Begin typing your search above and press return to search.

హోదాపై బీజేపీ కూడా డ్రామాలు మొద‌లెట్టిందే!

By:  Tupaki Desk   |   24 March 2018 9:34 AM GMT
హోదాపై బీజేపీ కూడా డ్రామాలు మొద‌లెట్టిందే!
X
తెలుగు నేల విభ‌జ‌న అనంత‌రం తీవ్ర ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ను క‌ష్టాల క‌డ‌లి నుంచి గ‌ట్టెక్కించేందుకు ప్ర‌త్యేక హోదా అవ‌స‌రమ‌ని నాటి యూపీఏ ప్ర‌భుత్వంతో పాటు నాడు విప‌క్షంలో ఎన్డీఏ కూడా ఒకే మాట‌ను వినిపించాయి. ప‌దేళ్ల పాటు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామని యూపీఏ చెబితే... కాదు కాదు 15 ఏళ్ల పాటు హోదాను కొన‌సాగించాల‌ని బీజేపీ డిమాండ్ చేసింది. మొత్తంగా ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికార ప‌క్షం విప‌క్షంగా మారిపోగా... విప‌క్ష స్ధానంలోని బీజేపీ అధికారంలోకి వ‌చ్చేసింది. ఈ నేప‌థ్యంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా రావ‌డం ఖాయ‌మ‌ని, ఆ హోదా 15 ఏళ్ల పాటు కొన‌సాగ‌డం ఖాయ‌మ‌ని, వెర‌సి ఏపీ క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కడానికి మార్గం సుగ‌మ‌మైంద‌ని కూడా విశ్లేష‌ణ‌లు సాగాయి. అదీ కాకుండా.. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పాల‌నా ప‌గ్గాలు చేడితే... ఎన్డీఏలోని కీల‌క భాగ‌స్వామి టీడీపీ ఏపీలో అధికార ప‌గ్గాల‌ను చేజిక్కించుకుంది.

ఈ క్ర‌మంలో అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలోనే ఒకే కూటమి పాల‌న సాగుతున్న నేప‌థ్యంలో ఏపీ అతి త్వ‌ర‌లోనే క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కుతుంద‌ని అంతా భావించారు. ఇలాంటి భావ‌న వ‌చ్చి ఇప్ప‌టికి నాలుగేళ్లు దాటిపోతోంది. ఈ నాలుగేళ్ల‌లో ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీతో పాటు అటు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూడా భారీ డ్రామాల‌కు తెర తీశాయ‌ని చెప్పాలి. 14వ ఆర్థిక సంఘం పేరు చెప్పి ఇక‌పై ప్ర‌త్యేక హోదా ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని కేంద్రం చెబితే... కేంద్రానికి వంత పాడిన టీడీపీ స‌ర్కారు... హోదా కాకుంటే ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తామ‌న్నార‌ని, హోదా కంటే కూడా ప్యాకేజీతోనే మ‌రింత ఎక్కువ ల‌బ్ధి జ‌రుగుతుంద‌ని కూడా చంద్ర‌బాబు అండ్ కో బాకాలు ఊది మ‌రీ ప్ర‌చారం చేసింది. అప్ప‌టికీ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదాను ఇవ్వ‌కుండా అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా త‌మ‌దైన రీతిలో డ్రామాలు ఆడుతున్నాయ‌ని విప‌క్ష వైసీపీ ఎంత‌గా మొత్తుకున్నా ఫ‌లితం లేకుండా పోయింది.

ఈ క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌జ‌ల‌తో పాటు మిత్రప‌క్షంగా ఉన్న త‌మ‌ను కూడా బీజేపీ నేత‌లు మోస‌గించార‌ని ఇప్పుడు కొత్త త‌ర‌హా డ్రామాకు తెర తీసిన టీడీపీ నిజంగానే ర‌స‌వ‌త్త‌ర‌మైన నాట‌కానికి తెర తీసింద‌న్న వాద‌న వినిపిస్తోంది. మొత్తంగా ప్ర‌జ‌ల ముందు బీజేపీని దోషిగా నిల‌బెట్టి తాను త‌ప్పించుకోవాల‌ని టీడీపీ స‌రికొత్త పోరాటం చేస్తోంద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. ఈ క్ర‌మంలో నేటి ఉద‌యం మీడియా ముందుకు వ‌చ్చిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వినిపించిన ఓ కొత్త వాద‌న బీజేపీ నాట‌కాన్ని కూడా బ‌య‌ట‌పెట్టింద‌న్నకోణంలో విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ప్ర‌త్యేక హోదా ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగానే ఉన్నా... చంద్ర‌బాబు అవినీతి పాల‌న దానికి అడ్డుగా నిలుస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. అయినా ప్ర‌త్యేక హోదా ఇచ్చేందుకు బీజేపీ స‌ర్కారు సిద్ధంగానే ఉంటే.. ఆ మాట ముందుగా ఎందుకు ప్ర‌క‌టించ‌లేదన్న‌ది ఇప్పుడు మిలియన్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింద‌నే చెప్పాలి. బాబు అవినీతే అడ్డు అనుకుంటే... కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన‌ట్లుగా స్సెష‌ల్ స్టేట‌స్ వెహికిల్‌ను ఏర్పాటు చేయ‌డానికి ఇబ్బందేమిట‌న్న‌ది కూడా ఇక్క‌డ ప్రస్తావ‌నార్హ‌మే.

అయినా ఏదేనీ నిర్ణ‌యం తీసుకుని.. దానిని అమ‌లు చేయ‌డంలో కేంద్రానికి అడ్డేముంద‌న్న ప్ర‌శ్న కూడా ఇక్క‌డ కీల‌క‌మే. ఒక‌వేళ కేంద్రం నిర్ణ‌యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిలువ‌రించ‌ద‌లిస్తే... అదే విష‌యాన్ని ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డంతో పాటుగా స‌ద‌రు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని సుప్త చేత‌నావస్థ‌లో పెట్టేసి గ‌వ‌ర్న‌ర్ పాల‌న కింద ప్ర‌త్యేక హోదాను అమ‌లు చేసే వెసులుబాటు కూడా కేంద్రానికి ఉండ‌నే ఉంది క‌దా. అంతేకాకుండా చంద్ర‌బాబు స‌ర్కారు ఇంత మేర అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆరోపిస్తున్న బీజేపీ... ఆ అవినీతిపై త‌న వ‌ద్ద ఉన్న ఆధారాల‌తో బాబు స‌ర్కారుపై చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశాన్ని ఎందుకు వ‌దిలింద‌న్న‌ది కూడా ఇక్క‌డ ప్ర‌శ్న‌గానే మిగిలిపోయిందనే చెప్పాలి. మొత్తంగా నేటి ఉద‌యం బాబు స‌ర్కారుపై త‌న‌దైన శైలిలో పేట్రేగిపోయిన సోము వీర్రాజు... ఏపీకి ప్ర‌త్యేక హోదాపై బీజేపీ కూడా నాట‌కాలు ఆడుతోంద‌న్న విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టేశార‌న్న వాద‌న వినిపిస్తోంది. అటు టీడీపీతో పాటు ఇటు బీజేపీ కూడా నాట‌కాలు ఆడితే... ఏపీకి న్యాయం చేసేది ఎవ‌ర‌న్న కోణంలో స‌రికొత్త విశ్లేష‌ణ‌లు జ‌రుగుతున్నాయి.