Begin typing your search above and press return to search.
సోము సెటైర్!... ఏపీలో తండ్రీకొడుకుల పాలనే!
By: Tupaki Desk | 31 March 2018 5:18 AM GMTఏపీలో బీజేపీ - టీడీపీ మధ్య మైత్రి బెడిసికొట్టిన తర్వాత రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఈ మాటల తూటాలకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో తెలియదు గానీ... ఇరు పార్టీల మధ్య పొత్తు ఉన్నప్పటి నుంచి కూడా టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై తనదైన శైలిలో విమర్శలు - సెటైర్లు సంధిస్తూ వస్తున్న బీజేపీ సీనియర్ నేత - ఆ పార్టీ ఎమ్మెల్సీ సొము వీర్రాజుకు ఇప్పుడు నిజంగానే పట్ట పగ్గాల్లేకుండా పోయాయని చెప్పాలి. ఎందుకంటే... టీడీపీతో బీజేపీ కలిసి ఉన్నప్పటి నుంచి చంద్రబాబు పాలనలో పెద్ద ఎత్తున అవినీతి సాగుతోందని ఆయన చెబుతూనే ఉన్నారు. అవే మాటలు ఇప్పుడు బీజేపీకి చెందిన ఇతర నేతల నుంచి కూడా వినిపిస్తుండటం ఇప్పుడు నిజంగానే సోముకు మరింత ఉత్సాహం ఇచ్చినట్టేనన్న వాదన వినిపిస్తోంది.
ఈ క్రమంలో మరోమారు మీడియా ముందుకు వచ్చిన సొము... ఈ దఫా చంద్రబాబుతో పాటు చినబాబు నారా లోకేశ్, చంద్రబాబు కేబినెట్ లోని మంత్రులపైనా తనదైన శైలిలో విరుచుకుపడిపోయారు. అసలు ఏపీలో సాగుతున్నది ప్రభుత్వ పాలన కాదని, తండ్రీకొడుకుల పాలననేని ఆయన ఆసక్తికర విమర్శ చేశారు. అబ్బా బాబుల పాలన ఏపీలో మంత్రులను డమ్మీలుగా చేసేసిందని కూడా ఆయన తనదైన శైలి ఘాటు వ్యాఖ్య చేశారు. డిప్యూటీ సీఎంలుగా ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేరుకు మాత్రమే మినిస్టర్లనీ... వారిద్దరి చేతిలో అసలు ఇసుమంత అధికారం కూడా లేదని వీర్రాజు చెప్పారు. వీరిద్దరు పేరుకు మాత్రమే మంత్రులుగా కొనసాగుతున్నా.. వీరికి ఏ మాత్రం అధికారం ఇవ్వని చంద్రబాబు, చినబాబులు వారిద్దరినీ డమ్మీ మంత్రులుగా మార్చేశారని ఆరోపించారు.
ఇక చంద్రబాబు బీజేపీపై మండిపడుతున్న తీరుకు గల కారణాన్ని కూడా సోము వివరించేశారు. సీఎంగా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే క్రమంలోనే చంద్రబాబు బీజేపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారని విమర్శించారు. తమ పార్టీని దెబ్బ తీసేందుకు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో తెర వెనుక రాజకీయాలకు తెర తీశారని కూడా వీర్రాజు ఆరోపించారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా వద్దు - ప్రత్యేక ప్యాకేజీనే ముద్దు అంటూ కాలం వెళ్లదీసిన చంద్రబాబు... ఇప్పుడెందుకు మాట మారుస్తున్నారని ప్రశ్నించారు. అయినా ఏపీలో ఇప్పుడు సాగుతున్న పాలన ఎలా ఉందన్న విషయాన్ని ప్రస్తావించిన సోము... రాష్ట్ర పాలనను గాలికి వదిలేసి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే గురుతర బాధ్యతను వదిలేసి... పనికి మాలిన వ్యవహారాలన్నింటినీ బాబు సర్కారు భుజానికెత్తుకుందని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.