Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా లెవెల్ లో సోము... ?

By:  Tupaki Desk   |   29 Dec 2021 10:41 AM GMT
పాన్ ఇండియా లెవెల్ లో సోము... ?
X
ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు వైసీపీ అంటే సాఫ్ట్ కార్నర్ ఉంది అన్న విమర్శలు సొంత పార్టీలోనే ఉన్నాయి. దాంతో ఆయన ఈ ముద్ర నుంచి బయటపడాలనుకున్నారు. దానికి సరైన వేదిక తమ పార్టీ ఏర్పాటు చేసిన ప్రజాగ్రహసభగా భావించారు. అంతే సోము వీర్రాజు వీర లెవెల్ లో రెచ్చిపోయారు. జగన్ సర్కార్ మీద మాటల బాంబులే పేల్చారు. జగన్ కి ఏం చూపించాలో అది చూపించే పార్టీ ఒక్క బీజేపీయే అంటూ గుంటూరు మిర్చీని మించేలా ఘాటు డైలాగులు వేశారు.

అంతటితో ఆగని సోము ఆ దూకుడులో చేసిన ఒక కామెంట్ ఇపుడు పాన్ ఇండియా లెవెల్ లో తెర వైరల్ అవుతోంది. ఏకంగా బీజేపీనే దేశంలో ఇరకాటంలో పడవేసేలా చేసిన సోము వాచాలాత్వం చూసి జాతీయ నాయకత్వమే తల పట్టుకునేలా ఉందని అంటున్నారు.

సాధారణంగా ఎవరైనా అధికారంలోకి వస్తే పేదలకు పట్టెడు అన్నం పెడతాము, కట్టుకోవడానికి బట్టలు ఇస్తామని చెబుతారు. కానీ శ్రీమాన్ సోము వీర్రాజు మహాశయులు మాత్రం ఏపీలో అధికారం ఇచ్చి చూడు, చీప్ లిక్కర్ బాటిల్ యాభైకే కొట్టి చూడు అంటూ బంపర్ ఆఫర్ ని మందు బాబులకు ఇచ్చేశారు.

అంతేనా ఏపీలో కోటి మంది దాకా మందుబాబులు ఉన్నారని తనకే తెలిసిన లెక్కలు కూడా చెప్పేశారు. వారంతా కట్టకట్టుకుని బీజేపీకి ఓటెస్తే పవర్ గ్యారంటీ ఆ మీదట చీప్ లిక్కర్ ఫుల్ చీప్ గా ఇవ్వడం గ్యారంటీ అని వరాలు ఇచ్చేశారు. అంతే ఇదిపుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. దేశంలోని విపక్ష పార్టీలకు ఇపుడు బీజేపీకి విమర్శించడానికి ఆయుధం ఇచ్చినట్లు అయింది.

అసలే బీజేపీ అంటే ఒంటి కాలు మీద లేచే తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ సహా అనేక పార్టీల నేతలు ఒక్క లెక్కన బీజేపీతో చెడుగుడు ఆడేస్తున్నారు. బీజేపీకే కదా ఇలాంటి అద్భుతమైన ఆలోచనలు వస్తాంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇంకా ఇలాంటి మాస్టర్ ప్లాన్స్ ఏమేమి ఉన్నాయో చెప్పండి బాబూ అంటూ టీజ్ చేస్తున్నారు.

పొరుగున ఉన్న తెలంగాణా మంత్రి కేటీయార్ అయితే బీజేపీ నైతికత ఏ రేంజిలో ఉందో కదా అంటూ వ్యంగ్యాస్త్రాలు వేశారు. ఇంత మహత్తర పధకం కేవలం ఏపీ లాంటి చోటేనా మిగిలిన చోట్ల కూడానా అంటూ వెటకారమే ఆడారు. ఇక ఏపీలో సీపీఐ రామక్రిష్ణ అయితే సోము వీర్రాజు కాదు ఇక నుంచి సారాయి వీర్రాజు ఆయన పేరు అంటూ విమర్శించారు. ఇంతకీ సోము ఈ విధంగా కామెంట్స్ చేయడమేంటని బీజేపీ నేతలు కూడా మధనపడుతున్నారుట.

మరి సోము వైసీపీని తిట్టే వీరావేశంలో ఈ రకంగా కాస్తా బ్యాలన్స్ తప్పారేమో అన్న చర్చ అయితే ఉందిట. మొత్తానికి బీజేపీ అధికారంలోకి వస్తే తెచ్చే అద్భుతమైన పధకం ఏంటో ఏపీలోని అయిదు కోట్ల జనాలకే కాదు దేశమంతా తెలిసిపోయింది. సోము పుణ్యమాని ఏపీ బీజేపీ కీర్తి అలా పాన్ ఇండియా లెవెల్ లో ఎగబాకుతోంది అని సెటైర్లు పడుతున్నాయి.