Begin typing your search above and press return to search.

చంద్రబాబుపైకి కాపులను ఉసిగొల్పుతున్న బీజేపీ

By:  Tupaki Desk   |   30 Oct 2015 7:21 AM GMT
చంద్రబాబుపైకి కాపులను ఉసిగొల్పుతున్న బీజేపీ
X
ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై బీజేపీ ఎమ్మెల్సీ వీర్రాజు విమర్శలకు అడ్డుకట్ట పడడం లేదు. అయితే... వీర్రాజు పదేపదే విమర్శలకు దిగుతున్నా బీజేపీ మాత్రం కట్టడి చేయకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా వీర్రాజు మరోసారి చంద్రబాబుపై మండిపడ్డారు. కాపులను చంద్రబాబు అవమానించారంటూ ఆయన రాజకీయం ప్రదర్శించారు. కాకినాడలో విలేకరులతో మాట్లాడిన ఆయన ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తుచేశారు. కాపుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి తొలి విడతలోనే వెయ్యి కోట్లు ఇస్తామని చంద్రబాబు కాపులను మోసగించారని ఆయన విమర్శించారు.

చంద్రబాబు కార్పొరేషన్ నైతే ఏర్పాటు చేశారు కానీ 50 కోట్లే ఇచ్చారని... వెయ్యి కోట్లు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. ఎన్నికలకు ముందు కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండు చేశారు. అక్కడితో ఆగని వీర్రాజు... చంద్రబాబు తన హామీలను అమలు చేయకపోతే కాపులంతా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడానికి రెడీ అవుతున్నారని... అప్పుడు చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

కాగా వీర్రాజు కొద్దిరోజులుగా రెచ్చిపోతున్నా రాష్ట్ర బీజేపీ మాత్రం ఆయన్ను కనీసం వారించడం లేదు. మరోవైపు చంద్రబాబు మాత్రం బీజేపీ నేతల వ్యాఖ్యలకు స్పందించొద్దని.. పట్టించుకోకుండా సర్దుకుపోవాలని మంత్రులు, టీడీపీ నాయకులకు సూచించారు. దీంతో వీర్రాజు లాంటివారి నోటి జోరుకు మరింత వేగం వచ్చినట్లువుతోంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆందోళనలు తప్పవు అని ఆయన హెచ్చరిస్తుంటే.. మిత్రపక్షంగా ఉంటూ ఆ వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవిగానే పరిగణించాలి. చంద్రబాబు ఇక ఈ విషయాన్ని సీరియస్ గా తీసకుంటారని... ఆ పార్టీ అధిష్ఠానంతోనే నేరుగా మాట్లాడతారని తెలుస్తోంది. అప్పుడు వీర్రాజు నిలబడతారో నీరుగారుతారో చూడాలి.