Begin typing your search above and press return to search.

కేజీహెచ్ అంటే మంటగా ఉందిట..?

By:  Tupaki Desk   |   2 Jan 2022 9:06 AM GMT
కేజీహెచ్ అంటే మంటగా ఉందిట..?
X
ఎవడురా భరతజాతిని కప్పమడిగిన తుచ్చుడు. ఎవడురా పొగరు పట్టిన తెల్ల దొరగాడు అంటూ మేజర్ చంద్రకాంత్ లోని ఎన్టీయార్ సాంగ్ ని వంటబట్టించుకున్నారులా ఉంది. అందుకే బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము ఎవడురా నా సొంత గడ్డ మీద పేర్లు పెట్టుకుని విర్రవీరే పరాయివాడూ అని వీరావేశం చూపిస్తున్నారు. గుంటూరులోని సెంటర్ మాది, జిన్నా పేరు మాత్రం కాదు, అక్కడ జిన్నా పేరు లేకుండా చేయాలి అని సోము డిమాండ్ చేస్తున్నారు. పనిలో పనిగా గుంటూరు దాటి వచ్చి విశాఖలోనూ సోము గర్జన చేస్తున్నారు.

కే అంటే కింగుట, జే అంటే జార్జిట. ఎవరు వారంతా అని నిగ్గదీసి అడుగుతున్నారు. వారు పరాయి వారు, బ్రిటిష్ వారు, వారి పేర్లు మన సంస్థలకు ఏంటని గుడ్లెర్రచేస్తున్నారు. సోము వాదన కరెక్టే అని కాసేపు అనుకున్నా అవి ఇవాళా నిన్నా పెట్టిన పేర్లా సామీ అని జనాల నుంచి గట్టిగానే రియాక్షన్ వస్తోంది.

ఏదో అలవాటు అయిపోయిన పేరు కేజీహెచ్ బాబూ/ కింగ్ జార్జిని మేము ఎవరం కలలో కూడా తలవం, షార్ట్ కట్ లో కేజీహెచ్ అనే అంటామని కూడా సగటు విశాఖవాసి చెబుతున్నాడు. మాకు అది పెద్దాసుపత్రి, ప్రాణాలను కాపాడే ఆరోగ్యప్రదాయిని. అంతవరకే మాకు తెలుసు. అంతకు మించి చరిత్ర మాకెందుకు సోమూ సార్ అని విశాఖ వాసులు బాగానే రిటార్ట్ ఇస్తున్నారు.

నిజానికి వందేళ్ల చరిత్ర కేజీహెచ్ కి ఉంది. అక్కడ అద్భుతమైన రాతికట్టడంతో ఆసుపత్రిని నిర్మించారు. ఈ రోజుకి దాని సరిసాటి నిర్మాణం మరోటి లేదని కూడా అంతా చెప్పగలరేమో. ఈ వందేళ్లలో ఎన్ని తుపాన్లకు విశాఖ చూసింది, సునామీతో పాటు ఎన్ని విపత్తులను ఎదుర్కొంది, అయినా కానీ కేజీహెచ్ కట్టడం మీద చిన్నమెత్తు గాటు కూడా లేదంటే నమ్మాల్సిందే.

అంత పకడ్బందీగా కేజీహెచ్ ని నాడు నిర్మించారు. పైగా ఉత్తరాంధ్రాతో పాటు ఒడిషా, చత్తీస్ ఘడ్ నుంచి వచ్చే ప్రజనీకానికి కూడా అక్కడ వైద్యం అందుతోంది. ఇలా శతాబ్దాల చరిత్ర కలిగిన కేజీహెచ్ పేరుని మార్చాలని సోము వీర్రాజు డిమాండ్ చేస్తున్నారు. అయితే విశాఖలో కలెక్టరేట్ కూడా ఉంది. దాన్ని కూడా బ్రిటిష్ వారే కట్టించారు.

ఇది కూడా కట్టుదిట్టమైన రాతి కట్టడమే. ఇక ఇదే నగరంలో బ్రిటిష్ వారు కట్టిన మరో ఆసుపత్రి కూడా ఉంది. అది ప్రసూతి ఆసుపత్రి. దాని పేరు విక్టోరియా ఆసుపత్రి. ఇది కూడా శతాబ్దాల తరబడి పేదలకు సేవ చేస్తోంది. మరి విక్టోరియా పేరుని కూడా మార్చాలా సోమీ సార్ అంటే ఏమంటారో. ఇక విశాఖకు రైల్వే ట్రాక్ వచ్చినా పోర్టు వచ్చినా, ఆంధ్రా విశ్వవిద్యాలయం వచ్చినావనా అదంతా బ్రిటిష్ వారి జమానాలోనే.

ఈ రోజున విశాఖ అభివృద్ధి చెందిందీ అంటే దానికి పునాది నాడే పడింది. ఇక బ్రిటిష్ వారి ఆనవాళ్ళు విశాఖలో అడుగడుగునా ఉన్నాయి. పరాయి పాలకుల రూపురేఖలు వద్దు, పేర్లు అంతకంటే వద్దు అంటూ సౌండ్ చేస్తున్న సోము ఈ అభివృద్ధిని కాదనగలరా అని మేధావులు కూడా ప్రశ్నిస్తున్నారు. విశాఖకు కేంద్రం నుంచి కొత్త ప్రాజెక్టులు తీసుకువచ్చి వాటికి బీజేపీ పెద్దలతో సహా ప్రముఖుల పేర్లు పెట్టమని సోము వీర్రాజు సిఫార్సు చేస్తే బాగుంటుంది తప్ప ఉన్న వాటినీ, జనాలకు మేలు చేస్తున్న వాటిని పేర్లు మార్చేయమనడం అంటే అందులో పక్కా రాజకీయం తప్ప మరేముంది అని అంతా అంటున్నారు. సో కేజీహెచ్ విషయంలో సోము చేస్తున్న డిమాండ్ బీజేపీకే బూమరాంగ్ అయ్యేలా ఉందని కామెంట్స్ పడుతున్నాయి.