Begin typing your search above and press return to search.

బాబు ‘మారితేనే’ ఏపీ దశ మారుతుందట!

By:  Tupaki Desk   |   29 Jun 2018 11:51 AM GMT
బాబు ‘మారితేనే’ ఏపీ దశ మారుతుందట!
X
కేంద్రం ఏపీకి మొండి చేయి చూపుతోందన్నది ఇప్పుడు అంతటా వినిపిస్తున్న మాట. అయితే.. కేంద్రం మొండిచేయి చూపుతున్నది చంద్రబాబుకే కానీ ఏపీ విషయంలో కేంద్రానికి ఎలాంటి అభ్యంతరాలు లేవన్నది తాజాగా వినిపిస్తున్న మాట. బీజేపీ నేతల మాటలు అందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి. తాజాగా ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు అందుకు ఊతమిస్తున్నాయి. చంద్రబాబు అడిగితే ఏమీ ఇవ్వబోమని ఆయన అన్నారు. దీంతో ఏపీలో ప్రభుత్వం మారితే కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్న అంచనాలు వెలువడుతున్నాయి.

విశాఖ రైల్వే జోన్ - కడప స్టీల్ ప్లాంట్ కు బీజేపీ కట్టుబడి ఉందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగితే మాత్రం తాము ఏమీ ఇవ్వమని చెప్పారు. పనిలో పనిగా ఆయన టీడీపీలో లుకలుకల గురించీ మాట్లాడారు. ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ ఎంపీలంతా హడావుడి చేస్తున్నారని.. కానీ.. ఆ పార్టీకే చెందిన ఎంపీ సుజనా చౌదరి మాత్రం కనిపించలేదని అన్నారు.

మరోవైపు కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆమరణ దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేష్ పైనా ఆయన విమర్శలు చేశారు. రమేశ్.. కడపలో మూతబడ్డ ఫ్యాక్టరీలను ఎందుకు తెరిపించడం లేదని ప్రశ్నించారు. షేర్ల పేరుతో ఏళ్ల తరబడి ప్రజలను మోసం చేసిన కుటుంబరావు... ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఆపలేకపోతున్న డీజీపీ మాలకొండయ్య... టీడీపీ గౌరవ అధ్యక్షుడిగా మారిపోవడం బెటర్ అని ఎద్దేవా చేశారు.