Begin typing your search above and press return to search.

బాబును వీర్రాజు ఇరుకున ప‌డేశారుగా!

By:  Tupaki Desk   |   18 Jun 2017 9:41 AM GMT
బాబును వీర్రాజు ఇరుకున ప‌డేశారుగా!
X
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుకు క్ష‌ణ‌కాలం కూడా కంటి మీద కునుకు లేకుండాపోతోంది. ఇందుకు నిత్యం యాక్టివ్‌గా ఉండే విప‌క్షంతో పాటు ఎప్ప‌టిక‌ప్పుడు వివాదాలు - విమ‌ర్శ‌ల్లో కూరుకుపోతున్న సొంత పార్టీ నేత‌లు - ప్ర‌భుత్వ పాల‌న‌పై మిత్రప‌క్షం బీజేపీ నుంచి దూసుకువ‌స్తున్న విమ‌ర్శ‌నాస్త్రాలు... వెర‌సి నిజంగా బాబుకు కంటి మీద కునుకు ప‌డ‌టం లేదు. సాగ‌ర న‌గ‌రం విశాఖ‌లో ఇప్ప‌టిదాకా వ‌రుస‌గా వెలుగుచూసిన భూ కుంభ‌కోణాలు టీడీపీ ప్ర‌తిష్ఠ‌ను మంట‌గ‌లిపాయ‌నే చెప్పాలి. తొలుత పార్టీ కార్యాల‌యం కోసం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఎంపిక చేసిన భూమిపై వివాదం రేగింది. ఆ భూమి దురాక్ర‌మ‌ణ‌కు గురైన భూమేన‌ని విప‌క్షాలు ఆరోపించ‌గా, స‌ద‌రు భూమి విలువ ఎంత లేద‌న్నా... వెయ్యి కోట్ల రూపాయల పైమాటేన‌ని, అందులో లోకేశ్ కు ప్ర‌త్య‌క్షంగా సంబంధాలున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.

ఈ క్ర‌మంలో విశాఖలో వ‌రుస‌గా భూదందాలు వెలుగుచూడ‌గా, పార్టీ సీనియ‌ర్ నేత‌ - చంద్ర‌బాబు కేబినెట్‌ లో కీల‌క శాఖ మంత్రిగా ఉన్న చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు కూడా ఆ ఆరోప‌ణ‌ల‌న్నీ నిజ‌మేన‌న్న రీతిలో స్వ‌రం పెంచారు. త‌న‌ను కూడా భూబ‌కాసూరులు బెదిరించార‌ని, భూ కుంభ‌కోణాల‌పై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. దీంతో ప‌రిస్థితి మ‌రింత‌గా వేడెక్కింది. ఈ క్ర‌మంలో కాసేప‌టి క్రితం టీడీపీకి మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీకి చెందిన కీల‌క నేత‌ - ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు రంగంలోకి దిగారు. భూ కుంభ‌కోణాల‌పై నేరుగా చంద్ర‌బాబుకు లేఖాస్త్రం సంధించారు. టీడీపీలో చేరిన కొంద‌రు నేత‌లే భూ కుంభ‌కోణాల‌కు పాల్పడుతున్నార‌ని, వారిపై చంద్ర‌బాబు చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని కూడా ఆయ‌న డిమాండ్ చేశారు.

ఈ త‌ర‌హా నేత‌లంతా ఎన్నిక‌ల‌కు ముందుగా టీడీపీలో చేరార‌ని, పార్టీ అధికారంలోకి రావ‌డంతో త‌మ హ‌స్త లాఘ‌వాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం ప్రారంభించార‌ని ఆయ‌న నిప్పులు చెరిగారు. వీరిపై చ‌ర్య‌లు తీసుకునే విష‌యంలో మీన‌మేషాలు లెక్కించాల్సిన అవ‌స‌రం ఎంత‌మాత్రం లేద‌ని, వీరిపై మెత‌క ధోర‌ణితో ముందుకు సాగితే మొదటికే మోసం వ‌స్తుంద‌న్న కోణంలో ఆయ‌న చంద్ర‌బాబుకు డేంజ‌ర్ బెల్స్ మోగించారు. అక్ర‌మాల‌కు పాల్ప‌డేవారు మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో గెల‌వ‌కుండా చూడాల‌ని కూడా ఆయ‌న చంద్ర‌బాబుకు సూచించారు. అంత‌టితో ఆగ‌ని వీర్రాజు... ఇప్ప‌టిదాకా వెలుగుచూసిన భూకుంభ‌కోణాల‌పై అన్ని రాజ‌కీయ ప‌క్షాల‌తో చ‌ర్చించాల‌ని కూడా డిమాండ్ చేశారు. మ‌రి వీర్రాజు లేఖ‌కు చంద్ర‌బాబు నుంచి ఎలాంటి స‌మాధానం వ‌స్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/