Begin typing your search above and press return to search.
బాబు చరిత్రంతా తవ్వితీసి..వీర్రాజు కొత్త రచ్చ
By: Tupaki Desk | 17 May 2018 1:21 PM GMTఏపీ బీజేపీ సీనియర్ నేత - ఎమ్మెల్సీ సోము వీర్రాజు తన అలక వీడారు. అధ్యక్ష స్థానాన్ని ఆశించి భంగపడి...అజ్ఞాతానికి వెళ్లిన వీర్రాజు మూడ్రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. అయితే ఏపీలో కాకుండా హైదరాబాద్ లోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. కన్నడ రాజకీయంపై చంద్రబాబు స్పందించడం...ఆయా పార్టీలు జేడీఎస్ కు మద్దతుగా నిలవాలని కోరిన నేపథ్యంలో వీర్రాజు విరుచుకుపడ్డారు.
కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని పిలవొద్దని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారని ఆయన ఆ నైతికత ఉందా అని వీర్రాజు ప్రశ్నించారు. ``ఎన్టీఆర్ పై చెప్పులు విసిరించిన ఘనత చంద్రబాబుది. ఎన్టీఆర్ ను పడగొట్టిన చంద్రబాబు వాజపేయికి మద్దతు ఇవ్వలేదు. 1994లో ప్రజలు ఎన్టీఆర్ కు పట్టం కడితే - నాడు పార్టీని - ప్రభుత్వాన్ని చీల్చిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తికి కర్ణాటకపై మాట్లాడే నైతిక హక్కు ఉందా?
ఎన్టీఆర్ అల్లుడిగా చంద్రబాబును గౌరవిస్తే కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయన అదే బుద్ధితో వ్యవహరించారు. ఇప్పుడు కూడా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కోసం మాట్లాడుతున్నారు. నేషనల్ ఫ్రంట్ లో చక్రం తిప్పాను అని చెప్పాడు కానీ ఆ చక్రం కాంగ్రెస్‌తో తిప్పాడు. ఇవన్నీ బాబు కాంగ్రెస్ తో చేసిన దోస్తీకి నిదర్శనాలు. కాంగ్రెస్ తో బాబు ఇప్పటికీ అంట కాగుతున్నారు`` అని మండిపడ్డారు. గతంలో జాతీయ రాజకీయాల వలే ఇప్పుడు అదే తరహాలో కర్ణాటక లో కాంగ్రెస్ ని గద్దెనెక్కించాలని చూస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో పరిపాలనను పక్కనపెట్టేసిన చంద్రబాబు రాజకీయాల గురించి మాట్లాడటం చిత్రంగా ఉందని వీర్రాజు ఎద్దేవా చేశారు. ``బాబు పాలన అంత గాడి తప్పింది. ఈ మధ్య జరిగిన బోటు ప్రమాదంలో చనిపోయిన వారికి సంతాపం తెలపడం - ఎక్స్ గ్రేషియా ఇవ్వడం తప్ప - ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవడం లేదు. హిందు ధర్మం కూడా గాడి తప్పింది. టీటీడీలో పూజరులను 65 ఏళ్ళు దాటితో వారిని రిటైర్ చేయాలని చూస్తున్నారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదం అక్కడ కాకుండా ఇంకో దగ్గర వండడం పూర్తిగా ధర్మ విరుద్ధం. టీటీడీని ప్రక్షాళన చేయాలి. టీటీడీ బోర్డ్ లో సభ్యుడిగా ఉన్న శివాజీ క్రైస్తవుల కార్యక్రమాలకు హాజరుతున్నారు. అలాంటి వారిని ఎందుకు ఉంచుతున్నారు? వేల కోట్లు వస్తున్న టీటీడీ ఆదాయం ఎక్కడికి పోతోంది? టీటీడీలో విలువ దెబ్బ తీస్తున్న చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారు.`` అని వ్యాఖ్యానించారు.
ఏపీఎన్‌జీవో నేత అశోక్ బాబు తీరును ఉద్యోగులు ఆలోచించాలని వీర్రాజు కోరారు. ``ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటి వరకు జీతాలు పెంచలేదు. ఈ విషయం ఒక్క నాడు మాట్లాడని అశోక బాబు కర్ణాటక ఎన్నికల గురించి మాట్లాడుతున్నాడు. తెలంగాణ ఎందుకు కావాలో ఇక్కడి ఎన్జీవోలకు తెలుసు కానీ సమైక్యాంధ్ర ఎందుకు కావాలో ఆనాడు అశోక్ బాబుకు తెలుసా? ఇప్పుడు రాష్ట్రంలో పరిపాలన ఎలా సాగుతుందో..ఉద్యోగులకు మేలు చేస్తున్నారో లేదా ఆయనకు తెలుసా?`` అని వీర్రాజు ప్రశ్నల వర్షం కురిపించారు.