Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌ను వ‌దిలేది లేదంటోన్న బీజేపీ!

By:  Tupaki Desk   |   2 Oct 2021 12:30 PM GMT
ప‌వ‌న్‌ను వ‌దిలేది లేదంటోన్న బీజేపీ!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర బీజేపీ నేత‌లు ఒక్క‌సారిగా యాక్టివ్ అయ్యారా? ఇన్ని రోజులు కేవలం మ‌తప‌ర‌మైన అంశాల‌పై త‌ప్ప వేరే విష‌యాల‌పై స్పందించ‌ని ఆ పార్టీ నేతలు ఇప్పుడు గొంతెత్తున్నారా? అధికార వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల్లో జోరు పెంచారా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల్లో అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. మ‌రి అందుకు కారణం ఏమిటీ? అంటే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ అనే జ‌వాబు వ‌స్తోంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ స్పీడు పెచ్చేస‌రికి బీజేపీ నేత‌లు ఏపీలో జోరు అందుకునే దిశ‌గా సాగుతున్నారు. ఒక్క‌సారిగా వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డం మొద‌లెట్టారు.

తాజాగా చెత్త వాహ‌నాల విష‌యంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌లు చూస్తుంటే ఈ విష‌యం అర్థ‌మవుతోంది. కేంద్రం నిధులు ఇస్తుంటే చెత్త వాహ‌నాల‌కు వైసీపీ రంగులు వేసుకుంద‌ని వీర్రాజు విమ‌ర్శించారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై స‌హ‌జంగానే వైసీపీ మంత్రులు స్పందించి ఘాటుగానే స‌మాధాన‌మిచ్చారు. అయితే ఇన్ని రోజులు ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప‌క్క‌కుపెట్టి కేవ‌లం మత‌ప‌ర‌మైన విష‌యాల్లోనే ఆస‌క్తి చూపించి జ‌గ‌న్‌ను ఇబ్బంది పెట్టేందుకు ప్ర‌య‌త్నించిన బీజేపీ నాయ‌కులు ఇప్పుడు ఇలా ఇత‌ర విష‌యాల‌పై మాట్లాడుతున్నారంటే అందుకు కార‌ణం ప‌వ‌న్ అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అధికార ప్ర‌భుత్వంపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌ల‌తో ప‌వ‌న్ దూసుకెళ్తున్నారు. సొంతంగా జ‌నాల్లోకి వెళ్లేందుకు కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఇటీవ‌ల ఓ స‌మావేశంలో భ‌విష్య‌త్‌లో వైసీపీకి గుణ‌పాఠం చెప్పి జ‌న‌సేన అధికారం చేప‌డుతుంద‌ని ప‌వ‌న్ అన్నారు. కానీ బీజేపీ కూట‌మి గురించి ఒక్క మాట కూడా చెప్ప‌లేదు. ద‌క్షిణాదిలో పాగా వేసేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్న బీజేపీ.. ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే ఏపీలో ప‌వ‌న్‌తో చేతులు క‌లిపింది. ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నామ‌నే అభిప్రాయాన్ని క‌లిగించి.. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను వాడుకోవాల‌నే వ్యూహం ర‌చించింద‌ని నిపుణులు అంటున్నారు. కానీ తిరుపతి పార్ల‌మెంట్ ఉప ఎన్నిక‌లో ఆ వ్యూహం ఫ‌లించ‌లేదు. మ‌రోవైపు తాజాగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో బీజేపీ కంటే జ‌న‌సేన‌కే ఎక్కువ బ‌లం ఉంద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మైంది.

ఈ నేప‌థ్యంలో బీజేపీతో బంధం తెంచుకునేందుకు ప‌వ‌న్ సిద్ధ‌మ‌య్యార‌ని.. అందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా పోరాడాల‌నే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ప‌వ‌న్ వీలైనంత త్వ‌ర‌గా బీజేపీకి దూర‌మ‌వాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం. దీంతో బీజేపీలో అభ‌ద్ర‌తా భావం ఏర్ప‌డింది. ప‌వ‌న్ ఎక్క‌డ దూర‌మ‌వుతారేమోన‌ని భ‌య‌ప‌డి ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టింది. వైసీపీపై సొంతంగానే విమ‌ర్శ‌లు చేస్తోంది. కానీ బీజేపీ ఎంత కోరుకున్నా.. ప‌వ‌న్ ఆ పార్టీతో క‌లిసి కొన‌సాగ‌డ‌నే విష‌యం తెలుస్తూనే ఉంది. మ‌రి బీజేపీ ఏం చేస్తుందో చూడాలి.