Begin typing your search above and press return to search.

సోము వీర్రాజు సీను కాలుతుందా?

By:  Tupaki Desk   |   7 Dec 2015 7:09 AM GMT
సోము వీర్రాజు సీను కాలుతుందా?
X
మిత్రపక్ష ప్రభుత్వాధినేత చంద్రబాబుపై కొద్దికాలం కిందటి వరకు ఆపకుండా మాటల దాడి చేసిన బీజేపీ నేత సోము వీర్రాజు సైలెంటుగా ఉన్నారు. అందుకు కారణం ఆయనకు ఏం చేయాలో తోచక ఉక్కిరిబిక్కిరి స్థితిలో ఉండడమేనంటున్నారు. చంద్రబాబుపై స్థాయికి మించి, పరిధికి మించి వ్యాఖ్యలు చేసిన ఆయన తనకు ఏపీ బీజేపీ పగ్గాలు ఇస్తారని చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ ఛాన్సు దొరక్కపోగా ఈలోగా బీహార్ లో బీజేపీ ఓడిపోవడంతో టీడీపీతో మంచిగా వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో తాను ఎక్కువ మాట్లాడితే అధిష్ఠానం తనకు తలంటడం ఖాయమని అర్థం చేసుకున్న వీర్రాజు నోరు ఇప్పటికే మూత పడింది. వీర్రాజును పూర్తిగా అణగదొక్కడానికి ఇదే సమయమని టీడీపీ అనుకుంటోంది.

వీర్రాజు వ్యాఖ్యలను మొదట్లో పట్టించుకోని చంద్రబాబు ఆ తరువాత ఆయనపై దృష్టి పెట్టారు. ఊరుకున్న కొద్దీ వీర్రాజు పద్ధతి శృతి మించడంతో కౌంటర్ ఇవ్వాలని తెలుగు తమ్ముళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కూడా. దాంతో వీర్రాజుకు అదే స్థాయిలో కౌంటర్లిచ్చారు టీడీపీ నేతలు. కొద్ది రోజులుగా టీడీపీపై నోరు జారకుండా సైలెంట్ గా ఉన్న వీర్రాజు… తాజాగా చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన టీడీపీ బీజేపీ సమన్వయ కమిటీ సమావేశానికి డుమ్మా కొట్టారు. మొఖం చెల్లకే ఆయన రాలేదని భావిస్తున్నారు. మరోవైపు వీర్రాజు ధిక్కార ధోరణితో రాలేదన్న వాదనా వినిపిస్తోంది. దీంతో వీర్రాజుపై కన్నేసి ఉంచాలని చంద్రబాబు టీడీపీ నేతలను ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యంగా కాపులను టీడీపీకి వ్యతిరేకంగా మార్చేందుకు వీర్రాజు ప్రయత్నాలు చేస్తున్నాడని అనుమానిస్తున్న బాబు.. ఆయన ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకోవాలని ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపు నేతలను ఆదేశించినట్టు తెలుస్తోంది. మొత్తానికి వీర్రాజుపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు అర్థమవుతోంది. ఇప్పటికైనా వీర్రాజు తన దూకుడు తగ్గించుకోకపోతే పొలిటికల్ ఫ్యూచర్ కష్టమే మరి.