Begin typing your search above and press return to search.

బాబు ఒంట్లో కాంగ్రెస్ రక్తం పొంగిపొర్లుతోంది

By:  Tupaki Desk   |   27 May 2018 4:50 PM GMT
బాబు ఒంట్లో కాంగ్రెస్ రక్తం పొంగిపొర్లుతోంది
X
‘నా ఒంట్లో 30 శాతం కాంగ్రెస్ రక్తమే’.. చంద్రబాబు ఒకప్పుడు తన నోటితో తానే చెప్పిన మాట ఇది. తాజా పరిణామాలు - మారుతున్న రాజకీయాలు చూస్తుంటే చంద్రబాబు ఒంటినిండా కాంగ్రెస్ రక్తమే నిండిపోతున్నట్లుగా ఉందన్న మాట వినిపిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటుపై చంద్రబాబు తెగ సంబరపడుతున్న నేపథ్యంలో బీజేపీ నేత సోము వీర్రాజు కూడా ఇదే తరహా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఒంట్లో కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తున్నందునే ఆయన జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి మద్దతిస్తున్నారని ఆరోపించారు. మరో బీజేపీ నేత రాంమాధవ్ కూడా ఇవే ఆరోపణలు చేశారు. అయితే... దీనంతటికీ చంద్రబాబు ఒంట్లో కాంగ్రెస్ రక్తం ప్రవహించడం ఒక కారణం కాగా.. 2019 ఎన్నికల్లో అవశేష కాంగ్రెస్ ఓట్లను ఉపయోగించుకునే ఎత్తుగడ కూడా ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2014లో ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించిన తరువాత ఆ ఎన్నికల్లో ఏపీ ప్రజలు కాంగ్రెస్‌ను ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ రాకుండా చేశారు. అంతేకాదు.. విభజన జరిగి నాలుగేళ్లు దాటినా కాంగ్రెస్‌ను ఆ పాపం వీడలేదు.. ఆ పార్టీ ఇంకా కోలుకోలేదు. కానీ.. సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ నమ్మకమైన మద్దతుదారులున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పై కోపంతో ఆ పార్టీకి డిపాజిట్లు రాకుండా చేసుండొచ్చు.. కానీ, ఇప్పటికీ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ఓటేసేవారు కనీసం 2 నుంచి 3 వేల మంది ఉంటారు. 2019 ఎన్నికల్లో ఓవైపు జగన్‌ ను ఎదుర్కోవడమే కష్టమనుకుంటే.. పవన్ కూడా అడ్డం తిరగడంతో చంద్రబాబు ఒంటరిగా మారారు. ఈ దశలో వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం కూడా టీడీపీకి గెలుపు అవకాశాలు లేవు. దీంతో వీలైనన్ని సీట్లు సాధించి సంకీర్ణాల్లోనైనా కీలకంగా ఉండడమో.. అవకాశం చేజిక్కించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయడమో కావాలంటే కాంగ్రెస్‌ కు ఉన్న ఆ ఓట్లు ఎంతో అవసరం. అందుకే చంద్రబాబుకు ఈ తాపత్రయం.

2019 ఎన్నికల్లో బతికి బట్టకట్టడం కోసం తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతానికే చంద్రబాబు తిలోదకాలిచ్చినట్లవుతోంది. కాంగ్రెస్ వ్యతిరేకత - తెలుగువాడి ఆత్మగౌరవం అనే సైద్ధాంతిక పునాదులపై తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపిస్తే ఇప్పుడు చంద్రబాబు ఆ సిద్ధాంతానికి పూర్తిగా దూరమవుతున్నారని టీడీపీయేతర పార్టీల నేతలు అంటున్నారు. అంతేకాదు... ఫిరాయింపులను ప్రోత్సహించడం.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనేయడం.. కుటుంబ పాలన వంటి అనేక రూపాల్లో ఇప్పటికే ఆయన టీడీపీని కాంగ్రెస్‌ లా మార్చేశారన్నది విశ్లేషకుల మాట.