Begin typing your search above and press return to search.

ఎలాంటి సోము ఎలా అయ్యాడు? పరువు మొత్తం పాయె

By:  Tupaki Desk   |   17 Nov 2021 7:30 AM GMT
ఎలాంటి సోము ఎలా అయ్యాడు? పరువు మొత్తం పాయె
X
ఎలాంటోడు ఎలా అయిపోయాడన్నట్లుగా ఉంది ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పరిస్థితి. ఒక వ్యూహం అన్నది ఉన్నదా? అన్న సందేహం కలిగేలా వీర్రాజు తీరు ఉంటుంది. జాతీయ పార్టీ పాలసీలకు భిన్నంగా ఆయన తీరు ఉంటుంది.

ఏపీలో ఆయనేం చెబితే అదే వేదమన్నట్లు ఉంటుంది. ఒక పద్దతి పాడు లేకుండా.. ఒక వ్యూహం అన్నది లేకుండా అంతా తానై అన్నట్లు వ్యవహరించే ఆయన.. ఎప్పుడేం మాట్లాడతారో కూడా అర్థం కాని పరిస్థితి. ఇలాంటి వేళ..ఆయన్ను ప్రశ్నించే కన్నా మౌనంగా ఉండటమే మంచిదన్నట్లుగా ఏపీ బీజేపీ నేతలు పలువురు మౌనాన్నిఆశ్రయిస్తూ ఉంటారు.

ఆ మధ్యన ఒక మీడియా సంస్థతో జరిగిన లొల్లి నేపథ్యంలో.. జాతీయ పార్టీ నాయకత్వం అభిప్రాయాన్ని తీసుకోకుండా.. ఆ మీడియా సంస్థ మీద బ్యాన్ విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా క్లాస్ పీకటమే కాదు.. సోము వారి ఒంటెద్దు పోకడలపై ఒక స్థాయిలో విరుచుకుపడ్డారు.

పార్టీ సమావేశంలో అందరి ముందు తలంటిన అమిత్ షా.. ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్న విషయాన్ని స్పష్టం చేశారు.అంతేకాదు.. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రలో పాల్గొనకుండా ఎందుకు ఉన్న విషయాన్ని నిలదీశారు.

అమిత్ షా భేటీ తర్వాత తాము సమయానికి తగ్గట్లు రైతుల పాదయాత్రలో పాల్గొంటామన్న ప్రకటన చేశారు. మొత్తంగా అమిత్ షాతో భేటీ తర్వాత ఇంతకాలం సోముకు ఉన్న వెయిట్ కాస్తా పోయిన పరిస్థితి. ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకోకూడదన్న విషయంతో పాటు.. ఆయన వ్యతిరేక వర్గానికి బలం చేకూరేలా షా మాటలు ఉన్నాయి.

ఇంతటి అవమానాన్ని ఇటీవల కాలంలో సోముకు ఎప్పుడూ ఎదురైందని లేదంటున్నారు. అమిత్ షా పర్యటన తర్వాత ఏపీ బీజేపీలో సోము వీర్రాజు పరపతి మొత్తం పోవటమే కాదు.. అందరిని సంప్రదించి.. అందరి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు ఉండాలన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఇంతకాలం తనకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరించే సోముకు.. రానున్న రోజుల్లో సవాళ్లు మరింతగా పెరగనున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ నాయకత్వ బాధ్యతల్ని కొనసాగించే కన్నా.. సరెండర్ చేసి తప్పుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. సోము ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.