Begin typing your search above and press return to search.

వీర్రాజు క్వ‌శ్చ‌న్‌!... బాబుకు ద‌మ్ముందా?

By:  Tupaki Desk   |   5 Feb 2018 8:45 AM GMT
వీర్రాజు క్వ‌శ్చ‌న్‌!... బాబుకు ద‌మ్ముందా?
X
ఏపీలో బీజేపీ, టీడీపీ మ‌ధ్య రాజుకున్న మాట‌ల మంట‌లు ఇప్పుడ‌ప్పుడే చ‌ల్లారేలా లేవు. ఎందుకంటే... టీడీపీ ఓ మోస్తరుగా నిర‌స‌న‌లు తెలిపేందుకే సిద్ధ‌ప‌డ‌గా... మొన్నామ‌ధ్య టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధ‌మేన‌ని, త‌మ‌తో పొత్తు వ‌ద్ద‌నుకుంటే దండం పెట్టి పోతామ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆ వ్యాఖ్య‌ల‌కు ప్ర‌తిస్పంద‌న‌గా బీజేపీ కూడా ఘాటుగానే స్పందించింది. ఈ మాటల యుద్ధానికి చెక్ పెట్టేద్దామంటూ ముందుగా చంద్ర‌బాబు, ఆ త‌ర్వాత బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా త‌మ త‌మ పార్టీ శ్రేణుల‌కు సూచించారు. ఈ సూచన‌లు వెలువ‌డ్డ మ‌రునాడే నిన్న క‌ర్నూలు వెళ్లిన బీజేపీ సీనియ‌ర్ నేత‌ - ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మ‌రింత‌గా రెచ్చిపోయారు. రెండెక‌రాల పొల‌ముంద‌ని చెప్పుకుంటున్న చంద్ర‌బాబుకు ఇప్పుడు వేలాది కోట్ల రూపాయ‌లు ఎలా వ‌చ్చాయంటూ కాస్తంత సూటిగానే ప్ర‌శ్నించిన వీర్రాజు... అస‌లు టీడీపీ పాల‌న మొత్తం అవినీతిమ‌య‌మైపోయింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. చంద్ర‌బాబు సొంత నియోజక‌వ‌ర్గం కుప్పంలోనే వేల కోట్ల రూపాయ‌ల కుంభ‌కోణం జ‌రిగిందంటూ ఆ ఆరోప‌ణ‌ల‌కు మరింత ఘాటు త‌గిలించేశారు.

వీర్రాజు వ్యాఖ్య‌లు విన్నంత‌నే టీడీపీ నేత‌లు కూడా భ‌గ్గుమ‌న్నారు. ఎక్క‌డిక్క‌డ వీర్రాజు వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ మంత్రులు మీడియా ముందుకు రాగా... విజ‌య‌వాడ‌లో టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఏకంగా వీర్రాజు దిష్టిబొమ్మ‌ను ద‌గ్ధం చేశారు. ఈ విష‌యంపై వీర్రాజు స్పందించేలోగానే... నేటి ఉద‌యం ఆయ‌న ఇంటిని ముట్ట‌డించేందుకు టీడీపీ య‌త్నించింది. దీంతో మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన వీర్రాజు... టీడీపీ నేత‌ల తీరుపైనా, ముఖ్యంగా చంద్ర‌బాబు తీరుపైనా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. టీడీపీ నేత‌ల ఆందోళ‌న‌లు ఓ్ వైప‌పు కొన‌సాగుతుండగానే మీడియా ముందుకు వ‌చ్చిన వీర్రాజు... మ‌రోమారు చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు. అస‌లు చంద్ర‌బాబు గురించి చెప్పాల్సి వ‌స్తే... చాలానే ఉందంటూ మొద‌లెట్టిన వీర్రాజు... చంద్ర‌బాబు గురించి తాను చెప్పిన‌వ‌న్నీ వాస్త‌వాలేన‌ని చెప్పారు. అయినా చంద్ర‌బాబుకు దమ్ముందా? అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌... ద‌మ్ముంటే త‌న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని కూడా డిమాండ్ చేశారు.

చంద్ర‌బాబు గురించి తాను చెప్పిన వాస్త‌వాల‌ను జీర్ణించుకోలేకే... టీడీపీ నేత‌లు నానా యాగీ చేస్తున్నార‌ని, చివ‌ర‌కు త‌న ఇంటి ముట్ట‌డికి కూడా య‌త్నిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఈ త‌ర‌హా బెదిరింపు రాజ‌కీయాల‌కు తానేమీ బెదిరిపోయేది లేద‌ని, చంద్ర‌బాబుపై తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు ఇప్ప‌టికీ తాను క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఏపీలో సాగుతున్న అవినీతి పాల‌న గురించి మాట్లాడితే... త‌నపై ఎదురు విమ‌ర్శ‌లు చేయ‌డ‌మేమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌ప్పుల‌ను స‌రిదిద్దుకుని పాల‌న‌ను చ‌క్క‌బెట్టుకోవాల్సిన టీడీపీ.. బెదిరింపు రాజ‌కీయాల‌కు దిగ‌డం స‌రి కాద‌ని కూడా వీర్రాజు త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. మొత్తంగా చూస్తే... చంద్ర‌బాబుపై తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని చెప్పిన వీర్రాజు ఎటువంటి ప‌రిస్థితుల్లో వెన‌క‌డుగు వేసే ప‌రిస్థితే లేద‌ని తేల్చి చెప్పిన‌ట్లైంద‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి వీర్రాజును నిలువ‌రించేందుకు టీడీపీ ఎలాంటి వ్యూహాన్ని అమ‌లు చేస్తుందో చూడాలి.