Begin typing your search above and press return to search.

తన తల్లి జాలీ సీరియల్ హత్యలపై కొడుకేమన్నాడంటే?

By:  Tupaki Desk   |   9 Oct 2019 5:45 AM GMT
తన తల్లి జాలీ సీరియల్ హత్యలపై కొడుకేమన్నాడంటే?
X
కనిపించే మనిషిలో కనిపించని మనస్తత్వం ఎలా ఉంటుందనటానికి కేరళకు చెందిన జాలీ ఉదంతం నిలువెత్తు నిదర్శనం. అమాయకంగా కనిపించే ముఖం. అందమైన రూపం.. అంతకు మించిన చలాకీగా వ్యవహరించే ఆమెలో సైకోకు ఏ మాత్రం తగ్గని నరహంతకుడు ఉన్నాడన్న విషయాన్ని ఒక పట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు. కట్టుకున్న భర్తను..ఆరేళ్ల చిన్నారి మొదలు అత్తా.. మామతో సహా మరో ఇద్దరిని చంపినట్లుగా ప్రాథమిక ఆధారాలు.. మరిన్ని హత్యలకు కూడా ఆమె కారణమై ఉంటుందన్నసందేహాలతో జాలీ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.

తినే ఆహారంలో సైనేడ్ కలిపి.. అయినోళ్లను చంపేసిన జాలీ ఉదంతం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆస్తి కోసం ఇంత దారుణానికి పాల్పడాలా? అన్నది పలువురి నోట వినిపిస్తున్న మాట. ఇక.. జాలీ పరిచయం ఉన్న వారు అయితే ఈ దారుణాల్ని ఒక పట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు. అమాయకంగా కనిపించే ఒక మహిళ సీరియల్ కిల్లర్ అన్న విషయం ఆధారాలతో సహా బయటకొచ్చిన వేళ.. ఆమె తీరును అంచనా వేయటానికి సైకాలజిస్టుల అవసరం తప్పనిసరి అవుతుందని పోలీసులు భావిస్తున్నారు.

విచారణను పకడ్బందీగా చేపట్టాలని కేరళ పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ కేసు దర్యాప్తు విషయంలో సైకాలజిస్ట్ అవసరం ఉందంటున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. జాలీకి బాగా తెలిసిన వారు.. సన్నిహితులు పలువురు ఆమె అమాయకురాలని.. అన్ని హత్యలు చేసి ఉండకపోవచ్చని.. ఆమెను అనవసరంగా ఈ కేసులో ఇరికించినట్లుగా చెబుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే..జాలీ కుమారుడు 21 ఏళ్ల రెమో థామస్ పరిస్థితి మహా ఇబ్బందిగా మారింది. హత్యలన్ని తన తల్లే చేసిందంటే ఆయన నమ్మలేకపోతున్నారు. కానీ.. హత్యలకు సంబంధించిన ఆధారాలన్ని ఆమెను దోషిగా చెబుతున్నాయంటున్నారు. అందుకే చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలంటున్నారు. ఈ కేసు విచారణ ముందుకు సాగే కొద్దీ.. మరిన్ని సంచలన నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.