Begin typing your search above and press return to search.

అమరావతే రాజధాని...నేను చెబితే మోడీ చెప్పినట్టే: సోము వీర్రాజు

By:  Tupaki Desk   |   14 Dec 2020 1:35 PM GMT
అమరావతే రాజధాని...నేను చెబితే మోడీ చెప్పినట్టే: సోము వీర్రాజు
X
ఏపీలో అమరావతి రాజధాని వ్యవహారంపై కొంతకాలంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మిస్తామనంటూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పిలుపు ప్రకారం నవ్యాంధ్ర రాజధాని కోసం అమరావతి రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారు. అమరావతి రాజధానిలో తాత్కాలిక, శాశ్వత భవనాల నిర్మాణం కూడా ప్రారంభమైంది. అయితే, వైసీపీ అధికారంలోకి రాగానే 3 రాజధానులు అంటూ అమరావతి నుంచి రాజధానిని తరలించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి రైతులు ...వైసీపీ సర్కార్ వైఖరికి వ్యతిరేకంగా గత ఏడాదిగా ఉద్యమం చేస్తున్నారు. అయితే, రాజధాని వ్యవహరం రాష్ట్ర పరిధిలోదంటూ కేంద్రం అమరావతి అంశంపై చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో అమరావతి రాజధానిపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. 3 రాజధానుల ప్రతిపాదనను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ప్రధాని మోడీ మనిషిగా తాను ఈ మాట చెబుతున్నానని సోము వీర్రాజు షాకింగ్ కామెంట్లు చేశారు. నూతన వ్యవసాయ బిల్లులకు మద్దతుగా అమరావతిలో భారతీయ కిసాన్ సంఘ్ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏపీకి అమరావతే రాజధాని అని, అమరావతికి మోడీ మద్దతుందనడానికి మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రి నిర్మాణం నిదర్శనమని సోము అన్నారు. 3 రాజధానులకు తాము వ్యతిరేకం అని, అమరావతిలోనే రాజధాని ఉండాలన్న అంశంపై చర్చ లేదని అన్నారు. ఏపీ బీజేపీ కార్యాలయం కూడా విజయవాడలో నిర్మిస్తున్నామని సోము చెప్పారు. 3 రాజధానుల అంశంపై తాము జోక్యం చేసుకోలేమంటూ కేంద్రం గతంలో పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, తాము అమరావతికి మద్దతిస్తున్నామని, అమరావతి రైతులకు అండగా ఉంటామని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. అమరావతిపై జాతీయ స్థాయిలో బీజేపీ వైఖరికి, రాష్ట్ర స్థాయిలో బీజేపీ వైఖరికి తేడా ఉండడంతో ప్రజలు కన్ ఫ్యూజ్ అయ్యారు. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల ప్రతిపాదనను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, మోడీ మనిషిగా తాను చెబుతున్నా అంటూ సోము బల్లగుద్ది చెప్పడం ఆసక్తికరంగా మారింది.

రూ. 1800 కోట్లతో ఎయిమ్స్ నిర్మించామని, బెజవాడలో దుర్గమ్మ ఫ్లై ఓవర్ పూర్తీ చేశామని...ఇవన్నీ అమరావతే రాజధాని అనేందుకు నిదర్శనమని సోము చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బీజేపీ మాట తప్పే పార్టీకాదని, అమరావతిలోనే రాజధాని ఉండాలన్న నేపథ్యంలో బీజేపీ ఉద్యమం చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేయడంకూడా చర్చనీయాంశమైంది. 2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి అధికారం ఇస్తే.. అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తామని సోము ధీమాగా చెప్పారు. దీంతో, కేంద్రం నుంచి సోముకు గట్టి సంకేతాలు అందాయని..లేకుంటే ఇంత ధీమాగా అమరావతిపై వ్యాఖ్య చేయరన్న వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా...అమరావతి రైతుల ఉద్యమం మొదలై ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా సోము చేసిన ప్రకటన అమరావతి రైతులతో పాటు ఒక రాష్ట్రం-ఒక రాజధానికి (అమరావతి) మద్దతిస్తున్న వారికి కొత్త ఉత్సాహాన్నిస్తుందనడంలో సందేహం లేదు.