Begin typing your search above and press return to search.

చంద్రబాబు అవినీతి పై రెఫరెండం నిర్వహించాలట!

By:  Tupaki Desk   |   20 Dec 2020 10:30 AM GMT
చంద్రబాబు అవినీతి పై రెఫరెండం నిర్వహించాలట!
X
చంద్రబాబునాయుడు అవినీతిపై రెఫరెండం నిర్వహించాలని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విచిత్రమైన డిమాండ్ చేశారు. గడచిన రెండు రోజుల నుండి చంద్రబాబు అండ్ కో రెఫరెండం విషయంలో అనేక డిమాండ్లు చేస్తన్న విషయం అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులపై జనాభిప్రాయం కోసం రెఫరెండం నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి చంద్రబాబు డిమాండే అసంబంద్దం. ఎందుకంటే మనదేశంలో ఏ విషయంలో కూడా రెఫరెండం అనే ప్రాక్టీసు లేదు.

అధికారంలో ఉన్న తనిష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకోవటమే మనదేశంలో ఉంది. అధికారపార్టీ తీసుకున్న నిర్ణయాలు, విధానాలు నచ్చకపోతే తర్వాత ఎన్నికల్లో జనాలు ఓడించటమే రెఫరెండంగా భావించాల్సుంటుంది. 2014లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసిన జనాలే 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడగొట్టారు. అంటే ఐదేళ్ళ చంద్రబాబు పాలనపై తమలో పెరిగిపోయిన అసంతృప్తిని మొన్నటి ఎన్నికల్లో ఓట్లరూపంలో చూపించారు.

ఇక 2019 ఎన్నికల్లో 151 సీట్ల మెజారిటిని ఇవ్వటం ద్వారా జగన్ కు జనాలు మద్దతు పలికారు. జగన్ నిర్ణయాలు నచ్చకపోతే తర్వాత ఎన్నికల్లో ఓడిగొట్టేస్తారనటంలో సందేహం లేదు. అంతేకానీ మద్యలో ప్రభుత్వ నిర్ణయాలపై రెఫరెండం అనే పద్దతే లేదు. ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబు పదే పదే ఇదే డిమాండ్లు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే సోమువీర్రాజు హఠాత్తుగా చంద్రబాబు అవినీతిపై రెఫరెండం అని మొదలుపెట్టారు.

నిజానికి చంద్రబాబు అవినీతిపై కొత్తగా రెఫరెండం అవసరం లేదు. 2019 ఎన్నికల్లో జనాలిచ్చిన తీర్పే రెఫంరెండంగా అర్ధమైపోతోంది. అమరావతికి చంద్రబాబు చేసిన రూ. 7200 కోట్ల ఖర్చు, ఆ ముసుగులో జరిగిన అవినీతిపైనే రెఫరెండం నిర్వహించాలని వీర్రాజు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు అవినీతిపై రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేసేబదులు సీబీఐ దర్యాప్తు చేయించాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే ఉపయోగం ఉంటుందేమో.