Begin typing your search above and press return to search.

అందుచేత.. కాషాయ కిరీటం ఎవరికంటే?

By:  Tupaki Desk   |   19 Dec 2017 2:57 PM GMT
అందుచేత.. కాషాయ కిరీటం ఎవరికంటే?
X
ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీలో కూడా సొంతంగా అధికారం చేపట్టే స్థాయికి వచ్చేస్తుందని ఇప్పటికే ఒక దుమారం రేగుతోంది. అధికారంలోకి వస్తాం అని ఆశ పెట్టుకుంటున్న వారు కనీసం.. అధికారానికి ఆమడ దూరంలోకి అయినా.. రావాల్సి ఉంటుంది కదా.. లేకపోతే జనం నవ్వుతారు. అలా ఆమడదూరం వరకైనా రావాలంటే.. పార్టీ ఇప్పుడున్నట్లుగా ఈసురోమని ఉంటే లాభం లేదు కదా...! ఏదో ఢిల్లీ పెద్దలు రాష్ట్రానికి వచ్చినప్పుడు కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం.. చంద్రబాబు ఏదైనా వేడుకలు నిర్వహిస్తే.. ప్రభుత్వంలో తాము భాగస్వాములు అనే హోదా గుర్తు తెచ్చుకుని ఆయనతో కలిపి పాల్గొనడం .. ప్రస్తుతానికి జరుగుతున్న ఇదే తీరులో ఇక ముందు కూడా ఉంటే కుదర్దు కదా... ! అందుకే భాజపా గేరు మార్చే పరిస్థితి కనిపిస్తోంది.

ఘోరమైన విషయం ఏంటంటే.. మరో ఏడాదిలో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కలలు కంటున్న ఈ పార్టీకి రాష్ట్ర శాఖకు ఇప్పటిదాకా పూర్తిసమయం అధ్యక్షుడు లేరు. పదవి పూర్తయిపోయిన కంభంపాటి హరిబాబునే ఆపద్ధర్మంగా కొనసాగిస్తున్నారు. అయితే ఆయన పార్టీని గాడిలో పెట్టలేకపోతున్నారనే విమర్శలు జాస్తిగానే ఉన్నాయి. మర్రిచెట్టు నీడ లాంటి చంద్రబాబు ఆశ్రయంలో ఎదుగూ బొదుగూ లేకుండా పడి ఉన్న పార్టీని పైకి తీసుకురావాలంటే.. చంద్రబాబు ప్రభావానికి లొంగని నాయకుడు కావాలనే ఆలోచన అధిష్టానానికి ఉన్నట్లుంది.

ఈనేపథ్యంలో చంద్రబాబు మీద తరచుగా విరుచుకుపడుతూ ఉండే సోము వీర్రాజుకు రాష్ట్ర భాజపా అధ్యక్ష కిరీటం కట్టబెట్టాలని చూస్తున్నట్లుగా చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే చంద్రబాబు స్వయంగా ఆయన పదవికి అడ్డు పడినట్లు కూడా కొన్ని పుకార్లు వచ్చాయి. మొత్తానికి అధ్యక్షనియామకం కోసం ఎన్నిసార్లు పార్టీ సమావేశాలు జరిగినా నిర్ణయం మాత్రం రాలేదు.

ఇలాంటి నేపథ్యంలో తాజా పరిస్థితుల్లో.. పార్టీ అధ్యక్ష కిరీటం సోము వీర్రాజుకే దక్కే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో.. పార్టీని బలోపేతం చేసి.. వచ్చే ఎన్నికల సమయానికి బరిలోకి స్వతంత్రంగా కూడా దిగగలిగేలా తీర్చిదిద్దాలంటే.. ఆయన సమర్థుడని పార్టీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి బాబు కు వ్యతిరేక గళం వినిపించే కాషాయ నాయకుల జాబితాలో.. అధ్యక్ష పదవికోసం.. పురందేశ్వరి వంటి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి గానీ.. దూకుడుగా వ్యవహరించడం - రాష్ట్రమంతా తిరిగి పార్టీని నిర్మించడం - అన్నిటినీ మించి.. కుల సమీకరణలు అన్నింటి దృష్ట్యా సోము వీర్రాజు అయితేనే పార్టీకి లాభం జరుగుతుందని హైకమాండ్ అంచనా వేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే గనుక జరిగితే.. భాజపా-తెదేపాల మధ్య పొత్తుల సంగతి ఎన్నికల వేళకు తేలుతుంది గానీ.. అది తేలేదాకా చంద్రబాబుకు మాత్రం చికాకులు తప్పవని పలువురు భావిస్తున్నారు.