Begin typing your search above and press return to search.

మాది పవిత్రం.. మీది ప్రారబ్ధం!!

By:  Tupaki Desk   |   6 March 2018 4:31 PM GMT
మాది పవిత్రం.. మీది ప్రారబ్ధం!!
X
ప్రస్తుత పరిణామాల తాలూకు పర్యవసానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా ఉంటాయని భారతీయ జనతా పార్టీ నాయకులు భావిస్తున్నారో మనకు తెలియదు గానీ.. మోడీ భజన చేసుకోవడంలోనే ఈ జన్మ సార్థకం అయిపోతుందని వారు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. మరీ.. కాస్తయినా తార్కికంగా ఆలోచించకుండా.. అడ్డగోలుగా ప్రజలు అసహ్యించుకునే స్థాయిలో.. వాస్తవాలతో నిమిత్తం లేకుండా.. మోడీని భజన చేయడానికి పూనుకుంటూ ఉంటే ఈ రాష్ట్రంలో తమ రాజకీయ భవిష్యత్తు సమూలంగా సమాధి అయిపోతుందనే విషయాన్ని వారు గ్రహిస్తున్నట్లు లేదు. అందుకే తాజాగా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు మరోసారి ప్రజలకు ఏవగింపు పుట్టిస్తున్నాయి.

‘చంద్రబాబు ఇప్పటిదాకా ఈ రాష్ట్రం కోసం ఏం తీసుకువచ్చాడు.. ఆయన తెచ్చిందంతా గాడిద పాలు’ అని సోము వీర్రాజు ఎద్దేవా చేస్తున్నారు. అదే సమయంలో.. ప్రధాని నరేంద్రమోడీ తెచ్చిన చెంబుడు నీళ్లు మాత్రం.. అతి పవిత్రమైన యమునా నదీ జలాలు అని ఆయన సెలవిస్తున్నారు. అతి పవిత్రమైన పార్లమెంటులోని మట్టిని తెచ్చారని తన్మయత్వంతో ప్రవచిస్తున్నారు.

తాము చేస్తే శృంగారం.. పరులు చేస్తే వ్యభిచారం అనే నీతి భారతీయ జనతా పార్టీ నాయకులకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియకపోవచ్చు. వారు చెబుతున్న ప్రతిమాటా.. మోడీ భజన చేయడం కోసం సమర్థిస్తున్న ప్రతి చర్యా అందుకు నిదర్శనాలుగానే కనిపిస్తున్నాయి.

రాష్ట్రం- కేంద్రం మధ్య నిధుల రాకడ- వినిమయంకు సంబంధించిన చర్చ జరుగుతోంది. ఆ అంశాలకు సంబంధించి నిర్దిష్టమైన సమాచారంతో చర్చ సాగించడానికి భాజపా నాయకులకు దమ్ములేదు. ధైర్యం లేదు.. ఆ సంగతి పక్కన పెట్టేసి.. అవాకులు చెవాకులు పేలుతూ.. మోడీని భజన చేసుకుంటూ ఉంటే.. రాష్ట్రంలో భాజపా పార్టీ సమాధి అయిపోయినా సరే.. మోడీ కరుణ ఉంటే.. ఎక్కడో ఒకచోట నుంచి రాజకీయ లబ్ధిని పొందుతూ ఉండచ్చులే... అనే ఉద్దేశంతో.. సోము వీర్రాజు లాంటి వాళ్లు ఇలా మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది.

‘‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు

కడివెడైన నేమి ఖరము పాలు’’

అనే పద్యంలో గాడిదపాలు ఎన్ని ఉన్నా దండగ అనే ఉద్దేశంతో సోము వీర్రాజు అలా అన్నట్టుంది. నిజానికి మోడీ తెచ్చింది అంతకంటె ఎక్కువ కాదుగానీ.. ఆయన కీర్తిస్తున్నాడు. ఆ మాటకొస్తే.. మోడీ పంచతం సేకరించి తెచ్చినా.. ‘అపవిత్రం పవిత్రోవా..’ అనేసి దానికి పవిత్రతను పులిమేట్టున్నారు భాజపా నాయకులు .