Begin typing your search above and press return to search.

సోము తగ్గ‌లేదు!..బాబును ఓ రేంజిలో ఏసుకున్నారు!

By:  Tupaki Desk   |   28 Dec 2017 5:38 PM GMT
సోము తగ్గ‌లేదు!..బాబును ఓ రేంజిలో ఏసుకున్నారు!
X
బీజేపీ నేత‌ - ఏపీ శాస‌న‌మండ‌లిలో ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజు ఏమాత్రం త‌న వైఖ‌రిని మార్చుకున్న‌ట్లుగా క‌నిపించ‌డం లేదు. మిత్ర‌ప‌క్ష‌మైన టీడీపీపై విరుచుకుప‌డుతూ... టీడీపీ కార‌ణంగా ఓ జాతీయ పార్టీగా తాము ఎంత మేర న‌ష్ట‌పోతున్నామో - ఎంత‌మేర అన్యాయానికి గుర‌వుతున్నామన్న విష‌యాల‌ను నిర్మోహ‌మాటంగా చెప్పేసే వీర్రాజు మొన్న‌టి గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం తర్వాత నిజంగానే స్వ‌రం పెంచారు. ఆ సంద‌ర్భంగా టీడీపీని ఓ రేంజిలో ఏసుకున్న వీర్రాజు.. ఓ నాలుగైదు రోజులుగా మీడియాకు క‌నిపించ‌డం లేదు. అయితే ఇరు పార్టీల మ‌ధ్య వైరం ఎందుక‌న్న విష‌యాన్ని ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తున్న చంద్ర‌బాబు... బీజేపీ నేత‌లు ఏమ‌న్నా కూడా ప‌ట్టించుకోవ‌ద్ద‌ని - అస‌లు బీజేపీ నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ అనుచిత కామెంట్లు చేయ‌రాద‌ని కూడా ఆదేశాలు జారీ చేశారు. అదే స‌మ‌యంలో బీజేపీ అధిష్ఠానం నుంచి కూడా వీర్రాజుకు ఇలాంటి మాటే వినిపించింద‌ని, ఆ కార‌ణంగానే ఆయ‌న నాలుగైదు రోజులుగా మీడియాకు క‌నిపించడం లేద‌ని అంతా భావించారు. అయితే ఆ భావ‌న త‌ప్ప‌ని కాసేప‌టి క్రితం వీర్రాజు నిరూపించేశారు. తానేమీ వెన‌క్కు త‌గ్గ‌లేద‌ని - త‌మ‌కు అన్యాయం చేసేవారు విప‌క్ష‌మైనా - మిత్ర‌ప‌క్ష‌మైనా వ‌దిలేది లేద‌న్న చందంగా ఆయ‌న మ‌రోసారి తీవ్ర వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ్డారు.

కాసేప‌టి క్రితం విశాఖ‌లో మీడియా ముందుకు వ‌చ్చిన వీర్రాజు టీడీపీ పైనా - ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడి పైనా త‌న‌దైన శైలిలో ఓ రేంజిలో ఫైర్ అయిపోయారు. అంతేకాకుండా ప్ర‌త్యేక హోదా విష‌యంలో బీజేపీని త‌ప్పుబ‌డుతున్న చంద్ర‌బాబు... ఏపీకి హోదా రాక‌పోవ‌డానికి చంద్ర‌బాబే కార‌ణ‌మ‌న్న కోణంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించాల్సిన టీడీపీ... దొంగ‌దెబ్బ‌లు తీస్తూ త‌మ‌ను ఎద‌గ‌కుండా చేస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. అస‌లు వీర్రాజు ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... ఏపీలో బీజేపీ బలపడుతున్న ప్రతిసారి టీడీపీ ప్రత్యేక హోదాను తెరపైకి తెస్తోంద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అస‌లు ఏపీకి హోదా అవసరం లేదని - ప్యాకేజీ కావాలని చంద్రబాబే అన్నారని స్పష్టం చేశారు. హోదా ఇస్తే ఏటా రూ.3వేల కోట్ల చొప్పున రూ.15వేల కోట్లే వచ్చేవని.. కానీ ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.2లక్షల 10వేల కోట్లు ఇస్తున్నామని తెలిపారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కరెంట్ ఉండేది కాదని, తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చాక కరెంట్‌ పోలేదని చెప్పారు. హైదరాబాద్‌ తరహాలోనే అమరావతిని కూడా అభివృద్ధి చేస్తున్నారని, అలాకాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్నారు. సోమవారాన్ని చంద్రబాబు పోలవారంగా మార్చుకున్నారని ఎద్దేవా చేసిన వీర్రాజు... మిగతా ప్రాజెక్టులను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. పోలవరాన్ని పూర్తి చేయాలన్న‌ నిశ్చయంతోనే కేంద్రం ఉందని, అందుకే ముందు ముంపు మండలాలను ఏపీలో కలిపిందని అన్నారు.

విభజన సమయంలో ఏపీకి ఏం కావాలనేది మాట్లాడింది ఒక్క వెంకయ్యనాయుడేనని, టీడీపీ ఎంపీలు మాత్రం నోటీకి గుడ్డలు కట్టుకొని ప్లకార్డులు ప్రదర్శించారని ఎద్దేవా చేశారు. విభజన సమయంలో రాష్ట్రానికి ఏంకావాలనే విషయం ఏ టీడీపీ నేత చెప్పలేదని గుర్తు చేశారు. తాము ఎవరినీ విమర్శించకపోయినా... తమకు నోటాకంటే తక్కువ ఓట్లు వచ్చాయని అంటున్నారని, అలాంటి వాటిని పట్టించుకోబోమని వీర్రాజు త‌న‌దైన శైలిలో ఘాటు రిప్లై ఇచ్చారు. కేవలం రూ.500 కోట్లతో ఛత్తీస్‌ గఢ్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ నయా రాయ్‌ పూర్‌ ను నిర్మించిందని ఆయన గుర్తు చేశారు. కేంద్రం కంటే తామే ఎక్కువ ప్రగతి సాధించామని చంద్రబాబు చెబుతున్నారంటే కేంద్రం సాయం చేస్తోంద‌న్న భావ‌నే క‌దా అని ఆయన అన్నారు. ఎవ‌రు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.... రాష్ట్రంలో తాము ఎదుగుతామని వీర్రాజు అన్నారు. అందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదని ఆయన చెప్పారు. తాము బలపడటాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతుందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో బూత్‌ స్థాయి నుంచి బీజేపీని బ‌లోపేతం చేస్తామ‌ని చెప్పారు. 2014లో తమకు టీడీపీ 14 సీట్లు మాత్రమే ఇచ్చి అందులో నాలుగు చోట్లే గెలిచేటట్టు చేశారని అన్నారు. ఇండిపెండెంట్లను పోటీకి దింపి తమను దొంగ దెబ్బ తీశారని వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.