Begin typing your search above and press return to search.

సోము ఆప‌శోపాలు.. బీజేపీ గ్రాఫ్ పెరిగిందా?!

By:  Tupaki Desk   |   23 Sep 2020 3:45 AM GMT
సోము ఆప‌శోపాలు.. బీజేపీ గ్రాఫ్ పెరిగిందా?!
X
ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా సోము వీర్రాజు చెల‌రేగిపోతున్నారు. రాష్ట్ర చీఫ్‌గా ఆయ‌న బాధ్యత‌లు చేప‌ట్టాక‌.. ఒక్కొక్క ప‌రిణామం.. ఆయ‌న‌కు అనుకూలంగా ఉండ‌డంతోపాటు.. ఆయా ప‌రిణామాల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలోనూ ఆయ‌న స‌క్సెస్ అవుతున్నారు. ఉద్య‌మాలు అంటున్నారు. ధ‌ర్నాలు అంటున్నారు. వారానికో కొత్త అంశంతో ఆయ‌న రెచ్చిపోతున్నారు. ఇవ‌న్నీ కూడా ఆర్ ఎస్ ఎస్ మూలాల నుంచి వ‌చ్చిన ఆయ‌న‌కు అందివ‌చ్చిన వ‌రాల్లాగా మారిపోయాయి. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. గుళ్లు, వాటిపై జ‌రుగుతున్న దాడుల‌ను స‌మ‌ర్థంగా తిప్పికొడుతున్నారు. విమ‌ర్శ‌లు కూడా సంధిస్తున్నారు.

ఈ క్ర‌మంలో రాష్ట్ర బీజేపీ నాయ‌కుల‌కు ప‌నిలేద‌ని అనుకున్న వారంతా సైలెంట్ అయిపోయి.. ఆపార్టీలోని చిన్నా పెద్దా అంద‌రూ రోడ్లెక్కుతున్నారు. కానీ, వీటివ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఒన‌గూరే ప్ర‌యోజ‌నం ఏదైనా ఉందా? అనేది మిలియన్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. ప్ర‌జాకోణంలో చూసిన‌ప్పుడు.. ఎక్క‌డో అతి క‌నిపిస్తోంది. కీల‌క‌మైన స‌మ‌స్య‌ల‌పై ఏ ఒక్క‌రూ మాట్టాడ‌డం లేదు. పెట్రోలు ధ‌ర‌లు పెంచారు. కూర‌గాయ‌ల ధ‌ర‌లు పెరిగాయి. నిరుద్యోగ స‌మ‌స్య తాండ‌విస్తోంది.. వీటిని వ‌దిలి పెట్టి.. సోము కేవలం హిందూత్వ అజెండాతో ముందుకు సాగుతున్నారు. ఇది ఆయ‌న‌కు ఆర్ ఎస్ ఎస్ వాదిగా మంచి మార్కులు వేయిస్తే..వేయిచొచ్చు.

కానీ, ప్ర‌జాకోణం.. ఓటు బ్యాంకు విష‌యాల‌ను స్పృశించాల్సి వ‌స్తే.. ప్ర‌స్తుతం తీసుకున్న లైన్ పెద్ద‌గా ఉప‌యోగంలో రాద‌నేది బీజేపీలోని ఓ వ‌ర్గం నేత‌లమాట‌. గ‌తంలో బీజేపీ నుంచి ఎదిగిన ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు, విశాఖ మాజీఎంపీ కంభం పాటి హ‌రిబాబు వంటివారు ఆర్ ఎస్ ఎస్ మూలాల‌ను ప‌ట్టుకుంటూనే మ‌రోరూపంలో ప్ర‌జాకోణంలోనూ స్పందించారు. అవివారిని ప్ర‌జానాయ‌కులుగా నిల‌బెట్టాయి. ఓటుబ్యాంకును కూడా సుస్థిరం చేశాయి. ఈ క్ర‌మంలోనే అటు నెల్లూరు, తిరుప‌తి వంటి చోట్ల వెంక‌య్య ప్ర‌భావం చూపించారు. ఇటు విశాఖ స‌హా చుట్టుప‌క్క‌ల జిల్లాల్లోనూ బీజేపీ పుంజుకుంది.కానీ, ఇప్పుడు పూర్తిగా ప్ర‌జా కోణాన్ని వ‌దిలేసి చేస్తున్న సోము ఫీట్లు.. బీజేపీకి ఉప‌యోగ‌ప‌డే ప‌రిస్థితి లేద‌ని స‌మ‌యానికి త‌గిన విధంగా ప్ర‌ణాళిక‌లు వేసుకుని ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు. మ‌రి సోము వింటారా? చూడాలి.