Begin typing your search above and press return to search.

ఉన్నట్లుండి సోమూ పవన్ మీద ఎందుకు పడ్డారో... ?

By:  Tupaki Desk   |   23 Dec 2021 11:35 AM GMT
ఉన్నట్లుండి సోమూ పవన్ మీద ఎందుకు పడ్డారో... ?
X
బీజేపీ ఏపీ బాస్ సోము వీర్రాజు అలికిడి ఈ మధ్య పెద్దగా కనిపించడంలేదు. ఏపీలో బీజేపీకి కోర్ కమిటీని వేశాక మళ్లీ సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ లాంటి ఎంపీలు సౌండ్ చేస్తున్నారు. సోము వీర్రాజు కూడా అపుడపుడు ట్వీట్లు వేస్తున్నా కూడా మునుపటి ఫైర్ అయితే కనిపించడంలేదు అన్న కామెంట్స్ ఉన్నాయి. ఇదిలా ఉండగా సోము సడెన్ గా తమ పార్టీ మిత్రుడు జనసేనాని అయిన పవన్ కళ్యాణ్ మీద ఎందుకు పడ్డారు అన్న చర్చ అయితే సాగుతోంది.

ఆ మాటకు వస్తే సోము పవన్ని గట్టిగా ఏమీ అనలేదు కానీ అన్నది చిన్నదైనా కాస్తా గుచ్చేలాగానే వ్యవహారం ఉంది అనిపిస్తోంది. ఎంతసేపూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద పవన్ మాట్లాడుతున్నారనే బాధ అయితే సోము కామెంట్స్ లో కనిపిస్తోంది. అందుకే ఒకింత బీజేపీకి ఫేవర్ గా మాట్లాడుతూనే పవన్ని ముగ్గులోకి లాగే ప్రయత్నం సోము చేశారు.

స్టీల్ ప్లాంట్ గురించి మాత్రమే కాదు, ప్రస్తుత గత ప్రభుత్వాలు అమ్మేసిన సంస్థల గురించి కూడా పవన్ మాట్లాడాలని సోము వీర్రాజు సూచించిన తీరు మంచిదే. అయితే అది కేవలం సూచన మాత్రమేనా దాని వెనక ఏమైనా విషయం ఉందా అన్నదే చర్చగా ఉందిపుడు. పవన్ కళ్యాణ్ సహా మెగా ఫ్యామిలీకి సన్నిహితుడుగా పేరు పొందిన సోము వీర్రాజు తాను ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాక అటు పవన్ని, ఇటు చిరంజీవిని కలసి వచ్చారు.

అలాగే పవన్ తో కలసి ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కూడా అప్పట్లో చాలా సార్లు చెప్పుకున్నారు. అయితే ఎందుకో సోము వీర్రాజు పోకడల పట్ల పవన్ తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ముందు నుంచే అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఏకపక్షంగా తిరుపతిలో బీజేపీ అభ్యర్ధి పోటీ చేస్తారని అప్పట్లో సోము వీర్రాజు చెప్పడం పవన్ కి ఆగ్రహం కలిగించింది అంటారు.

అదే విధంగా ఏపీలో బీజేపీ సొంతంగా కార్యక్రమాలు చేయడానికి చూడడం, జనసేనను కనీసం కలుపుకుని పోయే ప్రయత్నం చేయడం వంటివి కూడా గ్యాప్ పెంచాయని అంటారు. దాంతో కేంద్ర బీజేపీ పెద్దల దాకా వ్యవహారం వెళ్లిందని, ఆ పరిణామాలతోనే సోము వీర్రాజుని నామమాత్రుడిని చేసి ఏపీ బీజేపీలో సీనియర్లను కోర్ కమిటీ మెంబర్లుగా నియమించారని అంటారు. పవన్ వంటి మిత్రుడు బీజేపీకి అవసరం. దాంతో ఆయన కోసం ఏమైనా చేసేందుకు కేంద్ర బీజేపీ రెడీగానే ఉంటుంది.

అదే సమయంలో సోము వీర్రాజు అధ్యక్ష పదవి మీద కూడా సందేహాలు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ మనసులో పెట్టుకున్నారో ఏమో కానీ సోము ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయ్యారని అంటున్నారు.

అందుకే ఆయన పవన్ మీద చిన్నదో పెద్దదో కానీ ఒక బాణం వేశారని అంటున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏపీలో ప్రభుత్వ రంగ సంస్థలను అప్పట్లో అమ్మేసింది. ఇపుడు వైసీపీ కూడా వీలున్నవన్నీ అమ్మేస్తోంది. మరి ఈ రెండు ప్రభుత్వాల విషయాన్ని ప్రస్తావించకుందా పవన్ ఎంతసేపూ కేంద్ర ప్రభుత్వం మీద స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద మాట్లాడడం ఏంటి అన్నదే సోము అంతరంగం అయి ఉండవచ్చు.

అయితే ఆయన తెలివిగా కేంద్రంలోని బీజేపీకి మద్దతుగా మాట్లాడుతూ పవన్ ఒక్క స్టీల్ ప్లాంట్ ఇష్యూనే ఎత్తుతున్నారని చూపించాలనుకుంటున్నారని అంటున్నారు. మరో వైపు చూస్తే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సంస్థల అమ్మకాల మీద పవన్ మాట్లాడాలి అంటే కచ్చితంగా చంద్రబాబు మీద విమర్శలు చేయాలి.

బహుశా పవన్ బాబుకు పరోక్ష మిత్రుడు అన్న దానిని హైలెట్ చేయడానికా అన్నట్లుగా ఇలా లాగారా అన్న చర్చ కూడా నడుస్తోంది. మొత్తానికి సోము సూచనల సంగతి ఏమో కానీ ఈ ఇద్దరి మధ్యన గ్యాప్ అయితే ఉందని మాత్రం అర్ధమవుతోందని చెబుతున్నారు.