Begin typing your search above and press return to search.

తమ బలం గురించి అతిగా ఊహిస్తున్న సోమూ!

By:  Tupaki Desk   |   6 Nov 2015 4:20 AM GMT
తమ బలం గురించి అతిగా ఊహిస్తున్న సోమూ!
X
చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కాలిలోని ముల్లు కంటినలుసు
ఇంటిలోని పోరు ఇంతింత గాదయా
విశ్వదాభిరామ వినురవేమ
శతకకారుడు మనకు ఏనాడో చెప్పాడు. ఇంటిలోని పోరు ఎంతగా చికాకు పెడుతూ ఉంటుంతో బహుశీ ఏపీలోని చంద్రబాబునాయుడు గారికి ఇప్పుడు స్వానుభవంలోకి వస్తూ ఉంటుంది. మిత్రపక్షం పేరుతో తెదేపా సర్కారులోనే కొలువు తీరి ఉన్న భాజపా నాయకులు సర్కారును ఎంతగా చికాకు పెడుతున్నారో అందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రత్యేకించి పురందేశ్వరి - సోము వీర్రాజు - కావూరి సాంబశివరావు లాంటి వాళ్లు పనిగట్టుకుని ప్రతిపక్షం పాత్రను పోషిస్తూ చంద్రబాబునాయుడు ప్రభుత్వం మీద, చేపడుతున్న పనుల మీద విషప్రచారం చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు మాత్రం భాజపా కేంద్రనాయకత్వంతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా అన్నింటినీ సహిస్తూ వెళుతున్నారు.

తెదేపా ఎంతగా.. సర్దుకుని వెళుతున్నప్పటికీ.. కేంద్రంలో తాము అధికారంలో ఉన్నాం కదాని.. ఏపీ భాజపా నాయకులు ప్రదర్శిస్తున్న దూకుడు మాత్రం తరచూ శృతిమించుతోంది. తాజాగా సోము వీర్రాజు.. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్లీ అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇరుపార్టీల మధ్య అంతరాలను పెంచేలాగానే ఆయన వ్యాఖ్యలు ఉండడం విశేషం.

ఇప్పుడు రాష్ట్రంలో భాజపా సొంతంగా ఎదిగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయంటున్న సోము వీర్రాజు.. ఏ ఒక్కఅవకాశాన్నీ జారవిడుచుకోకుండా ఎదుగుతాం అంటున్నారు. చంద్రబాబు సర్కారు ఏమేం తప్పులు చేస్తున్నదనే విషయంలో అన్నీ ఇప్పటిదాకా చెప్పిన సంగతులే చెబుతున్నారు గానీ.. వేర్పాటు వాదం పెరిగేలా.. అమరావతి మీదనే దృష్టిపెడుతున్నారని ఆరోపించడం, రాయలసీమ గురించి పట్టించుకోలేదనడం విశేషం.

ఏదేమైనా పొత్తులు లేకపోతే.. 2014 ఎన్నికల్లోనే 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో పోటీచేసి ఉండేవాళ్లం అని.. ఇప్పుడు దక్కిన దానికంటె ఎక్కువ స్థానాలను గెలిచి ఉండేవాళ్లం అని.. సోము వీర్రాజు అనడం చూస్తోంటే.. 2019 లో అదే పనిచేస్తాం అన్న సంకేతాలు ఉన్నాయి గానీ.. ఆయన తన పార్టీ ఏపీలో బలం గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.