Begin typing your search above and press return to search.

కూలిపనిలో తండ్రి.. గూగుల్ లో కొడుకు!

By:  Tupaki Desk   |   22 Dec 2016 7:30 PM GMT
కూలిపనిలో తండ్రి.. గూగుల్ లో కొడుకు!
X
రెక్క‌లు ముక్క‌లు చేసుకుని పిల్ల‌ల్ని చ‌దివించే తండ్రులు చాలామంది ఉంటారు. తాము తిన్నా ప‌స్తులున్నా పిల్ల‌ల్ని ప్ర‌యోజ‌కుల్ని చేయాల‌నుకుంటారు. పెద్ద‌పెద్ద చ‌దువులు చ‌దివిస్తారు. పిల్ల‌లు ప్ర‌యోజ‌కులు అయ్యాక‌... వృద్ధాప్యంలో త‌ల్లిదండ్రుల‌కు ఆస‌రాగా నిలుస్తారు! చేసిన అప్పుల్ని పిల్ల‌లు తీర్చేయాల‌ని కోరుకునే తండ్రులు చాలామంది ఉంటారు. ప్ర‌యోజ‌కుడైన కొడుకు ద‌గ్గ‌ర సేద‌తీరాల‌ని ఆశ‌ప‌డ‌తారు. కానీ, ఈ తండ్రి మాత్రం అలాకాదు!

రాజ‌స్థాన్ కు చెందిన తేజారామ్ కి ఒక కొడుకు ఉన్నాడు. కూలిప‌నితోనే కుటుంబాన్ని పోషించుకుంటూ వ‌చ్చాడు. కొడుకుని పెద్ద చ‌దువులు చ‌దివించ‌డం కోసం అప్పులు చేశాడు. అర్ధాక‌లితో రాత్ర‌న‌కా ప‌గ‌ల‌న‌కా దొరికిన కూలి ప‌నిచేస్తూ కొడుకును చ‌దివించాడు. తాను ప‌డ్డ క‌ష్టం త‌న కొడుక్కి ఉండ‌కూడ‌ద‌ని అనుకున్నాడు. తండ్రి ఆకాంక్ష‌కు అనుగుణంగానే తేజారామ్ కుమారుడు రామ‌చంద్ర కూడా ఉన్న‌త విద్య‌న‌భ్య‌సించాడు. ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసి... ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత సంస్థ గూగుల్ లో ఉద్యోగం వ‌చ్చింది. పెద్ద మొత్తంలో జీతం. దాంతో త‌న తండ్రి క‌ష్టాలు తీర్చేద్దాం అనుకున్నాడు. చదువు కోసం చేసిన అప్పుల్ని తీర్చేశాడు. తండ్రి కోసం ఇంటిని కూడా నిర్మించాడు. అయితే, కొడుకు త‌న‌ను ఎంతో బాగా చూసుకుంటూ ఉన్నా కూడా తేజారామ్ కూలి ప‌ని మాన‌డం లేదు!

‘ఈ వ‌య‌సులో ఆ ప‌నులు ఎందుకు..? కొడుకు బాగా సంపాదిస్తుంటే రెక్క‌లు విరిగేలా కూలి చేయాల్సిన అవ‌స‌రం ఏముంది..? హాయిగా విశ్రాంతి తీసుకోవ‌చ్చు క‌దా’ అని తేజారామ్ ని ప్ర‌శ్నిస్తే ఆయ‌న చెప్పే స‌మాధానం ఎలా ఉంటుందో తెలుసా... ‘కొడుకుని చ‌దివించ‌డం, ప్ర‌యోజ‌కుడిని చేయ‌డం ఒక తండ్రి బాధ్య‌త‌. అది నేను నిర్వ‌ర్తించాను. అంత మాత్రాన నా కొడుకు సంపాద‌న‌లో హ‌క్కు ఉంటుంద‌ని ఎలా అనుకుంటాను..? నా శ‌రీరంలో ఓపిక ఉన్నంత వ‌ర‌కూ నా క‌ష్టం మీదే నేను బ‌తుకుతాను’ అంటాడు! దీన్ని ఆత్మాభిమానం అనాలా, ఆదర్శం అనాలా... ఏమైనా కానివ్వండి. తండ్రీ కొడుకులిద్దరూ ఆదర్శప్రాయులే!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/