడా సోము మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాబు అవినీతి పాలన కారణంగానే కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదాను ఇచ్చేందుకు సిద్ధంగా లేదని ఆయన పేర్కొన్నారు. బాబు అవినీతి పాలన మకిలీ ప్రత్యేక హోదా నిధులకు అంటకుండా ఉండేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఓ చక్కటి ఫార్ములాను ప్రతిపాదించారని, అయితే ఆ ప్రతిపాదనకు చంద్రబాబు అండ్ కో ససేమిరా అంటోందని వీర్రాజు ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగానే ఉందని కూడా వీర్రాజు ఆసక్తికర కామెంట్ చేశారు.
ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్న కేంద్ర ప్రభుత్వం... బాబు అవినీతి పాలనను చూసి వెనకడుగు వేసిందని, అయినా ప్రత్యేక హోదా కింద దక్కే నిధుల ఖర్చుకు సంబంధించి స్పెషల్ స్టేటస్ వెహికిల్ లాంటి ఓ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని అరుణ్ జైట్లీ ప్రతిపాదిస్తే... ఆ ప్రత్యేక ఏర్పాట్లు కుదరవని బాబు తెగేసి చెప్పారన్నారు. మొత్తంగా బాబు వైఖరి కారణంగానే ఏపీకి ప్రత్యేక హోదా దక్కకుండా పోతోందని కూడా వీర్రాజు సంచలన ఆరోపణ చేశారు. ప్రత్యేక హోదాకు చంద్రబాబు అవినీతే కారణమన్న తన వాదనను బలపరుచుకునేందుకు సోము వీర్రాజు చంద్రబాబు పాలనలో సాగుతున్న అవినీతిపై మరోమారు ఘాటు విమర్శలు చేశారు. మట్టి నుంచి ఇసుకదాకా, పోలవరం నుంచి పట్టిసీమ దాకా లక్షల కోట్ల అవినీతి జరిగిందని, ఆఖరికి బడిపిల్లల టాయిలెట్ల కోసం ఇచ్చిన నిధులను కూడా చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు ఆసాంతం నాకేశారని వీర్రాజు మండిపడ్డారు.
ఇంకా సోము వీర్రాజు ఏమన్నారంటే... *ఏపీ వరదాయిని పోలవరంతోపాటు పట్టిసీమ, రాయలసీమ ప్రాజెక్టులు అవినీతికి నిలయంగా మారాయి. పట్టిసీమలో అవినీతి తవ్వడానికి గునపలు చాలవు. ఒక ట్రాక్టర్ మట్టి తీయడానికి 4 లక్షలు తినేస్తున్నారు. పట్టిసీమ 1125 కోట్ల నుంచి మొదలై 1667 కోట్లకు వెళ్ళింది. 24 పంపులు వేసి, 30 పంపులకు లెక్కలు కట్టారు. టెండర్లలో లేనివాటికి కోట్లు కుమ్మరించారు. మట్టి పేరుతో 67 కోట్లు నొక్కేశారు. స్పీల్ వేలో రూ.1400 ఖర్చు ఎందుకు జరిగింది. పంపు సెట్లకు రూ.340 కోట్ల ఖర్చు వస్తుందా?, కెనాల్ కలపడానికి గొట్టాల కోసం రూ.817కోట్లు ఎలా అయ్యింది? జన్మభూమి కమిటీల పేరుతో ఒక్కో ఇంటికి రూ.20 వేలు వసూళ్లు చేస్తున్నారు. కొత్త పింఛన్ కు మూడు నెలల డబ్బులు ముందే తీసుకుంటున్నారు. నీరుచెట్టు ఓ నాటకం. ఆఖరికి స్కూళ్లలో ఆడపిల్లల కోసం కట్టిన టాయిలెట్ల నిర్వహణలోనూ చంద్రబాబు అండ్ కో నిధులు నాకేస్తున్నారు. రాష్ట్రంలోని జిల్లా ఆస్పత్రుల్లోనూ భారీ అవినీతి జరుగుతోంది*అని వీర్రాజు ఆరోపించారు.
*మొక్కలు పెంచడానికి కూడా చంద్రబాబు ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఉద్యోగులను కేటాయించడం ఆశ్చర్యం కాక మరేమిటి? శ్రీశైలం, అన్నవరం, దుర్గగుడిలో కూడా వారే మొక్కలు పెంచుతారట. ఆ మొక్కలు ఏవీ? దేవాలయాల వద్ద మొక్కల పెంపకం దేవాదాయ శాఖ చూసుకుంటుంది కదా? ప్రజల సొమ్మంటే ప్రభుత్వానికి పప్పు, బెల్లంలా అయిపోయింది. తెలంగాణ సీఎం కేసీఆర్ తమ సచివాలయం కోసం రూ.150 కోట్లు అని చెబుతుంటే.. మన రాష్ట్రంలో మాత్రం రూ.950 కోట్లు ఎలా అవుతాయి. ఎన్ఆర్ఈజీఎస్, సర్వ శిక్షా అభియాన్ నిధులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి. ఔట్ సోర్సింగ్ లోనూ అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. అసలు వెంగమాంబ ఎవరు? బాబు అవినీతిపై ఎవరైనా ఏదైనా అడిగితే... అదేమైనా మోదీ సొమ్మా? ఉత్తర, దక్షిణ భారతదేశం అంటూ ఆరోపణలు చేస్తున్నారు. లేదంటే వైసీపీ - జగన్ స్క్రిప్టు అని - పవన్ కళ్యాణ్ మాట్లాడితే పొద్దున ఉండవల్లి అరుణ్ కుమార్ స్క్రిప్టు అని - సాయంత్రం బీజేపీ స్క్రిప్టు అని టీడీపీ పెద్దలు అంటున్నారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ కంటే కూడా ఏపీలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. ఏపీలో జయప్రకాశ్ నారాయణన్ సంపూర్ణ విప్లవం రావాలి* అని వీర్రాజు తనదైన స్టైల్లో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
చంద్రబాబుపై తాను చేసిన ఆరోపణలకు సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలున్నాయని కూడా వీర్రాజు మరో సంచలన వ్యాఖ్య చేశారు. రాష్ట్రంలో అవినీతిపై కాగ్ నివేదికే నిదర్శనమని వీర్రాజు అన్నారు. తాను చెప్పేవన్నీ కాగ్ మీటింగ్ లో తేలిన విషయాలేనని అన్నారు. ప్రభుత్వ అవినీతిని తవ్వడానికి పలుగు - పారా సరిపోదని.. ఏకంగా బుల్డోజర్ కావాలని అన్నారు. రాష్ట్రంలో అవినీతిని కట్టడి చేయలేని సీఎం.. జపాన్ తరహా ఉద్యమాలు చేస్తామని చెప్పడం హాస్యాస్పదమని ఆయన భారీ సెటైర్లే వేశారు. టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అయ్యిందని వీర్రాజు ఎద్దేవా చేశారు. దేశంలో కిందిస్థాయి దాకా అవినీతిని తీసుకెళ్లిన ఏకైక పార్టీ తెలుగుదేశమేనని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొత్తంగా మొదటి నుంచి టీడీపీ, చంద్రబాబుపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్న సోము వీర్రాజు.. ఈ దఫా మాత్రం మరింతగా రెచ్చిపోయారనే చెప్పాలి. మరి సోము వ్యాఖ్యలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.