Begin typing your search above and press return to search.

తిరుపతిలో మాట్లాడేందుకు వీర్రాజు భయపడ్డాడా ?

By:  Tupaki Desk   |   16 Dec 2020 1:30 AM GMT
తిరుపతిలో మాట్లాడేందుకు వీర్రాజు భయపడ్డాడా ?
X
‘అమరావతిలోనే రాజధాని ఉండాలి. ఇందులో మరో మాటకు తావులేదు. మోడి ప్రతినిధిగా చెబుతున్నా అమరావతే ఏపి రాజధాని..3 రాజధానుల అంశాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది’ ..ఇది తాజాగా బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాజధానిపై చేసిన ప్రకటన. గుంటూరు జిల్లాలోని తుళ్ళూరులో జరిగిన భారతీయకిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో జరిగిన రైతు సమ్మేళనంలో వీర్రాజు పై ప్రకటన చేశారు. సరే ఇంతకాలానికి రాజధానిపై పార్టీ పరంగా స్పష్టమైన ప్రకటన చేశారు బాగానే ఉంది.

తిరుపతిలోనే రెండు రోజులు రాష్ట్ర కార్యవర్గ సమావేశాల జరిగాయి. ఆ సమావేశాలకు సోము వీర్రాజే అధ్యక్షత వహించారు. అనేక విషయాలపై కార్యవర్గంలో చర్చించారు. తర్వాత మీడియాతో కూడా వీర్రాజు అనేక విషయాలు పంచుకున్నారు. మరి అప్పుడు రాజధాని గురించి అధ్యక్షుడు ఎందుకు మాట్లాడలేదు ? అమరావతికి రాగానే రైతుల సమక్షంలో అమరావతే ఏపి రాజధాని అని చేసిన ప్రకటన తిరుపతిలోనే ఎందుకు చేయలేదు ? అనేది ప్రధాన ప్రశ్న.

రాజధాని అంశంపై తిరుపతిలోనే తమ స్టాండ్ ఏమిటో చెప్పుంటే బాగుండేది. అక్కడేమో రాజధాని తప్ప మిగిలిన అంశాలు మాట్లాడేసి అమరావతికి వచ్చిన తర్వాత అమరావతే ఏపి రాజధాని అని చెప్పటంలోనే వీర్రాజు డబుల్ గేమ్ అర్ధమైపోతోంది. పైగా ఓ నాలుగు రోజుల క్రితం వైజాగ్ వెళ్ళినపుడు కూడా వీర్రాజు అమరావతి గురించి ఏమీ మాట్లాడలేదు. అనంతపురం పర్యటనలో కూడా రాజధాని అంశం ప్రస్తావనకు రాకుండా వీర్రాజు జాగ్రత్తపడ్డారు.

అంటే ఎక్కడ ఏమి మాట్లాడాలనే విషయంలో చంద్రబాబునాయుడును బీజేపీ అధ్యక్షుడు పోటీ పడుతున్నట్లే అనిపిస్తోంది. పైగా ఇదే వీర్రాజు అద్యక్షుడైన కొత్తల్లో పార్టీ పరంగా అమరావతే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే మూడు రాజధానుల ఏర్పాటన్నది పూర్తిగా రాష్ట్రప్రభుత్వం ఇష్టమన్నారు. రాజధాని విషయంలో కేంద్ర జోక్యం ఉండదని కూడా బల్లగుద్ది మరీ చెప్పారు. స్ధానికవసరాలకు తగ్గట్లుగా రాజధాని విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని కూడా ఇదే వీర్రాజు చెప్పారు.

ఎలాగూ తొందరలోనే తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక జరగబోతోంది కదా. మూడు రాజధానుల అంశం లేకపోతే అమరావతి అంశంపై టీడీపీ, బీజేపీలు ప్రజాతీర్పును కోరటానికి సిద్ధపడితే బాగుంటుందేమో ఓసారి వీర్రాజు ఆలోచించకూడదు ? అమరావతిలో కూర్చుని మూడు రాజధానుల ప్రతిపాదనను జనాలందరు వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకుని ఆనందపడిపోతున్నారు. అలాంటిది తిరుపతి ఉపఎన్నికల్లో రాజధాని అంశాన్నే సింగిల్ పాయింట్ గా తీసుకుంటే సరిపోతుంది కదా. అయినా జగన్ కూడ అమరావతిని శాసన రాజధాని అనే అంటున్నారు కదా ?