Begin typing your search above and press return to search.

పార్టీలో కావాలని తాగించేసి.. బాత్రూంలో 2 గంటలు ఉంచేశారట

By:  Tupaki Desk   |   27 Aug 2022 6:55 AM GMT
పార్టీలో కావాలని తాగించేసి.. బాత్రూంలో 2 గంటలు ఉంచేశారట
X
గోవా టూర్ లో భాగంగా టిక్ టాక్ స్టార్ నటి కమ్ బీజేపీ నేత అయిన 42 ఏళ్ల సోనాలీ ఫోగాట్ ఆకస్మిక మరణానికి సంబంధించి షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. హఠాత్తుగా ఆమె గుండెపోటుకు గురి కావటంతో మరణించినట్లుగా వార్తలు వచ్చినా.. ఆ తర్వాత నుంచి వస్తున్న వార్తలు షాకింగ్ గా మారాయి. ఆమె ఒంటి మీద బలమైన గాయాలు ఉన్న వైనం పోస్టుమార్టం రిపోర్టు స్పష్టం చేయటం.. సోనాలీ కుటుంబ సభ్యులు సైతం ఆమె హత్యకు గురైందని ఆరోపణలు చేసిన నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగటం తెలిసిందే.

పోస్టుమార్టం రిపోర్టుతో ఆమెను హత్య చేశారని అనుమానిస్తున్న పోలీసులు.. అందుకు కారణంగా సోనాలికి అత్యంత సన్నిహితంగా ఉండే సుధీర్ సాగవాన్.. సుఖ్వీందర్ వాసిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గోవాలోని పార్టీకి వెళ్లిన ఆమెను అక్కడేం చేశారన్న దానిపై క్లబ్ లోని సీసీ కెమేరాల్ని చెక్ చేయగా.. కొత్త విషయాల్ని గుర్తించారు. సోనాలి చేత బలవంతంగా ప్రమాదకరమైన డ్రింక్ తాగించినట్లుగా గుర్తించారు.

ఇదే విషయాన్ని నిందితులు ఇద్దరు ఒప్పుకున్నట్లుగా చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆమెతో ప్రమాదకరమైన రసాయనాన్ని తాగించామని.. ఆ తర్వాత ఆమె స్పృహ కోల్పోయారని చెప్పారు. అనంతరం ఆమెను తీసుకొని టాయిలెట్ కు వెళ్లామని.. రెండు గంటలు అక్కడే ఉంచిన వైనం బయటకు వచ్చింది. బాత్రూంలో రెండు గంటలు ఆమెను ఉంచి.. ఏం జరిగిందన్న దానిపై మాత్రం వారు నోరు విప్పట్లేదని చెబుతున్నారు. తాము సేకరించిన ఆధారాల ప్రకారం సోనాలీకి డ్రగ్స్ ఇచ్చినట్లుగా పోలీసులు చెబుతున్నారు.

ఆమె మరణించిన తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లడం.. గుండెపోటుతో మరణించినట్లుగా ప్రచారం చేయటం తెలిసిందే. అయితే.. ఆమె ఒంటి మీద బలమైన గాయాలు ఉన్న విషయాన్ని పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొనటంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. వారిని కోర్టులో హాజరు పరచనున్నారు. అయితే.. సోనాలీ అనుమానాస్పద మరణం వెనుక హర్యానాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

సోనాలీకి డ్రగ్స్ ఇచ్చి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఉంటారని ఆమె సోదరుడు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో ఇదే ఆరోపణ చేశారు. ఈ సందర్భంగా ఆయనో కొత్త విషయాన్ని వెల్లడించారు.

సోనాలీకి గోవాకు వెళ్లే ప్లాన్ ఏమీ లేదని.. కానీ కుట్ర చేసి ఆమెను అక్కడకు తీసుకెళ్లినట్లుగా పేర్కొన్నారు. సినిమా షూటింగ్ కూడా లేదని.. వాస్తవానికి సినిమా షూటింగ్ ఆగస్టు 24న ఉందన్నారు. అయితే.. హోటల్ రూంలు మాత్రం ఆగస్టు 21-22కు బుక్ చేయటం చూసినప్పుడు కుట్ర కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కీలక నిందితులు నోరు విప్పితే కానీ అసలు విషయాలు బయటకు రావన్న మాట వినిపిస్తోంది.