Begin typing your search above and press return to search.

బాబు రేంజికి ఎదిగేందుకు సోము ప్లాన్!

By:  Tupaki Desk   |   18 Feb 2018 12:30 PM GMT
బాబు రేంజికి ఎదిగేందుకు సోము ప్లాన్!
X
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఏపీ రాష్ట్రానికి చేయాల్సినవన్నీ చేసేసిందని.. ఇక చేయాల్సినవి కేవలం మూడేనని.. నిధులు కూడా గరిష్టంగా ఇచ్చేశారని.. రాష్ట్రప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఏపీ భాజపా నాయకులు పదేపదే ప్రకటనలు, ప్రెస్ నోట్ లు విడుదల చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయాలపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలంటూ.. ఏపీ మంత్రులు గంటా వంటివారు- చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా సవాళ్లు విసిరారు. అయితే ఆదివారం నాడు భాజపా ఫైర్ బ్రాండ్ నాయకుడు సోము వీర్రాజు మాత్రం.. ఈ బహిరంగ చర్చ సవాలును స్వీకరిస్తున్నట్లుగా ప్రకటించారు. తెదేపా తరఫున చంద్రబాబునాయుడు వచ్చేట్లయితే.. భాజపా తరఫున తాము కూడా చర్చకు వస్తాం అంటూ సోము వీర్రాజు అంటున్నారు. గతంలో తాను సొంతంగా వార్డు మెంబర్ గా ఓడిపోయిన అరుదైన ట్రాక్ రికార్డు ఉన్న ఈ నాయకుడు, ఈ చర్చ దెబ్బతో అయినా.. చంద్రబాబునాయుడుకు కౌంటర్ పార్ట్ నాయకుడి రేంజిని భాజపాలో సంతరించుకోవచ్చునని ముచ్చట పడుతున్నట్లుగా వ్యవహారం కనిపిస్తోంది.

నిజానికి తెలుగుదేశ తరఫున మంత్రులు గంటా శ్రీనివాసరావు వంటి వారు కూడా బహిరంగ చర్చకు సవాలు విసిరారు. భాజపా నాయకులకు చిత్తశుద్ధి ఉంటే.. తము చెప్పదలచుకున్న లెక్కలన్నీ వాస్తవాలే, నిజాయితీతో కూడిన లెక్కలే అనే నమ్మకం ఉన్నట్లయితే.. గంటా కాదు కదా.. తెలుగుదేశం తరఫున.. ఏ చిన్న నాయకుడు వచ్చినా.. ప్రభుత్వం తరఫున ఏ అధికారి వచ్చినా చర్చకు సిద్ధమని ప్రకటించాలి. అలా కాకుండా.. చంద్రబాబునాయుడు వచ్చేట్లయితే.. తాము కూడా చర్చకువస్తాం అని ప్రకటిస్తు న్నారంటేనే.. ఈ బహిరంగ చర్చ అనే ఎపిసోడ్ ను ఎలా అవాయిడ్ చెయ్యాలా? అని వారు వక్రమార్గాలు వెతుకుతున్నట్లుగా అర్థమైపోతోంది.

వచ్చిన నిధుల్ని దారి మళ్లించడంతో చంద్రబాబు ప్రభుత్వం కొంత దెబ్బ కొట్టినప్పటికీ.. రాష్ట్రానికి హక్కుగా దక్కవలసిన వాటిని పూర్తిగా ఇవ్వకుండా కేంద్రం చాలావరకు మాయమాటలతో మోసం చేస్తున్నదనే అభిప్రాయమే అటు సామాన్యులకు గానీ, ఇంకా ప్రకటించకపోయినప్పటికీ ఇంచు మించుగా జెఎఫ్‌ సి వంటి అధ్యయనం లో కూడా తేలుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో బహిరంగ చర్చకే గనుక కూర్చుంటే మొత్తం మునిగిపోతాం అని భాజపాకు పూర్తిగా అర్థమైనట్లుంది. దాన్ని తప్పించుకోడానికే చంద్రబాబు వస్తే తాము వస్తాం అంటూ అలవికాని మాటలు మాట్లాడుతున్నారని పలువురు అనుకుంటున్నారు.